Share News

AP Police : విజయ్‌పాల్‌ అరెస్టు

ABN , Publish Date - Nov 27 , 2024 | 03:29 AM

మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

AP Police : విజయ్‌పాల్‌ అరెస్టు

  • రఘురామ కస్టోడియల్‌ హింస కేసులో చర్యలు

  • ఒంగోలులో ఉదయం నుంచి రాత్రి దాకా విచారణ

  • చివర్లో స్వయంగా రంగంలోకి ప్రకాశం ఎస్పీ

  • రఘురామను చంపేందుకు కుట్ర చేశారా?

  • ఎవరి ఆదేశాల మేరకు ఆయనను హింసించారు?

  • అరెస్టులో నిబంధనలు ఎందుకు పాటించలేదు?

  • అనేక కోణాల్లో విజయ్‌ పాల్‌కు ప్రశ్నలు

  • విచారణకు సహకరించని రిటైర్డ్‌ అదనపు ఎస్పీ

  • అరెస్టు చేస్తున్నట్లు ప్రకటన.. ఠాణాకు తరలింపు

ఒంగోలు క్రైం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు నిరాకరించడం, విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. విజయ్‌పాల్‌ను భారీ భద్రత మధ్య ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం గుంటూరుకు తీసుకెళ్లనున్నారు. కస్టోడియల్‌ టార్చర్‌పై రఘురామ ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించింది. ఈనెల 13వ తేదీన పోలీసులు విజయ్‌పాల్‌ను ఈ కేసులో ప్రశ్నించారు. ‘తెలియదు... గుర్తులేదు... మరిచిపోయా’ అనే సమాధానాలు ఇస్తూ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేశారు.

మంగళవారం మరోమారు విజయ్‌పాల్‌ను ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సాయంత్రం 6 గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు.


రఘురామకృష్ణరాజును అంతమొందించేందుకు కుట్ర పన్నారా? దీని వెనుక ఎవరు ఉన్నారు? కస్టడీలో ఆయనను ఎందుకు హింసించారు? మీరు కొట్టకుంటే ఆయన కాలికి గాయాలు ఎలా అయ్యాయి? ఎవరి ఆదేశాల మేరకు రఘురామను కొట్టారు? కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా ఎందుకు సీఐడీ కార్యాలయంలో నిర్బంధించారు? నిబంధనలు పాటించకపోవడానికి కారణమేమిటి? ఇలా అనేక కోణాల్లో విజయ్‌పాల్‌ను ప్రశ్నించారు. కానీ... ఆయన దేనికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. పోలీసులు సేకరించిన ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించి... కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల వరకు విచారణ జరిపిన తర్వాత... ఆయనను అరెస్టు చేస్తున్న ట్లు ప్రకటించారు. విచారణలో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రధాన ద్వారం నుంచి విచారణ జరిపిన గెలాక్సీ భవన్‌ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోకి ఇతరులెవ్వరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.


  • కోర్టుల్లో చుక్కెదురు

అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విజయ్‌పాల్‌ విశ్వప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించడం గమనార్హం. ముందస్తు బెయిల్‌ కోసం విజయ్‌పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో... ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది.

  • వీరిపైనే కేసు...

2021 మే నెలలో సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జూలైలో రఘురామ రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఆంజనేయులు, సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్‌, అప్పటి సీఎం జగన్‌, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ ప్రభావ తి, మరి కొంతమందిని నిందితులుగా చేర్చారు.

Updated Date - Nov 27 , 2024 | 03:31 AM