YCP: రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ
ABN , Publish Date - Feb 08 , 2024 | 01:57 PM
రాజ్యసభకు వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్లను ఫిక్స్ చేయడం జరిగింది.

అమరావతి: రాజ్యసభకు వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్లను ఫిక్స్ చేయడం జరిగింది. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే దీనికి ముందు మూడవ పేరుగా ఆరని శ్రీనివాసులు పేరును వైసీపీ ఖరారు చేసింది. ఆ తరువాత ఆయన స్థానంలో మేడా రఘునాథరెడ్డి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి చేర్చడం జరిగింది.
గొల్ల బాబూరావు ఎంపిక వెనుక కారణమిదే..
గతంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్ఠానం తనకు అన్యాయం చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మరణానంతరం నుంచి జగన్ వెంటే ఉన్నానని గొల్ల బాబురావు తెలిపారు. అలాంటి బాబూరావుకు రాజ్యసభ కేటాయించడానికి కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో నియోజకవర్గ ఇన్‌చార్జుల జాబితాలో వైసీపీ అధిష్టానం చాలా మార్పులు, చేర్పులు చేసింది. చాలా మంది సిట్టింగ్‌లను తొలగించింది. అలా తొలగించిన సిట్టింగ్‌ల్లో ఎక్కువమంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. వారంతా ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాజ్యసభను వేరొకరికి కేటాయిస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లన్నీ కోల్పోతామనే భయంతో ఏపీ సీఎం జగన్.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబూరావును రాజ్యసభ అభ్యర్థిగా ఫిక్స్ చేసినట్టు సమాచారం.