Share News

బీసీలను అణగదొక్కుతున్నారు..

ABN , Publish Date - May 01 , 2024 | 12:06 AM

ఎమ్మెల్యే శ్రీదేవి, మరికొందరు అగ్రవర్ణాల నాయకులు కలిసి బీసీలను అణగదొక్కుతున్నారని ఎంపీపీ డి.అనితాయాదవ్‌, మాజీ ఎంపీటీసీ డి.శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

బీసీలను అణగదొక్కుతున్నారు..

ఎమ్మెల్యే శ్రీదేవిపై మద్దికెర ఎంపీపీ దంపతుల ఆరోపణ

మద్దికెర, ఏప్రిల్‌ 30: ఎమ్మెల్యే శ్రీదేవి, మరికొందరు అగ్రవర్ణాల నాయకులు కలిసి బీసీలను అణగదొక్కుతున్నారని ఎంపీపీ డి.అనితాయాదవ్‌, మాజీ ఎంపీటీసీ డి.శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం మద్దికెరలోని వారి స్వగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ బలోపేతం కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టి పని చేశామని, కంగాటి శ్రీదేవి గెలుపొందాక మద్దికెర మండలంలో అగ్రవర్ణాలదే ఆధిపత్యమైందని అన్నారు. ఎంపీపీగా గెలుపొంది ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బసినేపల్లి గ్రామంలో పేదలకు అందే పింఛన్‌ కూడా తమ బంధువులన్న సాకుతో తొలగించారని విచారం వ్యక్తం చేశారు. ఎంపీపీనై ఉండి కూడా తన కార్యాలయంలో పని జరగనప్పుడు ఎందుకీ పదవులు అని అన్నారు. ఎలాంటి ఓటు బ్యాంకు లేని ముగ్గురు నాయకులు మద్దికెరలో వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లినా వారికే ప్రాధాన్యత ఇస్తూ తమను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.20లక్షలు ఖర్చు పెట్టి ఎంపీపీ ఎన్నికల్లో అందరినీ గెలిపించుకున్నప్పటికీ తమకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డిని కూడా తమ డబ్బుతో గెలిపించామని, ఎమ్మెల్యే శ్రీదేవి జడ్పీటీసీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పత్తికొండలో జరిగిన ముఖ్యమంత్రి సభలో ఎమ్మెల్యే శ్రీదేవి కనీసం అపాయింట్‌మెంటు కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ అగ్రవర్ణాల ఆధిపత్యం చూస్తుంటే రాజకీయమే వదిలేద్దామని బాధ కలుగుతోందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్నామని, పార్టీ మార్చే ఆలోచన కూడా రాలేదన్నారు. అయితే.. కార్యకర్తల అభీష్టం మేరకు ముందుకు సాగాలని అనుకున్నామని తెలిపారు.

Updated Date - May 01 , 2024 | 12:06 AM