‘జె’భూతం వెంటాడుతోంది!
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:05 AM
రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నా వారిని ‘జె(జగన్)’ భూతం వెంటాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు.. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య
స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం.. ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి
మంత్రులు పనితీరు మెరుగుపరచుకోవాలి.. నేర్చుకోవడం చిన్నతనంగా భావించొద్దు
ఇంత అనుభవమున్నా.. ఇప్పటికీ నేర్చుకుంటుంటాను.. ఇసుకపై ఇక ‘జె’ ట్యాక్స్ ఉండదు
ఉచిత ఇసుక శాశ్వత విధానం.. మనం ఉన్నంత కాలం ఉంటుంది
ప్రజాప్రతినిధులు తలదూర్చొద్దు.. భూములు, గనుల దోపిడీ కట్టడికి సమిష్టి నిర్ణయం
బియ్యం స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ: సీఎం
ఇసుక వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తలదూర్చవద్దు. చెడ్డపేరు తెచ్చుకోవద్దు. గత ప్రభుత్వం మాఫియా తరహాలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేసింది. మనకు అటువంటి పనులు అక్కర్లేదు.
భూములు, గనుల దోపిడీ ఎంత జరిగిందో సమాచారం సేకరించడానికి సమయం పడుతోంది. అధికారులు అంత వేగంగా కదలడం లేదు.
- కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు
పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు
కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నా వారిని ‘జె(జగన్)’ భూతం వెంటాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ భయం పోగొట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్నామని కూడా అన్నట్లు సమాచారం. ‘పరిశ్రమలు పెట్టాలని మనం కోరుతుంటే వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ భూతం మళ్లీ వస్తుందేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది’ అని మంగళవారమిక్కడ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. భూతాన్ని సీసాలో బంధించి తిరిగి పైకి లేవకుండా రాష్ట్ర ప్రజలు భూమిలో పాతిపెట్టారని చెప్పాలని ఒక మంత్రి సూచించినప్పుడు మిగిలిన మంత్రులంతా నవ్వేశారు. ‘మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తాము స్వేచ్ఛగా ఉన్నామన్న అనుభూతి రాష్ట్ర ప్రజల్లో వచ్చింది. భయం పోయింది. ఈ విషయంలో మన పట్ల ఉన్న సానుకూలతను మన పనితీరుతో మరింత పెంచుకోవాలి. ప్రతి మంత్రీ పనితీరును మెరుగుపరచుకోవాలి. నేర్చుకోవడాన్ని చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా తెలియని విషయాలను అడిగి తెలుసుకుంటాను. మీరు కూడా మీ శాఖలపై బాగా అవగాహన పెంచుకోండి. ప్రజలు ఎన్నో ఆశలతో మనల్ని గెలిపించారు. వాటిని మనం అందుకోవాలి. ప్రతి శాఖలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక సమస్యలూ ఉన్నాయి. నిధులు అవసరం లేని సమస్యలుంటే ముందు వాటిని పరిష్కరించండి. మీ పనిలో మీ కుటుంబాల జోక్యం లేకుండా చూసుకోండి’ అని సీఎం మంత్రులకు సూచించారు.
ఉచిత ఇసుక శాశ్వత విధానం
ఉచిత ఇసుక శాశ్వత విధానమని, టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇదే విధానం అమల్లో ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వెల్లడించారు. అవసరమైనప్పుడు మరింత మెరుగుపరుస్తామే తప్ప విధానంలో మార్పు ఉండదన్నారు. ఇసుక తవ్విన ఖర్చులు, పంచాయతీలకు సీనరేజీ చెల్లింపు తప్పవని, ఇంటి వరకూ ఇసుక రావాలంటే రవాణా ఖర్చు ఎవరికి వారు భరించాలని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఇసుకపై పైసా కూడా ఆదాయం తీసుకోదని, గతంలో మాదిరిగా ‘జె’ ట్యాక్స్ ఉండదని తెలిపారు. అవసరానికి ఇసుక తప్ప.. అమ్మకానికి కాదని, ఈసారి అవకతవకలకు తావు లేకుండా అమలు చేయాలని సూచించారు. వానాకాలంలో ఇసుక కొరతను అధిగమించే మార్గాలపై మంత్రివర్గం చర్చించింది. బోటు సొసైటీల ద్వారా వచ్చే ఇసుక, నదుల్లో పూడిక తీయడం ద్వారా వచ్చే ఇసుకతో ఈ లోటు భర్తీ చేస్తామని అధికారులు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు, గనుల దోపిడీపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎంత దోపిడీ జరిగిందో సమాచారం సేకరించడానికి సమయం పడుతోందని, అధికారులు అంత వేగంగా కదలడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయి నుంచి ఈ సమాచారం సేకరించాలని నిర్ణయించామన్నారు. ఈ దోపిడీలో భాగస్వాములై జేబులు నింపుకొన్న వారిని ఏం చేయాలన్నదానిపై సమావేశంలో పలు సూచనలు వచ్చాయి. ‘మనం ఏదో ఒకటి గాలివాటంగా మాట్లాడవద్దు. ప్రభుత్వంలో ఉన్నాం. ఏం చేసినా బాధ్యతగా చేయాలి. ఈ దోపిడీపై ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి. అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం’ అని సీఎం కోరారు. బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో తెర వెనుక ఉన్నవారిపై కూడా కఠిన చర్యలు ఉండాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ‘వైసీపీ హయాంలో నాటి కాకినాడ ఎమ్మెల్యే తండ్రి పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్. తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు. ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఇస్తారా? అందరూ కలిసిపోయి పేదల నుంచి చాలా తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొని కిలో రూ.43కు విదేశాలకు ఎగుమతి చేశారని మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇందులో కూడా మీకేమైనా ఆలోచనలు ఉంటే ఇవ్వండి’ అని మంత్రులను చంద్రబాబు కోరారు. పరిపాలనలో ప్రమాణాలు పెంచడానికి ‘గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్’ అనే సంస్థను నె లకొల్పే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
పంటల బీమాపై వైసీపీ మోసం..
పంటల బీమా పథకం ఎలా ఉండాలో ఖరారు చేసేందుకు వ్యవసాయం, ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రులతో కమిటీని వేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమయం తక్కువ ఉన్నందున ముందుగా ఈ ఏడాది వరకూ ఈ విధానం ఎలా ఉండాలో ఈ కమిటీ చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సంవత్సరాలకు నిర్ణయుస్తారు. గత టీడీపీ హయాంలో బీమా ప్రీమియంలో 40 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం, మిగతా 20 శాతం రైతులు భరించేవారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం తానే భరిస్తానని హడావుడి చేసినా రెండు మూడేళ్లుగా పైసా కూడా చెల్లించకుండా మోసం చేసింది.
పింఛన్ల పంపిణీలో మనం పాల్గొనాలి..
ఆగస్టు 1న పేదలకు పింఛన్ల పంపిణీలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘పోయిన నెల ఒకేసారి రూ.7 వేలు ఇవ్వడం ప్రభుత్వానికి చాలా మంచిపేరు తెచ్చింది. పింఛన్లకు ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు చేయబోతతున్నాం. ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు పంపిణీ సమయంలో మనం ప్రజల్లో ఉండాలి’ అని చెప్పారు. పథకాలన్నీ ఒకేసారి అమలు చేయడం కాకుండా నెలకొకటి అమల్లోకి తెస్తామన్నారు. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు వంద వరకూ ప్రారంభించాలని అనుకుంటున్నామని, ఆ రోజుకు ఎన్ని సిద్ధమైతే అన్ని ప్రారంభిస్తామని చెప్పారు. నైపుణ్య గణన ప్రారంభిస్తున్నామని, మెగా డీఎస్సీ పనులు కూడా మొదలయ్యాయని తెలిపారు.
కొన్ని బయటకు చెప్పలేం!
చంద్రబాబు ఢిల్లీ యాత్ర విషయం కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ‘దేని కోసం వెళ్తున్నామో కొన్ని చెప్పేవి ఉంటాయి. మరి కొన్ని బయటకు చెప్పలేం. ప్రజాప్రయోజనాలు తప్ప ఢిల్లీలో మనకు వేరే పనులు లేవు. రాష్ట్రం కోసమే తిరుగుతున్నాం’ అని ఆయన మంత్రులకు వివరించారు.
మరో 4 నెలలకు ఓటాన్ అకౌంట్..!
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్‌ను మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనిపై ఆర్డినెన్స్ జారీచేస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఓటాన్ అకౌంట్ (తాత్కాలిక బడ్జెట్)ను ఆమోదించింది. దాని గడువు ఈ నెలతోనే ముగుస్తోంది. నెలాఖరులోపు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ ఇంత తక్కువ సమయంలో బడ్జెట్ తయారుచేయలేమని, తమకు ఇంకొంత సమయం కావాలని ఆర్థిక శాఖ అధికారులు కోరారు. దీంతో ఓటాన్ అకౌంట్‌ను పొడిగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవచ్చు. కానీ శాసనమండలిలో టీడీపీకి ప్రస్తుతం మెజారిటీ లేదు. అక్కడ బడ్జెట్ బిల్లును పెండింగ్‌లో ఉంచితే ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం పైసా కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం మండలికి లేదు. అయితే కొంతకాలం పెండింగ్‌లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 26తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. ఆ వెంటనే అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ జారీ చేయించాలని నిశ్చయించారు.