Share News

YS Jagan: ఓహో.. చివరిదాకా సాగదీత ఇందుకేనా..!?

ABN , Publish Date - Jan 10 , 2024 | 04:49 AM

అసమ్మతి, తిరుగుబాట్లతో సతమతమవుతున్న సీఎం జగన్‌.. మూడో విడత అభ్యర్థుల జాబితా విడుదలకు సాహసించలేకపోతున్నారు.

YS Jagan: ఓహో.. చివరిదాకా సాగదీత ఇందుకేనా..!?

  • మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు.. పంచాయతీలపైనే దృష్టి

  • టికెట్లు రానివారు వేరే పార్టీలకు పోతారని భయం

  • ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగిస్తున్న జగన్‌

  • మచిలీపట్నం లోక్‌సభ బరిలో ఉండనని తెగేసి చెప్పిన పార్థసారథి కలిసి పనిచేసుకోవాలని మల్లాది, వెలంపల్లికి ముఖ్యమంత్రి సూచన

  • ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం

  • సోషల్‌ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలపై అభ్యంతరం

  • గొల్ల బాబూరావుకు రాజ్యసభ ఎర

  • చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకూ

అసమ్మతి, తిరుగుబాట్లతో సతమతమవుతున్న సీఎం జగన్‌.. మూడో విడత అభ్యర్థుల జాబితా విడుదలకు సాహసించలేకపోతున్నారు. టికెట్లు రాని ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్‌, జనసేనల్లోకి వెళ్తారేమోనన్న ఆందోళనే దీనికి కారణం. ఇన్నాళ్లూ చాలా మంది ఎమ్మెల్యేలను క్యాంపు ఆఫీసు ఛాయలకే రానివ్వలేదు. ఇప్పుడు ఫిరాయిస్తారేమోనన్న భయంతో కొందరిని తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒకే దఫాలో ముందస్తుగా వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసి.. ప్రచారపర్వంలో దూసుకెళ్లి.. ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండా చేయాలనుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి తాజా పరిణామాలతో డీలాపడ్డారు. టికెట్‌ దక్కని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తిరుగుబాట్లకు సిద్ధమవుతున్నారు. కొందరు టీడీపీ, జనసేన, కాంగ్రె్‌సల వైపు చూస్తున్నారు. ఈ వలసలను అడ్డుకోవడంపై జగన్‌ ఇప్పుడు దృష్టి సారించారు. జంపింగ్‌లను నివారించడానికి అభ్యర్థులపై కసరత్తును చివరిదాకా కొనసాగించాలని భావిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌ ఛాయలకే ఎమ్మెల్యేలను రానివ్వలేదు. అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నవారు ఎందరో. క్యాంపు కార్యాలయానికి వచ్చినా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారి ధనుంజయరెడ్డితో మాట్లాడి వెనుదిరగాల్సిందే. జగన్‌ దర్శనం దుర్లభమైపోయింది. 2-3 రోజుల వరకు ఇదే పరిస్థితి. టికెట్‌ దక్కని ఎమ్మెల్యేల ముఖమైనా చూసేందుకు, నచ్చజెప్పడానికి జగన్‌ ప్రయత్నమే చేయలేదు. తీవ్ర మనస్తాపంతో వారు వెనుదిరిగారు. అయితే ఆయన చెల్లెలు కాంగ్రె్‌సలో చేరడం.. ఏపీ పగ్గాలు చేపడతారన్న ప్రచారం.. టికెట్‌ రాని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమె వెంట నడుస్తానని ప్రకటించడం.. సీట్లు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతోపాటు కాంగ్రెస్‌ వైపు కూడా చూస్తుండడం..

తదితర పరిణామాలు జగన్‌ అండ్‌ కోను భయపెడుతున్నాయి. అందుకే ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించి మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తొలివిడత 11 మందిని.. రెండోసారి 24 మంది అసెంబ్లీ ఇన్‌చార్జులను, ముగ్గురు లోక్‌సభ ఇన్‌చార్జులను ప్రకటించిన ఆయన.. మిగతా వారి జాబితా విడుదలపై తొందరపడకూడదని భావిస్తున్నారు. ఇప్పుడే ప్రకటిస్తే వారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారని.. ఇదే జరిగితే ఎన్నికల్లో నష్టపోతామని .. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా చివరిదాకా సాగదీస్తేనే మంచిదని ఇప్పుడు అనుకుంటున్నట్లు తెలిసింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రె్‌సలో చేరతారన్న వార్తలతో మిగతావారు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్తలను జగన్‌ ఆదేశించినట్లు సమాచారం.

కప్పం కట్టేందుకు జంకు!

లోక్‌సభకు పోటీచేసేవారికి వైసీపీలో కొరత ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు భరించేందుకు ఎంపీ అభ్యర్థులెవరూ సిద్ధంగా లేరు. పైగా లోక్‌సభకు పోటీ చేయాలంటే రూ.180 కోట్లు.. ఎమ్మెల్యే అభ్యర్థి సగటున 30 కోట్లన్నా డిపాజిట్‌ చేయాలని జగన్‌ షరతు విధించడంతో పలువురు జంకుతున్నారు.

మెట్టుదిగని పార్థసారథి..

మచిలీపట్నం లోక్‌సభకు పోటీచేయాలని సీఎం జగన్‌ పదే పదే చెప్పినా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అంగీకరించడం లేదు. పెనమలూరు మినహా మరెక్కడా పోటీ చేయనని సోమవారం ముఖ్యమంత్రికే చెప్పివచ్చారు. మంగళవారం పార్థసారథితో ఎంపీ అయోధ్యరామిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.

పద్మావతికి జగన్‌ క్లాస్‌

శింగనమల దళిత మహిళా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైసీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరికీ అణిగిమణిగి ఉండాలి.. ఎవరినో సంతృప్తి పరచడానికి వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకోవాలి.. నీళ్లు ఇవ్వక పోయినా మాట్లాడకూడదు.. పొరపాటున మాట్లాడితే అది పెద్ద నేరం’ అంటూ ఆమె ఇటీవల తన ఆవేదనను సోషల్‌ మీడియాలో వీడియో ద్వారా తెలియజేశారు. దీనిపై తాడేపల్లి నుంచి ఫోన్లోనే క్లాస్‌ తీసుకున్న పెద్ద నాయకులు.. వెంటనే వచ్చి జగన్‌కు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. హుటాహుటిన వచ్చిన ఆమె.. మొదట సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిన తర్వాత సీఎంను కలిశారు. ‘నియోజకవర్గంలో ఏం జరుగుతోందో నాకు తెలుసు.. మీ కుటుంబ అవినీతి, ఆలయాల హుండీలను సైతం వదలకుండా బెదిరించడం, పార్టీ కార్యకర్తలను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడం, నా పేరు చెప్పి బెదిరించడం కూడా తెలుసు.. అయినా ఎందుకులే అని పక్కనబెట్టా, మాట్లాడకుండా పార్టీ కోసం పని చేయండి..’ అంటూ ఆమె భర్త సాంబశివారెడ్డి చిట్టాను సీఎం విప్పడంతో పద్మావతి కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చేసినట్లు తెలిసింది.

ప్రత్యామ్నాయం ప్రాసెస్‌లో!

హిందూపురం ఎంపీ టికెట్‌ కర్ణాటకకు బీజేపీ నాయకుడు శ్రీరాములు సోదరి శాంతకు గతవారం వైసీపీ కేటాయించడంతో సిటింగ్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అవాక్కయ్యారు. వెంటనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి.. హడావుడి చేశారు. మంగళవారం మళ్లీ మాధవ్‌ వచ్చారు. ఆయనను జగన్‌ లోపలకు పిలిచి ఒక మాట మాట్లాడినట్లు తెలిసింది. ఆయనను విలేకరులు పలకరించగా.. ‘ప్రత్యామ్నాయం ప్రాసె్‌సలో ఉంది’ అని అంటున్నారు.

మల్లాది విష్ణుకు బుజ్జగింపు...

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ముఖ్యమంత్రి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన స్థానాన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సకు కేటాయించడంతో విష్ణు అలక బూనారు. అనుచరులతో రాజీనామా చేయించేందుకు సిద్ధమయ్యారు. అయోధ్య రామిరెడ్డిని పంపి విష్ణుతో పాటు వెలంపల్లినీ పిలిపించి వారితో జగన్‌ మాట్లాడారు.

రాజ్యసభ వల!

అసంతుష్ట ఎమ్మెల్యేలను బుజ్జగింపు క్రమంలో జగన్‌ కొందరికి ఇతర పదవులతో గేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ పెట్టిన నాటి నుంచి తన వెంటే ఉన్న పాయకరావుపేట (ఎస్సీ) ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఈ దఫా మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. ఎస్సీల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆయన్ను రాజ్యసభకు పంపుతామని వైసీపీ పెద్దలు ప్రతిపాదించారు. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్‌, ఒంగోలు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్న జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డిని కూడా రాజ్యసభకు పంపుతున్నట్లు ప్రచారం చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికలు ఇప్పట్లో లేవు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి హామీలు ఇవ్వడం జగన్‌కు అలవాటేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చిలకలూరిపేటలో టికెట్‌ దక్కని మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తానంటూ ఆచప 2019లో బహిరంగ సభలోనే వెల్లడించారు. కానీ రెండున్నరేళ్లు సాగదీసి.. ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదని.. ఇప్పుడు అసెంబ్లీ టికెట్‌ నిరారించినవారికి రాజ్యసభ సీటు ఎరవేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బలమైన బలిజ సామాజికవర్గానికి చెందిన శ్రీనివా్‌సకు టికెట్‌ నిరాకరించి.. ఆయన పక్కచూపులు చూడకుండా రాజ్యసభకు పంపుతామని అంటున్నారని.. దీనిని ఆయా వర్గాలు నమ్మడం లేదని చెబుతున్నాయి.

Updated Date - Jan 10 , 2024 | 08:45 AM