చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా?
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:54 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
జగన్‌కు పవన్ సూటి ప్రశ్న
లడ్డూ నెయ్యి కల్తీని ఆయన ఎలా సమర్థిస్తారు?
జంతువుల కొవ్వు కలపడం దుర్మార్గం.. అయోధ్యకూ అవే లడ్లు పంపారు
చర్చి, మసీదులో చేసుంటే దేశం అల్లకల్లోలం
హిందువులకు జరిగితే మాట్లాడకూడదా?
ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం
వైసీపీ హయాంలో టీటీడీలో అవకతవకలు
గత ఐదేళ్లలో 219 ఆలయాలు అపవిత్రం
వైసీపీ తప్పులకు ఫుల్ స్టాప్ పెట్టాలి
నెయ్యి కల్తీకి గత టీటీడీ బోర్డుదే బాధ్యత
సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై విచారణ జరగాలి
పెదకాకాని, సెప్టెంబరు 22: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్‌ఏడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఇలాంటి నేతిని వినియోగించిన లక్ష లడ్డూలను అయోధ్య రామ జన్మభూమి మందిరానికి టీటీడీ పంపి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రతి హిందువూ, ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వేంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన ఆదివారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష మాలధారణ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కేబినెట్, అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్ వారిని ఎలా సమర్థిస్తారు? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? దోషులకు శిక్ష పడాల్సిందే. చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది. ప్రపంచం అంతా మాట్లాడేది. గ్లోబల్ న్యూస్ అయ్యేది. అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? సెక్యూలర్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా? హిందువులకు మనోభావాలు ఉండవా? ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా?
మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదని అంటున్నారు? మేము మాట్లాడతాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం. సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాను. తిరుమల ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి. నిన్న మీడియా ప్రతినిధులు సీబీఐ విచారణకు ఈ కేసు తీసుకువెళ్తారా అని అడిగారు. కేబినెట్‌లో చర్చ జరిగే విధంగా చూసి, దీనిపై నిర్ణయం తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరిస్తాం. తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో జరగకుండా చూేసలా మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని పవన్ స్పష్టం చేశారు. ‘‘నెయ్యి కల్తీపై గత టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. నాటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర పాలక వర్గంపై విచారణ జరగాలి. తప్పులు చేస్తే మాది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. టీటీడీ బోర్డు ఉన్నది ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే. దర్శనం టికెట్లు మీ వారికి ఇచ్చుకోవడానికో, మీ ఇష్టానికి కాంట్రాక్టులు ఇవ్వడానికో కాదు’’ అని పవన్ అన్నారు.
ఒక్కరూ ప్రశ్నించలేదు
‘‘తిరుమలో ప్రతి రోజు దాదాపు 15వేల కిలోల నెయ్యి వినియోగిస్తారు. కిలో నెయ్యి తయారీకి దాదాపు రూ.వెయ్యి ఖర్చవుతుంది. అలాంటిది రూ.360కే వస్తుందని మధ్యవర్తి చెబితే క్వాలిటీ చెక్ చేయకుండా ఎలా తీసుకుంటారు.? స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదు? వైసీపీ అంటే భయమా? లేక సుబ్బారెడ్డి అంటే భయమా? ఉద్యోగులు మౌనంగా ఉండి మహా అపరాధం చేశారు. ఈ అపరాధంతో నాకు సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నాను. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేశారు. ఐదుగురు కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వస్తే రూ.50వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ.500 చొప్పునే ఇచ్చారు. తప్పు జరుగుతోందని వేలెత్తి చూపినా వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసాదాల నాణ్యత తగ్గిపోయింది. లడ్డూను కూడా కల్తీ చేశారు. గత ప్రభుత్వంలో 219 ఆలయాలను అపవిత్రం చేశారు. రథాలు తగలబెట్టారు. రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారు. దోషులను పట్టుకోలేకపోయారు. వైసీపీ తప్పులకు ఫుల్ స్టాప్ పెట్టాలి. దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చోవడం కూడా తప్పే. ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. పగ, ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదు మాది’’ అని పవన్ అన్నారు.