Share News

Illegal Mining Case: అక్రమ మైనింగ్ కేసు.. విచారణకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:09 PM

Illegal Mining Case: నెల్లూరు క్వార్ట్జ్ అక్రమాల కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రభాకర్ రెడ్డి.. న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

 Illegal Mining Case: అక్రమ మైనింగ్ కేసు.. విచారణకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి
Nellore Illegal Mining Case

నెల్లూరు, ఏప్రిల్ 7: జిల్లాలో క్వార్ట్జ్ అక్రమాల కేసులో ( Illegal Mining Case) ఊరబండి ప్రభాకర్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం న్యాయవాదిని వెంటపెట్టుకుని మరీ రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు ప్రభాకర్ రెడ్డి. కాగా.. ఈ కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి సహా ప్రభాకర్ రెడ్డి, చైతన్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ప్రభాకర్ రెడ్డి.. న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చారు.


కాగా.. గత పదిరోజులకు పైగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ పోస్టింగ్‌లు పెట్టి పోలీసులకు సవాళ్లు విసురుతూ.. మరోవైపు పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో (AP High Court) కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్‌‌లపై విచారణ జరుగనుంది. దీంతో హైకోర్టులో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరి 16న కాకాణిపై కేసు నమోదు అయ్యింది. క్వార్ట్జ్ అక్రమాల కేసులో ఇప్పటికే మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కాకాణి పరారీలో ఉన్నారు.


కాగా.. కాకాణి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వగ్రామమైన తోడేరుకు అతి సమీపంలో వరదాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. 30 ఏళ్లుగా రుసుం మైన్స్‌... మైనింగ్స్ నడుపుతుండగా.. కాకిణి వారిని బెదిరించి, భయపెట్టి పారిపోయేలా చేయడంతో పాటు రుసుం మైన్స్‌ను హస్తగతం చేసుకున్నారు. దాంతో పాటు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా పెద్ద ఎత్తున క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు సాగించారు. దాదాపు 61 వేల మెట్రిక్ టన్నులకు పైగా రూ.250 కోట్లకుపైగా విలువ చేసే క్వార్ట్జ్‌ను తవ్వేసి చైనా వంటి దేశాలకు ఎగుమతులు చేశారు. నెల్లూరు అక్రమ మైనింగ్‌పై ఫిబ్రవరి 16న కాకిణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా పలుమార్లు నోటీసులు ఇచ్చారు. కానీ కాకాణి మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కాకాణి విషయంలో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.

kakani-hyder-police.jpg


కాకాణి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కాకాణి కదలికలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్పటికే కాకాణికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. కనీసం నోటీసులను కూడా తీసుకోని పరిస్థితి. నెల్లూరులోని కాకాణి ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులకు అతికించారు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లగా.. అక్కడ కూడా మాజీ మంత్రి లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే మూడు సార్లు కూడా కాకాణి విచారణకు రాలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు పది మంది నిందితులు ఉన్నారు. వారిలో ఇద్దరు మాత్రమే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. కాకాణితో పాటు మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ

YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 01:09 PM