Share News

నంద్యాల జిల్లాలో ౩4వ రోజు సమ్మె

ABN , Publish Date - Jan 15 , 2024 | 12:11 AM

అంగన్‌వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఎస్మా చట్టాన్ని నిరసిస్తూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

నంద్యాల జిల్లాలో ౩4వ రోజు సమ్మె
శిరివెళ్లలో భోగి మంటల్లో ప్రతులను దహనం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

డోన్‌(రూరల్‌), జనవరి 14: అంగన్‌వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఎస్మా చట్టాన్ని నిరసిస్తూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. డోన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌ వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం 34వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సంతకాల సేకరణ చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన నిరసన దీక్షలు 34వ రోజుకు చేరుకుంది. ఏఐటీయూసీ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

బేతంచెర్ల: బేతంచెర్ల పాతబస్టాండులో అంగన్‌వాడీలు జీవో 2 ప్రతులను తగలబెట్టి నిరసన తెలిపారు. వారు చేపట్టిన సమ్మె 34వ రోజు కొనసాగింది.

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ఆదివారం శిబిరంలో బోగి మంటలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే దాకా సమ్మె కొనసాగిస్తామన్నారు.

శిరివెళ్ల: డిమాండ్లను నెరవేర్చకుండా ప్రభుత్వం ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా తలొగ్గేది లేదని అంగన్‌వాడీలు హెచ్చరించారు. శిరివెళ్లలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మెలో 34వ రోజు ఎస్మా చట్టం ప్రతులు, నోటీసులను భోగి మంటల్లో వేసి ఆదివారం దహనం చేశారు.

చాగలమర్రి: అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోవడం దారుణమని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా అన్నారు. ఆదివారం చాగలమర్రి అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రహదారిపై అంగన్‌వాడీలు, టీడీపీ నాయకులు కలిసి ఎస్మా చట్టం అమలు చేస్తూ ఇచ్చిన జీవో ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు అనిఫ్‌, అజిమ్‌, గఫార్‌, అబ్దుల్లా, జిలేబి షరీఫ్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

రుద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం పంపిన షోకాజ్‌ నోటీసులను భోగి మంటల్లో వేసి అంగన్‌వాడీలు దహనం చేశారు. భోగి మంటల చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. అణచివేయాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును జీతాలు తీసుకుంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న ప్రభుత్వ సలహాదారులకు, మంత్రులకు తమ ఆవేదన పట్టలేదని విమర్శించారు.

ఉయ్యాలవాడ: మండలంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు పండగ రోజు కూడా సమ్మెను కొనసాగించారు. మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బోగి మంటలు వేసి వాటిలో షోకాజ్‌ నోటీసుల ప్రతులను కాల్చి వేశారు. వేతనాలు పెంచినరోజే తమకు అసలైన పండుగ వచ్చినట్లు భావిస్తామని స్పష్టం చేశారు.

దొర్నిపాడు: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ సిబ్బంది ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. 34 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. అంగన్‌వాడీలు ఎస్మా పత్రాలను బోగిమంటల్లో వేసి దహనం చేశారు.

బనగానపల్లె: భోగి పండుగ రోజు కూడా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆదివారం బనగానపల్లెలో బోగిపంటలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎస్మా చట్టానికి అమలు చేస్తూ తెచ్చిన జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చివేశారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా సమ్మె ఆగదని సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అన్నారు.

సంజామల: సంజామల మండలంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆదివారం వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఎస్మా చట్టాన్ని నిరసిస్తూ జీవో ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సంజామలలోని సహకార బ్యాంక్‌ ఆవరణలో చేపట్టిన సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2024 | 12:11 AM

News Hub