BTech Ravi: హత్యలు చేయడం వల్లే రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనుగడ
ABN, Publish Date - Jul 07 , 2024 | 04:55 PM
హత్యలు చేయడం వల్లే ఈ రోజు పులివెందుల రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనగడ కొనసాగుతోందని తెలుగుదేశం పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) ఆరోపించారు. వాళ్ల రాజకీయ పునాదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పుట్టిందని విమర్శించారు.
కడప జిల్లా: హత్యలు చేయడం వల్లే ఈ రోజు పులివెందుల రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనగడ కొనసాగుతోందని తెలుగుదేశం పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) ఆరోపించారు. వాళ్ల రాజకీయ పునాదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పుట్టిందని విమర్శించారు. పులివెందులలో బీటెక్ రవి ఈరోజు(ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేంపల్లిలో యువకుడిపై జరిగిన దాడి ఘర్షణ గురించి మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదగా ఉన్నాయని అన్నారు. నేరచరిత్రే తెలియదన్నట్టుగా వారు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికల్లో ఏజెంట్లుగా టీడీపీ వాళ్లను కూర్చోవద్దని బెదిరించలేదా అని ప్రశ్నించారు. అయినా తమ ఏజెంట్లు ఆ రోజు కూర్చున్నారని వారిని చొక్కాలు చించి కొట్టారని మండిపడ్డారు. తన్నులు తిన్న యువకుడే తమ ఏజెంట్లను కొట్టారని.. ఆ యాక్షన్ కు ప్రతి రియాక్షన్ తప్ప మరొకటి కాదని చెప్పారు. అసలు ఇలాంటి సాంప్రదాయం పులివెందులలోనే లేదని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నగరిగుట్టకు చెందిన ఇద్దరు యువకులను చంపి బ్రిడ్జి కింద దాచి పెట్టలేదా అని ప్రశ్నించారు.
హత్యలు చేశాకా జగన్, వైసీపీ నేతలను పులివెందులలో ఉండొద్దనడం వల్ల అప్పటికప్పుడు బెంగళూరు పారిపోయారని ఎద్దేవా చేశారు. మొన్న వేంపల్లి దగ్గర దాడి మాత్రమే జరిగిందని.. ఐలాపురం దగ్గర హత్యలు జరిగాయని చెప్పారు. వేముల ఘటనలో గన్‌మెన్ తుపాకీతో సతీష్ రెడ్డి కాల్పులు జరిపి ప్రాణరక్షణ కోసం గన్‌మెన్ కాల్పు లు జరిపాడని వైసీపీ నేత సతీష్ రెడ్డి అబద్ధాలు ఆడారన్నారు. ఇదే కేసు ఇప్పటికి నడుస్తొందని గుర్తుచేశారు. అహింస మార్గమే తమకు తెలియదన్నట్టుగా జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. దాడి జరిగిందని ఆ పిల్లోడిని పెట్టుకొని మాట్లాడితే రాజకీయ లబ్ధి వస్తుందని ఆలోచించడం తెలివి తక్కువతనమని బీటెక్ రవి పేర్కొన్నారు.
Updated Date - Jul 07 , 2024 | 05:02 PM