Share News

ఈకేవైసీ గందరగోళం

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:39 AM

ఈకేవైసీ చేస్తేనే రేషన్‌ సరుకులు ఇస్తారు. లేకుంటే ఇక మర్చిపోవడమే.. ఇదీ ప్రస్తుతం కార్డుదారులను భయపెడుతున్న ప్రచారం. అదికూడా ఈనెల 31వతేదీలోపు చేయించుకోవాలని హడావుడి.

ఈకేవైసీ గందరగోళం
ఒంగోలులోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఇళ్ల వద్ద ఈకేవైసీ చేయిస్తున్న డీలర్‌

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేస్తున్న రేషన్‌ డీలర్లు

లేని వారు చేయించుకోవాలని చెప్తున్నా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం

ఆధార్‌ కార్డులు తీసుకుని కుటుంబ సభ్యులు అందరూ రావాల్సిందేనని స్పష్టం

పిల్లలు దూరాన ఉన్నా తప్పదంటూ హడావుడి

జిల్లావ్యాప్తంగా 2.06 లక్షల మందికి మాత్రమే లేదు

ఆ జాబితాలను డీలర్లకు ఇచ్చిన తహసీల్దార్లు

అయినా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి

ఈకేవైసీ చేస్తేనే రేషన్‌ సరుకులు ఇస్తారు. లేకుంటే ఇక మర్చిపోవడమే.. ఇదీ ప్రస్తుతం కార్డుదారులను భయపెడుతున్న ప్రచారం. అదికూడా ఈనెల 31వతేదీలోపు చేయించుకోవాలని హడావుడి. అయితే అధికారుల ఆదేశాలకు భిన్నంగా రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేలా డీలర్లు వ్యవహరిస్తున్నారన్నఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈకేవైసీ లేని రేషన్‌ కార్డుదారులు వెంటనే చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ మినహాయింపు ఇచ్చింది. ఆవిధంగా జిల్లావ్యాప్తంగా రేషన్‌షాపుల పరిధిలో ఈకేవైసీ చేయించుకోవాల్సిన కార్డుదారుల వివరాలను కూడా డీలర్లకు తహసీల్దార్లు అప్పగించారు. అయినా కుటుంబ సభ్యులు మొత్తం చేయించుకోవాలని డీలర్లు చెబుతుండటంతో అందరూ పరుగులు పెట్టాల్సి వస్తోంది.

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 6.61 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా వాటి పరిధిలో 19.38 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 17.32 లక్షల మందికి ఈకేవైసీ ఉండగా 2.05 లక్షల మందికి లేదు. జిల్లాలో ఈకేవైసీ లేని వారి జాబితాలను రేషన్‌ డీలర్ల వారీగా తహసీల్దార్లు తయారుచేసి వారికి ఇచ్చారు. అయితే ఎవరికైతే ఈకేవైసీ లేదో అటువంటి వారికి ఫోన్లు చేసి పిలుపించుకొని ఈకేవైసీ చేయించుకోమని చెప్పాల్సింది పోయి, అందుకు భిన్నంగా వ్యవహరించడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. కార్డు ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆధార్‌ కార్డులు తీసుకుని రావాలని హుకుం జారీ చేస్తున్నారు. ఒకవైపు అధికారులు ఈకేవైసీ లేని వారు మాత్రమే చేయించు కోవాలని చెప్తున్నా అవేమీ తమకు తెలియదన్నట్లు డీలర్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అటువంటి వారు ఇక్కడకు రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఆ విద్యార్థులకు ఈకేవైసీ లేకపోతే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చేయించుకునే అవకాశం ఉంది. ఆ వియాన్ని చెప్పాల్సిందిపోయి ‘లేదు తప్పనిసరిగా రావాల్సిందే.. లేకుంటే రేషన్‌ ఆగిపోతుంది’ అని డీలర్లు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో కార్డుదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డీలర్‌ ఎక్కడ కూర్చుంటే అక్కడకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో ఐదు రోజుల వ్యవధిలో సుమారు 50వేల మంది వరకూ ఈకేవైసీ వేయించుకున్నారని సమాచారం

నగరంలో ఇంటి వద్దకే వెళుతున్న డీలర్లు

జిల్లాకేంద్రమైన ఒంగోలులో రేషన్‌కార్డుదారుల ఇంటి సమీపంలోనే డీలర్లు కార్డుదారుల నుంచి ఈకేవైసీ చేయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఎక్కడో ఒక చోట కూర్చొని ఆ ప్రాంతానికి చెందిన కార్డుదారులను రైస్‌ కార్డుతోపాటు ఆధార్‌ కార్డులు తీసుకొని కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అందరూ రావాలని చెప్పారు. ఈ విషయం అధికారుల వద్దకు చేరడంతో ఈకేవైసీ ఎవరికైతే లేదో వారి చేతనే వేయించుకోవాలని స్పష్టంగా చెప్పడంతో శుక్రవారం నుంచి డీలర్లు అలాగే ప్రక్రియను చేపట్టారు. ఆ రేషన్‌ షాపు పరిధిలో ఉండే ఒక బజారులో ఒకచోటకు అక్కడి వారిని పిలిపించుకొని ఈకేవైసీ లేని వారి వద్ద నుంచి వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈకేవైసీ లేని కార్డుదారుల జాబితాలను డీలర్లకు ఇచ్చారు. దీంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:40 AM