Share News

Anantapur : అనంతలో మన్మోహన్‌ జ్ఞాపకాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:17 AM

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006, ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ప్రారంభించారు.

Anantapur : అనంతలో మన్మోహన్‌ జ్ఞాపకాలు

  • దేశంలో తొలిసారి బండ్లపల్లిలో ‘ఉపాధి’ ప్రారంభోత్సవం

నార్పల, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006, ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ప్రారంభించారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ-1 చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, అప్పటి సీఎం వైఎస్సార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు, కూలీల వలసల నివారణ కోసం ఈ పథకాన్ని దేశంలో మొదటిసారిగా ప్రారంభించారు. మన్మోహన్‌ మృతితో జిల్లావాసులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కరువుపై పోరాటం చేసేందుకు మద్దతుగా ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం, కూలీలు కరువును జయించడానికి ఎంతగానో తోడ్పడిన పథకం ఇది. యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత కూడా మాజీ ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ మరోమారు అనంతపురం జిల్లాకు వచ్చారు.

ఉపాధి పథకాన్ని ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా బండ్లపల్లి గ్రామంలో 2016, ఫిబ్రవరి 2న మరోమారు సభను నిర్వహించారు. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కాగా, దేశంలోనే మొదటి సారిగా బండ్లపల్లి గ్రామానికి చెందిన చీమల పెద్దక్క అనే మహిళకు తొలి జాబ్‌కార్డును ఉపాధి పథకం ప్రారంభ సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ అందజేశారు. ఈ సభకు బండ్లపల్లి సర్పంచ్‌ వేల్పుల నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన చేతనే ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభింపజేశారు. సర్పంచ్‌తో కలిసి రాయలసీమ రాగి సంగటిని మన్మోహన్‌, సోనియా తిన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 05:17 AM

News Hub