Gudivada Amarnath: రుషికొండ ప్యాలెస్‌పై గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 03 , 2024 | 06:23 PM
రుషికొండ లాంటి నిర్మాణాన్ని ఎక్కడైనా నిర్మించారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడైనా చూపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. రుషికొండ అద్భుతమైన నిర్మాణమని గతంలో చెప్పలేదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
విశాఖపట్నం: రుషికొండ ప్యాలెస్‌పై మాజీ మంత్రి, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రుషికొండ నిర్మాణం వైఎస్ జగన్ సొంత ఇంటి నిర్మాణం అంటూ ప్రచారం చేయడం దారుణమని.. అ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గతంలో త్రీ మెన్ కమిటీ , ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బాగుంటుందని సూచించిందని ఆ విధంగా నిర్మాణం చేశామని స్పష్టం చేశారు.
రుషికొండ లాంటి నిర్మాణాన్ని ఎక్కడైనా నిర్మించారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడైనా చూపించాలని సవాల్ విసిరారు. రుషికొండ అద్భుతమైన నిర్మాణమని గతంలో చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంత స్థాయిలో అద్భుతంగా ఎక్కడ నిర్మాణం చేయలేదని. దాన్ని ఎలా వినియోగించాలో ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవసరాలు, విలాసాల కోసం, వివిధ సందర్భాల్లో రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, ఏర్పాటు అంటే ఇందులో వాస్తవం ఎంతో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తే స్వాగతిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు టీడీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ ప్యాలెస్
కాగా.. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై నిర్మించిన ఖరీదైన భవనం విషయంలో వైసీపీ నాయకులు అవాస్తవాలనే వల్లే వేస్తూ వచ్చారు. పర్యాటకులకు ఉపయోగపడుతున్న హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి జగన్ కోసం ప్యాలెస్ నిర్మాణం ప్రారంభించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా వైసీపీ నాయకులు మాత్రం పర్యాటకుల కోసమేనని బుకాయించారు. చివరకు హైకోర్టులో కూడా ఇవే మాటలు చెప్పి తప్పుదారి పట్టించారు. మొత్తం రూ.451.67 కోట్లు వెచ్చించారు. కేవలం జగన్, ఆయన కుటుంబం నివాసం కోసం 1,46,784 చ.అ. విసీర్ణంలో భవనాలు నిర్మించారు.
ఈ భవన సముదాయాన్ని 2024 ఫిబ్రవరి 29న నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా , ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైసీపీ విశాఖ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కలసి ప్రారంభించారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం హోదాలో జగన్ బస చేయడానికి ఈ భవనం వీలుగా ఉంటుందని త్రిసభ్య కమిటీ ఎంపిక చేసి, సిఫారసు చేసిందని, ఈ ప్రతిపాదనకు జగన్ ఆమోదముద్ర వేస్తే... సీఎం క్యాంప్ ఆఫీసుగా ఉపయోగిస్తామని చెప్పారు. అయితే దీనికి 3నెలల ముందే త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకు ఆ భవనాన్ని క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించుకుంటామని ప్రభుత్వం 2023 డిసెంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
AP Politics: చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
For More AndhraPradesh News And Telugu News..