ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:18 AM
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటీవల తొలగించిన వారిని వెంటనే తిరిగి తీసుకోవాలని, గేట్ పాస్‌లు గతంలో మాదిరిగా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌లతో స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల సమ్మె ప్రారంభించారు.

విభాగాధిపతుల కార్యాలయాల ముందు నిరసన
అడ్మిన్ భవనం లోపలకు వెళ్లేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు
ప్రధాన పరిపాలనా భవనం ఎదుట బైఠాయింపు
ఉక్కుటౌన్‌షిప్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటీవల తొలగించిన వారిని వెంటనే తిరిగి తీసుకోవాలని, గేట్ పాస్‌లు గతంలో మాదిరిగా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌లతో స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల సమ్మె ప్రారంభించారు. కార్మికులు ఉదయం ఆరు గంటలకు ప్లాంటు గేట్ల (ప్రధాన గేటు, బీసీ గేటు, విస్తరణ గేటు) వద్దకు చేరుకున్నారు. ఉక్కు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొమ్మిది గంటల సమయంలో ప్లాంటు లోపలకు వెళ్లినప్పటికీ విధులను బహిష్కరించి, ఆయా విభాగాధిపతుల కార్యాలయాల వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. సాయంత్రం నాలుగు గంటలకు కోక్-ఓవెన్ విభాగం వద్దకు చేరుకొని అక్కడ నుంచి ప్రధాన పరిపాలనా భవనం వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన పరిపాలనా భవనం లోపలకు వెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందు కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దుర్మార్గంగా వ్యవహరిస్తున్న
యాజమాన్యం: అఖిలపక్ష నాయకులు
కాంట్రాక్టు కార్మికుల విషయంలో యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ఆరోపించారు. ప్రధాన పరిపాలనా భవనం ముందు బైఠాయించిన కార్మికులనుద్దేశించి నాయకులు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కొంతకాలంగా కోరుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. కార్మికులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తంచేశారు. యాజమాన్యం ఇప్పటికైనా దిగిరావాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు మంత్రి రవి, శ్రీనివాసరావు, శ్రీనివాసరాజు, అప్పారావు, వంశీకృష్ణ, నమ్మి రమణ, తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు మద్దతు
కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆయా విభాగాధిపతుల కార్యాలయాల ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు జె.అయోధ్యరాం, పీవీ.రమణమూర్తి, యు.రామస్వామి, డి.ఆదినారాయణ పాల్గొన్నారు.