Share News

Rushikonda : జగన్‌ సరేనంటే ప్రభుత్వ కార్యాలయమే!

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:27 AM

రుషికొండలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పర్యాటక శాఖ భవన సముదాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవచ్చని త్రిసభ్య కమిటీ ఇప్పటికే సిఫారసు చేసిందని, సీఎం జగన్‌ సరేనంటే సంతోషంగా ప్రభుత్వ కార్యాలయంగా

Rushikonda : జగన్‌ సరేనంటే ప్రభుత్వ కార్యాలయమే!

కాదంటే పర్యాటకానికే ఉపయోగిస్తాం

రుషికొండ భవనంపై రోజా వ్యాఖ్యలు

శారదా పీఠాధిపతితో కలిసి ప్రారంభోత్సవం

విశాఖపట్నం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రుషికొండలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పర్యాటక శాఖ భవన సముదాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవచ్చని త్రిసభ్య కమిటీ ఇప్పటికే సిఫారసు చేసిందని, సీఎం జగన్‌ సరేనంటే సంతోషంగా ప్రభుత్వ కార్యాలయంగా మార్చేస్తామని పర్యాటక మంత్రి రోజా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలో నిర్మించిన భవనాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి ఆమె గురువారం ఉదయం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్రిసభ్య కమిటీ ప్రతిపాదనకు సీఎం అంగీకరించకపోతే భవనాలను పర్యాటకుల కోసమే ఉపయోగిస్తామన్నారు. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జడ్‌) అనుమతితోనే వీటిని నిర్మించామని చెప్పారు. ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ.. భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కొద్దిరోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వ యకర్త వైవీ సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేసి ఈ భవనాన్ని ప్రారంభించినట్లు ప్రకటించినా.. విడుదల చేసిన ఫొటోల్లో ఎక్కడా క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు కనిపించలేదు.

దారిపొడవునా పోలీసు తనిఖీలు

రుషికొండలో ప్రభుత్వ కార్యక్రమం జరిగితే ఆ మార్గాన్ని పోలీసులతో నింపేస్తున్నారు. విద్యాలయాలు, ఐటీ కంపెనీల ఉద్యోగులను కూడా అడ్డగిస్తున్నారు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానితులను రుషికొండ వైపు వెళ్లకుండా వెనక్కి పంపించారు. మీడియా ప్రతినిధులను రుషికొండ పరిసరాల వరకు చేరనివ్వలేదు. రుషికొండ రహదారికి ఇవతలి వైపు నిల్చొని లోపలకు వెళ్తున్న వాహనాలను ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి ఫొటోలు తీయగా. ఆ ఫోన్‌ను ఓ పోలీసు అధికారి లాక్కున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ రుషికొండకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి, ముందుగానే హౌస్‌ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పటికే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో రుషికొండ వరకు వెళ్లకుండా ఆపేశారు. సీఎం జగన్‌ పర్యటనల్లో భద్రత పేరుతో హడావుడి చేసే పోలీసులు.. ప్రభుత్వ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా అడ్డంకులు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

సీఎం ఆఫీసుకని చెప్పే ధైర్యం లేక..మంత్రుల నాలుక మడత

వైసీపీలో అధినేత నుంచి మంత్రుల వరకు ‘చేసేది ఒకటి.. చెప్పేది మరొకటి’గా ఉంటోంది. దీనిని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నా వారి తీరులో మార్పు కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరించి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పల్లవి అందుకున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అని ప్రకటించారు. ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం కోసమని రుషికొండపై ఉన్న పర్యాటక శాఖకు చెందిన అందమైన హరిత రిసార్ట్‌ను కూలగొట్టి రూ.450 కోట్లతో రాజభవనం నిర్మించుకున్నారు. కానీ, న్యాయస్థానాల్లో కేసులు ఉండడంతో అది సీఎం క్యాంపు కార్యాలయమేనని చెప్పేధైర్యం చేయలేకపోతున్నారు. అందుకే ప్రారం భోత్సవానికి జగన్‌ ముఖం చాటేశారు.

కోడ్‌ వస్తుందనే హడావుడి..

ఇంకొద్దిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది. ఆ వెంటనే కోడ్‌ అమల్లోకి వస్తే రుషికొండ భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉండదు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ భవనాలనూ పీఠాధిపతులతో కలిసి ప్రారంభించిన దాఖలాలు లేవు. కానీ జగన్‌కు రాజగురువుగా వ్యవహరిస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో రుషికొండ భవనాన్ని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అందులోతొలి అడుగు పెట్టింది సీఎం చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, శారదా పీఠాధిపతే కావడం గమనార్హం.

9.88 ఎకరాలు.. ఏడు బ్లాకులు’

9.88 ఎకరాల్లో 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలోని ఏడు బ్లాకులకు.. వేంగి-ఏ, వేంగి-బీ, కళింగ, గజపతి, విజయనగర-ఏ, విజయనగర-బీ, విజయనగర-సీ అని పేర్లు పెట్టారు. నిర్మాణ పనులు మూడు దశల్లో పూర్తి చేశారు. తొలుతస్థలం అభివృద్ధి (కొండకు గుండు కొట్టడం), తర్వాత స్లోప్‌ ప్రొటెక్షన్‌ (చెట్లను నరికేసి వాటి స్థానంలో ఆకుపచ్చటి జియో మ్యాట్‌ వేయడం), ఆఖరుగా స్ట్రక్చర్లు, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు చేపట్టారు. నీటి సరఫరా కోసం రెండు సంపులు, వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం కోసం మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మించారు. విద్యుత్‌ సదుపాయం కోసం కంటెయినర్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. 1010 కేవీఏ సామర్థ్యం కలిగిన జనరేటర్లు మూడు పెట్టారు. స్థలం చదును, నిర్మాణాలు, మౌలిక వసతుల కోసం రూ.365.24 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి రోజా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పర్యాటక శాఖ రూ.450 కోట్లతో ఈ విలాసవంతమైన భవనాలు నిర్మించింది. గతంలో ఉన్న ఏపీటీడీసీ హరిత రిసార్ట్‌ను కూలగొట్టి 2020లో పనులు మొదలుపెట్టింది. వీటికి 2021లో కోస్తా నియంత్రణ మండలి ఆమోదం లభించింది. మహా విశాఖ నగర పాలక సంస్థ 2022లో నిర్మాణాలకు అనుమతులిచ్చింది. అగ్నిమాపక శాఖ నిరుడు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. అయితే పనులు పూర్తి కాకుండా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ కాకుండానే శారదాపీఠాధిపతి చేతుల మీదుగా ప్రారంభించారు.

బ్లాకుల్లో ఇవీ..

వేంగి-ఏ: సెక్యూరిటీ, బ్యాక్‌ ఆఫీసు, సూట్‌ రూమ్‌లు, రెస్టారెంట్‌

వేంగి-బీ: అతిథుల గదులు, సమావేశ మందిరాలు, రెస్టారెంట్‌తో కూడిన బిజినెస్‌ హోటల్‌

కళింగ: రిసెప్షన్‌ కమ్‌ వెయిటింగ్‌ ఏరియా, లగ్జరీ సూట్‌లు, సమావేశ మందిరం, బాంకెట్‌ హాల్స్‌.

గజపతి: హౌస్‌ కీపింగ్‌, కెఫ్‌టేరియా, వ్యాపార కేంద్రం.

విజయనగర-ఏ, బీ, సీ: ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లా సూట్లు, స్పా, ఫిట్‌నెస్‌ సెంటర్‌, బాంకెట్‌ హాల్‌.

Updated Date - Mar 01 , 2024 | 03:27 AM