మండిన జిల్లా
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:33 AM
వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పక్షం రోజుల నుంచి తీవ్రత అధికంగా ఉండటంతోపాటు ఉక్కపోత ఎక్కువవడంతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతోంది. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం నుంచి క్రమంగా ఎండ తీవ్రత ఉంటుంది.

కొమరోలు, బేస్తవారపేటలో 42.6 డిగ్రీలు నమోదు
పగలు ఎండ.. రాత్రి ఉక్కపోత
వృద్ధులు, చిన్నారులు విలవిల
మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పక్షం రోజుల నుంచి తీవ్రత అధికంగా ఉండటంతోపాటు ఉక్కపోత ఎక్కువవడంతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతోంది. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం నుంచి క్రమంగా ఎండ తీవ్రత ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే పగటి పూట మంటలు, రాత్రిపూట ఉక్కపోత ఎక్కువైంది. జిల్లాలో శుక్రవారం ఎండలు మండిపోయాయి. అనేక మండలాల్లో 40డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కొమరోలు, బేస్తవారపేటల్లో 42.6డిగ్రీల ఎండ కాచింది. ఉక్కపోతతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో పనులు చేసే కూలీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 38 మండలాలు ఉండగా 25మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఆరు గంటల వరకూ కూడా ఎండ తీవ్రత కనిపించింది.