Share News

ఉద్యోగులకు అండగా..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:42 AM

గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికీ న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్‌ వారి పాలిట రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు.

ఉద్యోగులకు అండగా..!

సీపీఎ్‌సపై ప్రత్యేక విధానం: చంద్రబాబు

సకాలంలో పీఆర్‌సీ, పెన్షన్‌ ఇస్తాం.. ఉద్యోగులపాలిట రాక్షసుడిగా జగన్‌

వారంలో సీపీఎస్‌ రద్దన్నాడు.. అలాంటి వారాలు చాలా పోయాయి

ఫిట్‌మెంట్‌ ఇవ్వకుండా ఇబ్బందులు.. డీఏల్లేవు.. రివర్స్‌ పీఆర్‌సీ

25 వేల కోట్లకు పైగా బకాయిలు.. ఒక్క నెలలోనూ 1న పెన్షన్‌ ఇవ్వలేదు

మద్యం షాపుల వద్ద టీచర్లు కాపలా.. ప్రజల భూములు కొట్టేసేందుకు పన్నాగం

గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా.. ఇపుడు గులకరాయి నాటకం

పిట్టకథల బుగ్గన తిన్నదంతా కక్కిస్తా.. ప్రజాగళంలో టీడీపీ అధినేత హెచ్చరిక

నంద్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికీ న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్‌ వారి పాలిట రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎ్‌స)పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని.. పీఆర్సీ, పింఛన్‌ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్‌, నందికొట్కూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లుగా సచివాలయానికి వెళ్లని సీఎం, ఐదేళ్లలో ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించని సీఎం జగన్‌ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. సొంత ప్రయోజనాల కోసం కేబినెట్‌ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని.. బంగారు భవిష్యత్‌ ఉన్న యువతకు ఉద్యోగాలివ్వకుండా వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. సైకో జగన్‌రెడ్డికి ఒళ్లంతా అహంకారం పెరిగిపోయి, వ్యవస్థలను ధ్వంసం చేశారని.. అభివృద్ధిని విచ్చిన్నం చేసి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘డ్రగ్స్‌ రాష్ట్రంగా మార్చి యువతను గంజాయికి బానిసలుగా మార్చేస్తుంటే బాధగా ఉంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క రైతయినా బాగుపడ్డాడా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఏ ఒక్క వర్గమైనా బాగుపడిందా? వ్యవసాయాన్ని నాశనం చేశాడు. అన్నదాతల గొంతు నొక్కేయడంతో వారంతా దీనావస్థలో పడ్డారు. హార్టికల్చర్‌ను పూర్తిగా నాశనం చేశాడు’ అని దుయ్యబట్టారు. జగన్‌ దోపిడీ దొంగ అని, సొంత బాబాయిని చంపి చెల్లెలి మీద కేసు పెట్టిన వ్యక్తికి ఓటు వేయకుండా ఇంటికి సాగనంపాలని పిలుపిచ్చారు. మే 13న ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇంకా ఏమన్నారంటే..


సీపీఎ్‌సపై హామీ గాలికి..

జగన్‌ జమానాలో ఏ ఉద్యోగికీ స్వేచ్ఛలేదు. గద్దెనెక్కాక వారంలో సీపీఎ్‌సను రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. అలాంటి వారాలు చాలా పోయాయి. నేటికీ ఆ హామీ నెరవేర్చలేదు. ఫిట్‌మెంట్‌ ఇవ్వక నానా ఇబ్బందులు పెడుతున్నాడు. డీఏ ఇచ్చిన దాఖలాల్లేవు. రివర్స్‌ పీఆర్సీ ఇచ్చాడు. ఈ ఐదేళ్లలో పెన్షనర్లకు ఏ ఒక్క నెల కూడా ఒకటో తేదీన పింఛను ఇవ్వలేదు. ఉద్యోగులకు రూ.25 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టాడు. టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టాడు.

అప్పులు చేయడమే పాలనా?

ప్రజలు ఆస్తులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. వ్యవస్థను, చట్టాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలు భూములను కొట్టేయాలని చూస్తోంది. పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు. జగన్‌కు పాలన చేతకాక, సచివాలయాన్ని, ఆస్పత్రులను, ఆఖరికి మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పులు చేశాడు. 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ చార్జీలు పెంచను. చెత్త పన్ను తొలగిస్తా.

ఉద్యోగాలడిగితే ఫిష్‌మార్టులు

టీడీపీ ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తే.. జగన్‌ రూ.5 వేల వలంటీరు ఉద్యోగాలిచ్చాడు. నిరుద్యోగులు ఉద్యోగాల గురించి అడిగితే ఫిష్‌మార్టులు చూపిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి రాగానే యువత నైపుణ్యాభివృద్ధికి వీలుగా జనగణన నిర్వహించి, వారు ఎంపిక చేసుకున్న రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా బాధ్యత తీసుకుంటా. మెగా డీఎస్సీపైన సంతకం చేస్తా. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా. యువతకు ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి.


నాకు విశ్వసనీయత లేదా?

ప్రతి వ్యక్తికి పేరు, అడ్రస్‌ ఉంటుంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుష్టుడు జగన్‌. అలాంటి వ్యక్తి నాకు విశ్వసనీయత లేదంటాడు. నా విశ్వసనీయత తెలియాలంటే ఒక్కసారి హైదరాబాద్‌కు వెళ్తే అర్థమవుతుంది. నా విశ్వసనీయత తెలియాలంటే పోలవరం, అమరావతికి పోయి అడుగు తెలిస్తుంది.

మైనారిటీలకు అండగా ఉంటా..

బీజేపీతో టీడీపీ జతకట్టిందని, మసీదులను చంద్రబాబు కూల్చివేస్తాడని బుగ్గన చెబుతున్నాడు. అసలు ఎన్‌ఆర్సీ, సీఏఏ బిల్లులకు పార్లమెంటులో మద్దతు ఇచ్చిందే జగన్‌! మా ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనారిటీలకు అండగా నిలిచింది. జగన్‌ పాలనలో మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పిట్టకథల బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భారీగా దోచేశాడు.అవినీతితో బుగ్గన సంపాదించిన సొమ్మంతా మేం అధికారంలోకి రాగానే కక్కిస్తాం.

సీమలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా?

జగన్‌ పరిపాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. సీమకు తాగునీటి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇలాంటి వారికి ఓటు అడిగే హక్కు లేదు.

టీడీపీలోకి భారీగా ముస్లిం నేతలు

ఎన్నికల ముంగిట ముస్లింనేతలు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు.బీజేపీతో పొత్తు తర్వాత కూడా ఈ చేరికలు కొనసాగడం విశేషం. టీడీపీలో చేరిన ముస్లిం ప్రముఖుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌, గుంటూరు మాజీ ఎమ్మెల్యే సుభానీ తదితరులున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వక్ఫ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఇస్మాయిల్‌ నంద్యాలలో తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఒక ముస్లిం కో ఆప్షన్‌ సభ్యుడు టీడీపీలో చేరారు. అనంతపురం మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ నూర్‌ మహ్మద్‌ ఆ పార్టీలో చేరారు. జగన్‌ పాలనలో ముస్లింలకు ఆదాయ మార్గాలు, ఉపాధి అవకాశాలు బాగా దెబ్బ తిన్నాయని, అందుకే టీడీపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్‌ చెప్పారు.

Updated Date - Apr 30 , 2024 | 04:42 AM