నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:36 AM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించాలని అధిష్ఠానం సూచించింది.

జిల్లావ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ఆపార్టీది ప్రత్యేక ముద్ర
కార్యక్రమాల నిర్వహణ లోనూ ముందంజ
మహానాడు నిర్వహణ మైలురాయి
ఒంగోలు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించాలని అధిష్ఠానం సూచించింది. తదనుగుణంగా జిల్లాలో ఆ పార్టీశ్రేణులు గ్రామ, మండల, పట్టణ స్థాయిలో జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్‌లు, సభలు, సమావేశాల నిర్వహణ, పార్టీ వ్యవస్థాప కులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎదురులేకుండా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ హవాకు అడ్డుకట్ట వేసిన పార్టీగా టీడీపీకి రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ సారఽథ్యంలో 1982 మార్చి 29న ఆవిర్భవించిన టీడీపీ 43 వసంతాలు పూర్తిచేసుకొని శనివారం 44వ ఏట అడుగుపెడుతోంది. ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోనూ.. అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడటంలోనూ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ముద్ర వేసుకుంది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పెద్దఎత్తున జరిగింది.
జిల్లా చరిత్రలో టీడీపీది ప్రత్యేక ముద్ర
టీడీపీ ఆవిర్భవించిన కొద్దినెలలకు జరిగిన ఎన్నికల (1983)లో ఉమ్మడి జిల్లాలో ఘన విజయాలను సాధించింది. అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏకపక్షంగా సాగిన 1994 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క పర్చూరు తప్ప మిగిలిన అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. విభజిత రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభంజనం సృష్టించి టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కాగా ఉమ్మడి జిల్లాలో నాలుగు స్థానాలు టీడీపీకి దక్కాయి. తిరిగి 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో 10చోట్ల ఆపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ ద్వారా పలు నియోజకవర్గాల్లో అనేకమంది యువకులు, కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఇతర కీలక స్థానాల్లో వెలుగులోకి వచ్చారు. ఇక ఉమ్మడి జిల్లా అభివృద్ధిలోనూ టీడీపీది ప్రత్యేక ముద్ర అనే చెప్పాలి. ఉమ్మడి జిల్లా అవిర్భావం జరిగి 54 వసంతాలు కాగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు జరిగాయి.
వెలిగొండకు ప్రాణం పోశారు
జిల్లాలోని పశ్చిమ ప్రజలకు వరప్రసాదినిగా భావించే వెలిగొండ ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే కదిలింది. దాని కోసం సీపీఐ నేతృత్వంలో ప్రజానీకం చేస్తున్న ఆందోళనలను నాటి సీఎం ఎన్టీఆర్ గుర్తించి సర్వేకు ఆదేశించారు చంద్రబాబు సీఎం అయ్యాక 1996 మార్చి 5న తొలిసారి శంకుస్థాపన చేశారు. అనతరం పలు కీలక పనులు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికబద్ధ కృషి చేస్తున్నారు. అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు, రామతీర్థం రిజర్వాయర్, రామాయపట్నం పోర్టు, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీ వంటి వాటికి శంకుస్థాపనలు చంద్రబాబు చేశారు. చదలవాడ పశుక్షేత్రం ఏర్పాటు, ఒంగోలులో ప్రజల దాహార్తిని తీర్చే రెండు ఎస్‌ఎస్ ట్యాంకులు, కూరగాయల మార్కెట్, పెద్ద ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం వంటి కీలకమైన పనులు టీడీపీ కాలంలోనే జరిగాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, ముఖ్యమైన భవన నిర్మాణాలు, తాగునీరు పథకాలు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన కృషి ఆ పార్టీ కాలంలోనే సాగింది. రాష్ట్రంలోనే తొలిగా పెద్ద సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను గుండ్లకమ్మ, ముసి, పాలేరు ఇతర వాగుల ఆధారంగా చేపట్టడంతోపాటు పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ బోర్లు తవ్వకాలు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జరిగాయి. దొనకొండ కారిడార్‌కు నాంది టీడీపీ కాలంలోనే జరగ్గా ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో రియలన్స్ సంస్థ ఆధ్వర్యంలో బయోగ్యాస్ ప్లాంట్‌లు భారీ పెట్టుబడులతో ఏర్పాటు ఆ పార్టీ ప్రభుత్వ చొరవతో కార్యరూపం దాల్చుతున్నాయి.
ఒంగోలు మహానాడుతో పార్టీకి ఊపు
జిల్లాలో టీడీపీ శ్రేణుల పనితీరు ఒక ఎత్తు కాగా.. జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న 2019-24 మధ్యకాలం ఒక ఎత్తు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అణిచివేత, అరాచకం, దాడులు ఎదుర్కొని జిల్లాలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. ప్రత్యేకించి ప్రభుత్వ దమననీతికి రాష్ట్రమంతటా విపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు గురవుతూ నోరు మెదపలేకపోతున్న సమయంలో అమరావతి రైతులు చేపట్టిన తిరుమల యాత్రకు ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బ్రహ్మరథం పట్టారు. తూర్పుప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో నెలరోజులకుపైగా సాగిన ఈ యాత్రను దిగ్విజయం చేసిన శ్రేణులు అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో 2022 మేలో ఒంగోలులో టీడీపీ మహానాడును నభూతో నభవిష్యత్ అన్నట్లు నిర్వహించారు. ఏకతాటిపై ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకత్వం నిలిచి చరిత్రలో నిలిచేలా విజయవంతం చేసింది. తీవ్ర ప్రతికూల రాజకీయ పరిస్థితులలో మహానాడును ముందుకొచ్చి జిల్లానాయకులు నిర్వహించగా లక్షల్లో హాజరైన పార్టీశ్రేణులు వైసీపీ ప్రభుత్వంపై కదంతొక్కారు. ఆతర్వాతే రాష్ట్రంలో టీడీపీకి ఊపు వచ్చింది. ఇక 2023 జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలో నెలరోజులకుపైగా సాగిన యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఇతర అన్ని జిల్లాల కన్నా సక్సెస్‌పుల్‌గా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తూ జిల్లాలోకి రాగా ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. 50రోజులకుపైగా దీక్షలు, ధర్నాలు ఇతర ఆందోళనలు చేపట్టారు. ఇక ఐదేళ్లలో నిత్యం వివిధ ప్రజా సమస్యలపై పెద్దఎత్తున ఆందోళనలు చేస్తూ వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా ప్రస్తుతం జరుగుతున్న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.