Madhavi Reddy: వైసీపీ నేతలు అవి కూడా ఆక్రమించారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 06:27 PM
కడప మేయర్ సురేష్ బాబుపై తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ధ్వజమెత్తారు.
కడప: ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన కడప మేయర్ సురేష్ బాబుకు ఎంతమాత్రం లేదని ఒక నియంతలా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇవాళ(సోమవారం) కడపలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ.. కడప కార్పొరేషన్ సమావేశం ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. అజెండాలో చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి సమావేశానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఒక మహిళ ఎమ్మెల్యే అంటే ఈ మేయర్‌కు గౌరవం లేదని మండిపడ్డారు. కడప కార్పొరేషన్ రాయించుకున్నట్లు వ్యవహారించారని ధ్వజమెత్తారు. వైసీపీ అచ్చోసిన ఆంబోతులా మేయర్‌ను వదిలేసిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు హంగామా చేశారని అన్నారు.
వైసీపీ నేతలు గుడి, మసీదు, చర్చి స్థలాలు ఆక్రమించారని ఆరోపించారు. కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక మేయర్ కుర్చీ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ మేయర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. కనీసం వీధి కుక్కలను అరికట్టలేని పరిస్థితి కార్పొరేషన్‌లో ఉందని అన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చర్చ జరగకుండానే బిల్లులు ఆమోదం చేసుకున్నారని ఆగ్రహించారు. మేయర్ కుటుంబ సభ్యులు నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. 54 అంశాలు చర్చ జరగకుండా ఆమోదించుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ సమావేశం ఇలా ముగించడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.
కాగా.. కడప నగర కార్పొరేషన్ (Kadapa Corporation) సర్వసభ్య సమావేశం సోమవారం ఉద్రిక్తంగా సాగింది. ఈ సమావేశానికి ముందే కార్పొరేషన్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ (TDP) కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ(YSRCP) పాలకవర్గం, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య కుర్చీ వివాదం నడుస్తోంది. గత సమావేశాల్లో వైసీపీ మేయర్ సురేష్ బాబు తనకు కుర్చీ వేయకుండా అవమానించారని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా సమావేశాలకు ముందు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. కాగా ఇటీవల వైసీపీనుంచి టీడీపీలో 8 మంది కార్పొరేటర్లు చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Nara Lokesh : మరోసారి ఉదారత చాటుకున్న మంత్రి నారా లోకేశ్.. ఏం చేశారంటే
Atchannaidu: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. అచ్చెన్న వార్నింగ్
YSRCP: మేయర్, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
Viral News: నెల్లూరులో.. యువకుడిని చితక్కొట్టిన దెయ్యం..!
Read Latest AP News And Telugu News