Share News

కవ్వింపులు.. దాడులు!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:55 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ, కొడాలి నానీలు చేసిన కవ్వింపు వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవ్వింపులు.. దాడులు!

బెజవాడ, గుడివాడల్లో హైటెన్షన్‌

వంశీ, కొడాలి ఇళ్లపై రాళ్లు, కోడి గుడ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత

విజయవాడలో యార్లగడ్డ అనుచరులపై పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు

పోలీసు వాహనాల అద్దాలు ధ్వంసం

కార్యకర్తల అరెస్టుపై వెంకట్రావు ఆగ్రహం

వంశీ అనుచరులే రెచ్చగొట్టారు: యార్లగడ్డ

కొడాలి నాని రాజకీయ సన్యాసం శపథం నిలబెట్టుకోవాలని తెలుగుయువత పట్టు

విజయవాడ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి)/గుడివాడ: ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ, కొడాలి నానీలు చేసిన కవ్వింపు వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి ఇళ్లపై దాడులకు దిగారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రత్యర్థులుగా ఉన్న వల్లభనేని వంశీమోహన్‌, యార్లగడ్డ వెంకట్రావు మధ్య ఉన్న రాజకీయ విభేదాల ప్రభావం విజయవాడ నగరంపై పడింది. విజయవాడ గాయత్రీనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ నివాసం ఉంటున్నారు. వైసీపీలో ఉన్న వంశీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు చంద్రబాబు, లోకేశ్‌లపై నోరుజారారు. అదేవిధంగా యార్లగడ్డ అనుచరులపై కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యార్లగడ్డ అనుచరులు వంశీ ఉన్న అపార్ట్‌మెంట్‌పై దాడికి దిగి రాళ్లు రువ్వారు. పోలీసులు అక్కడికి చేరుకుని అపార్టుమెంట్‌కు ఉన్న మూడు మార్గాల్లో బారికేడ్లు పెట్టి, ఇనుపకంచెలు అడ్డంగా పెట్టారు. ఈ సమయంలో ఇంట్లోనే వంశీని వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. కానీ, ఆయన మాత్రం వెళ్లేందుకు ససేమిరా అన్నారు. ఇక, కాసేపటికి గన్నవరం నుంచి మరింత మంది యార్లగడ్డ అనుచరులు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను ప్రతిఘటించిన ఆందోళనకారులు ఏసీపీ జీపు, టాటా ఏస్‌ వాహనాలపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సీఆర్పీఎఫ్‌ బలగాలు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారు. యార్లగడ్డ అనుచరుడు సునీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాఠీచార్జి విషయాన్ని తెలుసుకున్న యార్లగడ్డ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన మాచవరం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న సునీల్‌ను తీసుకుని వచ్చారు. అనంతరం పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. వంశీ ఇంటి వద్ద జరిగిన పరిణామాలతో గుణదలలోని వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గుడివాడలో..

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని విసిరిన సవాల్‌ను నిలబెట్టుకోవాలని తెలుగు యువత నాయకులు డిమాండ్‌ చేశారు. గుడివాడలో కొడాలి నాని ఇంటి ముట్టడికి శుక్రవారం తెలుగు యువత ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు యువత రాష్ట్ర నాయకుడు పొట్లూరి దర్శిత్‌ ఆధ్వర్యంలో నాని ఇంటిపై కోడిగుడ్లను విసురుతూ.. వైసీపీ గుర్తు ఫ్యాన్‌ను నేలకేసి కొట్టి నిరసన తెలిపారు. తెలుగు యువత నేతలు వెంటనే నిరసన ఆపి వెళ్లి పోవాలని పోలీసులు హెచ్చరించారు. మాట వినకుంటే కాల్చి పడేస్తానని ఒన్‌టౌన్‌ సీఐ కె. ఇంద్ర శ్రీనివాసరావు బెదిరించారు. సీఐ వ్యాఖ్యలపై దర్శిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్చాలంటూ ఎదురొడ్డి సవాల్‌ విసిరారు. వైసీపీ నేతలు దాష్టీకాలు చేసినప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇంతలో టీఎన్‌ఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి అక్కడి చేరుకోవడంతో దర్శిత్‌ పోలీసు వలయాన్ని చేధించి నాని ఇంటి వైపు వెళ్లారు. డీఎస్పీ శ్రీకాంత్‌ స్వయంగా రంగంలోకి దిగి దర్శిత్‌, తెలుగు యువత నాయకులతో మాట్లాడటంతో నిరసన విరమించారు. ఇంత జరుగుతున్నా కొడాలి నాని ఇంట్లో ఉండి బయటకు రాలేదు. అనంతరం పొట్లూరి దర్శిత్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. గుడివాడలో కొడాలి నానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు.

వంశీ అనుచరులే రెచ్చగొట్టారు: యార్లగడ్డ

వైసీపీ నేత వల్లభనేని వంశీ అనుచరులు తమవారిని రెచ్చగొట్టడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ పటమటలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. వంశీ అనుచరులు తన అనుచరులను అసభ్యకరంగా దూషించడంతో ఘర్షణ మొదలైందన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 03:55 AM