Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి
ABN , Publish Date - Sep 20 , 2024 | 01:17 PM
Andhrapradesh: టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ధర్మారెడ్డి అనే వాడు చాలా దుర్మార్గుడని వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ఐడీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తిరుమల కల్తీ లడ్డూ (Tirumala Laddu) వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. తిరుమల కల్తీ లడ్డూపై ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా టీటీడీ కల్తీ లడ్డూ వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు. ధర్మారెడ్డి అనే వాడు చాలా దుర్మార్గుడని వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ఐడీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. ఆయన టీటీడీ ఈవో అయినా కూడా.. వైసీపీ నేతగా వ్యవహరించారన్నారు.
Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..
తిరుమల లడ్డూ వ్యవహారం లక్షల భక్తుల సమస్య అని చెప్పుకొచ్చారు. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ చేయాలని.. కల్తీ నిజమా కాదో తేల్చాలన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వీలైనంత త్వరగా విచారణ జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రోజు టీటీడీకి వచ్చి లడ్డూ కొనుగోలు చేస్తారని అన్నారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యి పబ్లిక్ సెక్టర్‌లో ఉన్న డైరీకి ఇవ్వాలని.. ఊరు, పేర్లు లేని కంపెనీలకు ఇవ్వొద్దని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.
Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు
హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దు...
గత ప్రభుత్వంలో ఆలయాల్లో అపచార కార్యక్రమాలు జరిగాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈవో ధర్మారెడ్డి పాలనలోనే కల్తీ నెయ్యి తిరుపతి ప్రసాదం తయారీలో వాడారన్నారు. ఆయన కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించానని చెప్పారని.. మరి ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రసాదం తయారీలో జరుగుతున్న తప్పుడు విధానాల వెనుక అంతర్జాతీయ క్రైస్తవుల హస్తం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆల్ఫా అనే సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు... ఎంతకు ఇచ్చారు.. వంటి విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ ఇప్పటి వరకూ ధర్మపత్నితో కలిసి స్వామి వారిని దర్శించుకోలేదన్నారు. హిందువుల మనోభావాలతో ఎవరూ ఆడుకోవద్దని హెచ్చరించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన జరుగుతుందన్నారు. జగన్ వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఏపీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని బీజేపీ నేత నాగోతు రమేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
IdhiManchiPrabhutvam: 100 రోజులు పూర్తి.. నేటి నుంచి 26 వరకు ప్రజల్లోకి...
YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
Read LatestAP NewsANdTelugu News