Share News

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులకు మోక్షం

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:40 AM

పొదిలి సమ్మర్‌ స్టోరేజ్‌ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులకు కూటమి ప్రభుత్వం ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వడంతో పనుల్లో వేగం పుంజుకోనుంది.

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులకు మోక్షం

పొదిలి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పొదిలి సమ్మర్‌ స్టోరేజ్‌ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులకు కూటమి ప్రభుత్వం ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వడంతో పనుల్లో వేగం పుంజుకోనుంది. దీంతో పొదిలి మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమ్మర్‌ స్టోరేజ్‌ పనులను వైసీపీ హాయాంలో ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించిన ఘనత తమదే అని ఊరువాడ డంకాబజాయించి మరి ప్రచారం చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆర్భాంటం ఈ పనులు ప్రారంభిం చారు. అయితే ఈ పనులకు ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌కు నిధులు మంజూరు కాలేదు. సాంకేతిక ఇబ్బందులు కారణంగా ప్రారంభించిన పనులను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో పొదిలి మండల ప్రజల చిరకాల కళ అందని ద్రక్షలా మారింది. ఒకదశలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో గత జనవరి నెలలో ‘ఇంతమోసమా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ప్రభుత్వం స్పందించింది. స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి చొరవతోపాటు ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారుల కృషి ఫలితంగా సమ్మర్‌స్టోరేజ్‌ పనులకు సంబంధించిన అడ్డంకులు తొలగాయి. రూ.50కోట్ల అంచనాలతో రూపొందించిన పనులకు ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించింది. దీంతో సమ్మర్‌స్టోరేజ్‌ నిర్మాణ పనులు వేగవంత మయ్యో అవకాశం ఉంది.

ఇప్పటికే దర్శి నుండి పొదిలి వరకు 3 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులు పూర్తయ్యింది. మరో 15 కిలోమీటర్ల మేర అవసరమైన పైపులను సేకరించారు. పైపులను అమర్చేందుకు మట్టికాలువ పనులు కూడా పూర్తికావచ్చాయి. ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ రూ.10 కోట్లకు పైగా పనులు పూర్తి చేశారు. అందుకు సంబంధించిన బిల్లులు చెల్లించే సమయంలో ఆర్ధిక అనుమతులు లేవనే విషయాన్ని అధికారులు గుర్తించడంతో ఒక్కసారిగా అధికారులు, కాంట్రాక్టర్‌ ఖంగుతిన్నారు. దీనికితోడు ప్రభుత్వం మారడంతో పనుల పురోగతిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నిలకు ముందు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కూటమి నేతలు ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నిలుపుకున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆర్థిక అనుమతులు ఇప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అవసరమైతే నిర్మాణ పనుల కాలపరిమితిని పెంచి వీలైనంత త్వరలో పనులు పూర్తి చేయిస్తామని అధికారులు స్పష్టం చే శారు. ఏప్రిల్‌ నెలలో పనులు వేగవంతంగా చేపడతామని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులకు ఏర్పడిన అడ్డంకులు తొలగి పోవడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో స్టోరేజ్‌ నిర్మాణం వలన ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడంతోపాటు పరోక్షంగా వ్యవసాయంపై సాను కూల ప్రభావం కనపడే అవకాశం ఉంది

Updated Date - Mar 29 , 2025 | 01:40 AM