కనక దుర్గమ్మ కారుణ్య సౌందర్యమే పురాణపండ ‘సౌభాగ్య’: ఈ.ఓ రామారావు
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:12 AM
రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమానంగా రూపొందించిన సౌభాగ్య దివ్య గ్రంధాన్ని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల పవిత్ర వేదికపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు.
విజయవాడ, ఏప్రిల్ 11: అనంత రూపాలతో, అనంత రీతులుగా విస్తరించిన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కారుణ్యంతో భక్తజన సౌలభ్యం కోసం ‘సౌభాగ్య’ వంటి అపురూపమైన ఉత్తమ దివ్య గ్రంధాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి ఒక లక్షప్రతులు సమర్పించిన ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ ‘కిమ్స్’ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ధన్య చరితులని, అమృత తత్వాల సౌందర్యాన్ని పొంగిస్తూ ఈ సౌభాగ్య మంత్ర పేటికను రూపొందించిన శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, రచయిత పురాణపండ శ్రీనివాస్‌పై కనకదుర్గమ్మ కటాక్షశ్రీలు ఉన్నాయనడానికి ఈ సౌభాగ్య పరమ సౌందర్యంతో దర్శనమిస్తోందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు పేర్కొన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమానంగా రూపొందించిన సౌభాగ్య దివ్య గ్రంధాన్ని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల పవిత్ర వేదికపై ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ... బ్రహ్మాణ్డె పురాణాంతర్గతంగా, శ్రీ దేవీ భాగవతం ఆధారంగా, భారత భాగవతాల ఆధారంగా ‘సౌభాగ్య’లో అందించిన అద్భుత స్తోత్రాలు, ఈ స్తోత్రాలలో కొన్నిటికి పురాణపండ శ్రీనివాస్ కలం అందించిన ఉదాత్తమైన వ్యాఖ్యానాలు భక్త పాఠకులకే కాకుండా అర్చక పండిత వర్గాలను సైతం విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు.
అప్పటికప్పుడు ఈ సౌభాగ్య లక్ష ప్రతుల విస్తరణోద్యమాన్ని అర్చకుల, వేదపండితుల మధ్య రామారావు ప్రారంభించి ఆలయంలోని పండిత అర్చక బృందాలకు, భక్త జనసందోహానికి అందజేశారు. ఇకపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అన్నదాన పథకానికి విరాళమిచ్చే దాతలకు, నిత్యం కుంకుమార్చనలలో పాల్గొనే భక్తులకు, దేవస్థానం అధికారిక మాసపత్రిక ‘శ్రీ కనక దుర్గ ప్రభ’ చందాదారులకు, మల్లికార్జున స్వామి అభిషేకాల్లో పాల్గొనే భక్తులకు ఈ ‘సౌభాగ్య’ గ్రంధాన్ని ఆలయ సిబ్బంది ఉచితంగా అందజేస్తారని దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. ఎస్ .రామారావు ప్రకటించారు.
సౌభాగ్య పాకెట్ బుక్ నూట ముప్పై రెండు పేజీలతో, ఇండియన్ ఆర్ట్ పేపర్‌పై వర్ణభరితంగా, మేలిమి విలువలతో నాణ్యతా ప్రమాణాలతో ముద్రించిన ప్రముఖ ఆధ్యాత్మిక వికాస సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ పై ఆలయ వర్గాలు, భక్త జనులు ప్రశంసలు వర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ఈ మంత్ర ప్రసాదాన్ని ప్రవేశ పెట్టిన ఘనత శ్రీ దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు దక్కించుకుని చరిత్రకెక్కారు.