వైద్యులపై దాడుల నిరోధానికి చట్టం తేవాల్సిందే!
ABN , Publish Date - Nov 24 , 2024 | 03:48 AM
దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక రక్షణ చట్టం తేవాల్సిందేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వీ అశోకన్ (కేరళ) డిమాండ్ చేశారు.
డిజిటల్ హెల్త్ మిషన్‌తో రోగుల గోప్యతకు భంగం
ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వీ అశోకన్
ఏపీ ఐఎంఏ 66వ రాష్ట్ర వార్షిక సదస్సులో వెల్లడి
గుంటూరు మెడికల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక రక్షణ చట్టం తేవాల్సిందేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వీ అశోకన్ (కేరళ) డిమాండ్ చేశారు. వైద్యులపై ఆటవిక దాడులు జరగడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో జరుగుతున్న ఐఎంఏ ఏపీ శాఖ 66వ వార్షిక రాష్ట్ర సదస్సుకు శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోకన్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పదేపదే వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయకుండా కాలయాపన చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేవలం 1.1 శాతం నిధులు కేటాయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దేశప్రజలందరికీ సార్వత్రిక ఆరోగ్య బీమాను అమలు చేయాల్సిన బాధ్యతల ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో రోగుల వివరాలకు గోప్యత లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఆయుష్మాన్ భారత్‌లో రోగులందరి ఆరోగ్య వివరాలను డేటాలో నమోదు చేస్తున్నారు. ప్రజారోగ్య అవసరాల కోసం ఈ వివరాలు ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటే మంచిదే. కాని కోట్లాది మంది రోగుల వివరాలను దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలకు, ఆరోగ్య బీమా రంగం సంస్థలకు అందితే పరిస్థితి ఏమిటని?’ డాక్టర్ అశోకన్ ప్రశ్నించారు. ఏ చట్టం కింద రోగుల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారో కేంద్ర స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు మాట్లాడుతూ వైద్యులకు, రోగుల మధ్య నమ్మకం ఉండాలని తెలిపారు. వైద్య రంగంలో సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అమలు చేయాలని, క్లినిక్‌లకు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఒకేస్ధాయి నిబంధనలు అమలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీచర్ ఎమ్మెల్సీ తరహాలో వైద్య రంగానికి సంబంధించి డాక్టర్ ఎమ్మెల్సీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కిషోర్, గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ వె సుబ్బారాయుడు, డాక్టర్ ఈదర కృష్ణమూర్తి, డాక్టర్ టీ సేవకుమార్, డాక్టర్ సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.