Share News

CM Chandrababu: అలాంటివి అస్సలు సహించను.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్

ABN , Publish Date - Mar 14 , 2025 | 02:21 PM

CM Chandrababu Naidu: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని టీడీపీ నేతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

CM Chandrababu: అలాంటివి అస్సలు సహించను.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్
CM Chandrababu Naidu

అమరావతి: తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ఇవాళ (సోమవారం) ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని ఆదేశించారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.


గ్రూపు రాజకీయాలు వద్దు..

జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందజేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలని.. పర్యటనల సంఖ్య ఇంకా పెరగాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలని సూచించారు. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పారు. తాను ఈ విషయాన్ని చెబితే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వవద్దని తాను చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.


వివక్ష ఉండదు..

సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతలను దరిచేరనివ్వద్దని చెప్పారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని అన్నారు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన నేతల వివరాలను నామినేటెడ్ పదవుల కోసం అందజేయాలని కోరారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని మాటిచ్చారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్‌లను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.


నామినేటెడ్ పదవులపై చర్చ..

‘నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నాం. పదవులు తీసుకున్నట్లు కాదు... ఎన్నికల్లో ప్రభావం చూపించాలి. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు.. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలి. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన మనం అందించాలి’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఆ పథకంపై ఫోకస్ పెట్టాలి..

‘సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం మన విధానం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలి. 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా అందిస్తాం. కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి బీసీలకు రూ.80 వేల మేర రాయితీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో మీ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా

ABN Effect: వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 02:40 PM