CM Chandrababu: యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Aug 06 , 2024 | 03:53 PM
యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మంగళవారం నాడు వర్చువల్‌గా సమావేశం అయ్యారు.
అమరావతి: యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మంగళవారం నాడు ఆన్‌లైన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌పై చర్చ...
నీల్ మోహన్, సంజయ్ గుప్తాలతో కనెక్ట్ కావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కంటెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించడానికి స్థానిక భాగస్వాముల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు వివరించారు. రాజధాని అమరావతిలో మీడియా సిటీలో సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఉన్న అవకాశాలను వారితో చర్చించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన...
బాపట్ల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం) చీరాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. చంద్రబాబు పర్యటన వివరాలను సీఎంవో ప్రకటించింది. జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సభా ప్రాంగాణాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జాండ్రపేటకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ముఖ్యమంత్రి వస్తుంటడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.