Share News

జెత్వానీ కేసులో ఆ ముగ్గురు

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:21 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తాజాగా ఏ2గా అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ఏ3గా నాటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, ఏ6గా నాటి విజయవాడ డీసీపీ విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు.

జెత్వానీ కేసులో ఆ ముగ్గురు

జెత్వానీ కేసులో ఆ ముగ్గురు

ఎఫ్‌ఐఆర్‌లో ఐపీఎస్‌ల పేర్లు నమోదు

మరో ఇద్దరు పోలీసు అధికారుల పేర్లూ

న్యాయవాది, డాక్యుమెంట్‌ రైటర్‌ కూడా

విజయవాడ కోర్టుకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ

ఏ1 విద్యాసాగర్‌కు 4 వరకు రిమాండ్‌

5 రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్‌

విజయవాడ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తాజాగా ఏ2గా అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ఏ3గా నాటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, ఏ6గా నాటి విజయవాడ డీసీపీ విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు. ఈ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో పాటు ఏ4గా ఏసీపీ హనుమంతరావు, ఏ5గా అప్పటి దర్యాప్తు అధికారి ఎం.సత్యనారాయణ, ఏ7గా న్యాయవాది, ఏ8గా నకిలీ డాక్యుమెంట్‌ను రాసిన రైటర్‌ పేర్లను పెట్టారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ కాపీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు అందజేశారు. ఈ కేసులో ఇదివరకే ఏ1గా చేర్చిన విద్యాసాగర్‌ను న్యాయాధికారి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి హాజరుపరిచారు. జెత్వానీ కేసు వెలుగు చూశాక పరారైన విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకున్నారు.

ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం న్యాయాధికారి ముందు హాజరు పరిచారు. విద్యాసాగర్‌కు వచ్చే నెల నాలుగో తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అతడిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. విద్యాసాగర్‌ను మరింతగా విచారించేందుకు ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. జెత్వానీ ఫిర్యాదు చేశాక విద్యాసాగర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఢిల్లీలో నివాసం ఉన్నాడు. ఉత్తరాది మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కేసు విషయం తెలియడంతో సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకుని కారులో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రాకపోకలు సాగించాడు. బళ్లారిలో ఉన్న తన బంధువుతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు పోలీసులు సాంకేతికంగా గుర్తించారు. డెహ్రాడూన్‌లో ట్రీ ఆఫ్‌ లైఫ్‌ రీసార్ట్‌లో బస చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి నిఘా పెట్టింది. కారులో రిసార్ట్‌లోకి వెళ్తుండగా విద్యాసాగర్‌ను పట్టుకున్నారు.

జెత్వానీపై తప్పుడు కేసు

‘‘ముంబైకి చెందిన కాదంబరి నరేంద్రకుమార్‌ జెత్వానీ ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. ముంబై, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లో నటిగా, మోడల్‌గా పనిచేసింది. ముంబైౖ, హైదరాబాద్‌లో మోడలింగ్‌ చేస్తున్నప్పుడు విద్యాసాగర్‌ పరిచయం చేసుకున్నాడు. ఈ సమయంలోనే విద్యాసాగర్‌ భార్య కోర్టులో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసింది. కాదంబరితో పరిచయం బాగా పెరిగాక విద్యాసాగర్‌ పెళ్లి ప్రతిపాదన చేశాడు. 2015లో ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెపై అసత్య ఆరోపణలు చేస్తూ, అసభ్యకర ఫొటోలను పంపి వేధించాడు. విద్యాసాగర్‌ వైసీపీ నాయకుడు. అతడికి పార్టీలో ప్రధాన నేతలతో సంబంధాలు ఉన్నాయి. కాదంబరిపై పగ తీర్చుకోవడానికి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు, కమిషనరేట్‌ అధికారులపై ఒత్తిడి చేసి నేరపూరిత కుట్రకు స్కెచ్‌ వేశారు. విద్యాసాగర్‌ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెపై తప్పుడు కేసును బనాయించాడు. ప్రస్తుత కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు అతడికి సహకరించారు. ఫోకల్‌ పోస్టింగ్‌లు, బదిలీలు లేకుండా చేసుకోవడం కోసం పోలీసు అధికారులు అతడితో చేతులు కలిపారు’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

పోలీసులు నిబంధనల ఉల్లంఘన

‘‘విద్యాసాగర్‌ మహారాష్ట్రలో రూ.100 స్టాంపు పేపరుపై ఒక నకలీ డాక్యుమెంట్‌ను తయారు చేశాడు. 80ఏఏ14164 నంబరు గల ఈ డాక్యుమెంట్‌ను 2018 నవంబరు 30న రాసినట్టుగా చూపించాడు. స్టాంపు పేపరును 2018 నవంబరు 20న అమ్మినట్టుగా దానిపై ఉంది. దీనిపై ఒక కథనాన్ని రాశారు. చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌ నుంచి ఆమె రూ.5 లక్షలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. భూమి అమ్మకానికి సంబంధించి ఈ డబ్బులు తీసుకున్నట్టు రాశారు. తర్వాత విద్యాసాగర్‌కు మేలు చేసేలా పోలీసు అధికారులు తప్పుదారిలో దర్యాప్తు చేశారు. ముంబైలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న కాదంబరి కుటుంబ సభ్యులను చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. జగ్గయ్యపేటలో విద్యాసాగర్‌కు సంబంధించిన సర్వేనంబరు 396/2ఏ2హెచ్‌/1ఎలో ఐదు ఎకరాల భూమి విక్రయం చేస్తున్నట్టుగా నకిలీ డాక్యుమెంట్‌ను తయారు చేశారు. అందులో ఎక్కడా కాదంబరి సంతకం లేదు. దీన్నిబట్టి డాక్యుమెంట్‌ నకిలీదని నిర్ధారించాం. క్రైం నంబరు 90/2024 కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌ను పిలిపించి ఫిబ్రవరి 2న వాంగ్మూలం నమోదు చేశారు.

తాము కాదంబరిని ఎప్పుడూ చూడలేదని, ఆమెకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. కొండపల్లి ఖిల్లా వద్ద కాదంబరిని వారు కలిశారా లేదా అన్నదానిపై అప్పటి దర్యాప్తు అధికారి విచారణ చేయలేదు. ఏ2 (పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు), ఏ3(కాంతిరాణా), ఏ6(విశాల్‌గున్నీ)కి కాదంబరి అరెస్టు గురించి చెప్పారు. కాంతిరాణా, ఏ4(అప్పటి ఏసీపీ హనుమంతరావు), ఏ5(అప్పటి దర్యాప్తు అధికారి ఎం.సత్యనారాయణ) విద్యాసాగర్‌తో కలిసి తప్పుడు కేసు నమోదు చేశారు. కేసు నమోదుకు ముందే కాంతిరాణా ఫిబ్రవరి 1న ముంబైకి వెళ్లే పోలీసు బృందానికి విమానం టికెట్లు బుక్‌ చేశారు. నకిలీ డాక్యుమెంట్‌ను విద్యాసాగర్‌, పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ఏ5(న్యాయవాది) తయారు చేశారు. ఏ2 దగ్గర నుంచి ఏ4 వరకు తప్పుడు దర్యాప్తు చేసి కాదంబరి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపారు. తర్వాత కోర్టు రిమాండ్‌ను పొడిగించడంతో 42 రోజులు ఆమె కుటుంబ సభ్యులు జైల్లో ఉన్నారు. అందులో ఐదు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఏ1 నుంచి ఏ5 వరకు ఐపీసీ 220, 342 సెక్షన్లను ఉల్లంఘించి కాదంబరిని జైల్లో ఉంచారు’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 04:21 AM