అవునా జగన్! మీరు అబద్ధాలే ఆడరా?
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:19 AM
రాజధాని అమరావతిపై జగన్ ఏకంగా అబద్ధాల ఫ్యాక్టరీనే తెరిచేశారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని నిండు అసెంబ్లీలో చెప్పారు..
అమరావతిలోనే రాజధాని అని చెప్పలేదా?
బాబాయిపై గొడ్డలి నిండా అబద్ధాల మరకలే..
ఉద్యోగుల సీపీఎ్‌సపై ‘వారాల అబ్బాయి’ మీరు కాదా?
జాబ్ కేలండర్‌పై యువతను వంచించలేదా?
మద్య నిషేధంలో మహిళలను ముంచలేదా?
ప్రత్యేక హోదాపై ఐదేళ్లూ మీవి బొంకులేగా?
అధికారంలోకి వచ్చిందే అబద్ధాలతో కదా!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాను. కానీ అబద్ధాలు మాత్రం చెప్పను’’.. ఇవి గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు. కానీ, 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కాదు! అధికారంలోకి వచ్చాక చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు! అయినా సరే... ‘అబద్ధాలు ఆడను’ అంటూ జగన్ చేసిన ప్రకటన విని ప్రజలు విస్తుపోతున్నారు. ‘అవునా.. నిజమా’ అని వైసీపీ బాధితులైన జనం విస్తుపోయారు. నిలువెత్తు అబద్ధం.. ‘నేను అబద్ధం ఆడనమ్మా’ అని సుద్దులు పలికినట్టు జగన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ రాజకీయపక్షాలు సెటైర్లు వేస్తుంటే... కనీసం గత పదేళ్లలో జగన్ అబద్ధాల చిట్టా లెక్కబెట్టడానికి వేళ్లు కూడా సరిపోబోవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అబద్ధాల మేత...
రాజధాని అమరావతిపై జగన్ ఏకంగా అబద్ధాల ఫ్యాక్టరీనే తెరిచేశారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని నిండు అసెంబ్లీలో చెప్పారు.. తనకు అమరావతిలో ఇల్లు ఉన్నదని, ఇక్కడే ఉంటానని 2019 ఎన్నికల్లో ప్రజలకు తెలిపారు. కానీ, నమ్మి అధికారమిస్తే గత ఐదేళ్లూ అమరావతికి వెన్నుపోట్లు పొడిచారు. తన ఇల్లు అమరావతిలో ఉన్నదన్న నోటితోనే.. శ్మశానం, సమాధులు, ఎడారి అంటూ విషం చిమ్మారు. మూడు రాజధానులు అంటూ.. తన నిర్వాకంతో కనీసం చెప్పుకోవడానికి కూడా రాజధానే లేకుండా చేశారు.
2019లో బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను తొలుత గుండెపోటుగా జగన్ చిత్రీకరించారు. అనంతరం అది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేయించిన హత్యగా ఆరోపించారు. తన పత్రికలో ‘నారాసుర రక్త చరిత్ర’ పేరిట కథనాలు రాయించారు. కానీ, చివరకు.. వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు పాత్రలేదని స్వయంగా సీబీఐయే తేల్చిచెప్పింది. జగన్ తమ్ముడు, ఎంపీ అవినాశ్ రెడ్డికి సంకెళ్లు వేసింది. బాబాయిపై గొడ్డలి వ్యవహారంలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని లోకానికి తెలిసిపోయింది.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తానని ప్రజా సమక్షంలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహనరెడ్డి బహిరంగంగా హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. ‘‘మీ హామీ అబద్ధం కాదా’ అని ఉద్యోగులు.. జగన్‌ను నిలదీస్తున్నారు.
యేటా జనవరి ఒకటో తేదీన జాబ్ కేలండర్ విడుదల చేస్తానని చెప్పి జగన్ నాడు అధికారంలోకి వచ్చారు. పదవిలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ‘‘జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. కానీ తాను అధికారంలోకి రావడానికి మాకు అబద్ధాలు చెప్పినట్టు ఆ తర్వాతగానీ తెలుసుకోలేకపోయాం’’ అని నిరుద్యోగులు చెబుతున్నాయి.
అధికారంలోనికి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని రాష్ట్రంలోని మహిళలకు జగన్ వాగ్దానం చేశారు. అదే నమ్మకంతో అక్కచెల్లెమ్మలు...వైసీపీని అధికారంలోకి తెచ్చారు. కానీ, జగన్ పదవిలో ఉన్న ఐదేళ్లలో ఏ ‘దశ’లోనూ మద్యపాన నిషేధం గురించి ఆయన పట్టించుకోలేదు. ‘‘మరి ఇది అబద్ధపు వాగ్దానం కాదా ?’’ అని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
కరెంటు బిలులు చూస్తేనే .. షాక్ కొట్టేలా .. బాదుడే బాదుడుకు చంద్రబాబు పాల్పడ్డారంటూ జగన్ బిగ్గరగా అరుస్తూ బహిరంగ సభలో మాట్లాడేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే..ఎస్సీ,ఎస్టీలకు 200 యూనిట్ల దాకా ఉచితం చేస్తానని ప్రకటించారు. రేషనలైజేషన్ పేరిట ఆస్తిని బట్టి.. కొందరికి ఈ వెసులుబాటును ఎగ్గొట్టారు. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేరిట డబుల్ బాదుడును అమలుచేశారు.
అధికారంలోనికి వస్తే 45 ఏళ్లకే సామాజిక భద్రతా పింఛను ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ, తాను అధికారంలో ఉండగా.. దానినీ సీపీఎస్ రద్దు ..సంపూర్ణ మద్య నిషేధం జాబితాలోకి చేర్చేశారు. అబద్ధాల్లో తన రికార్డును తానే బద్దలు కొట్టారు.
వైసీపీకి 25 లోక్‌సభస్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానంటూ జగన్ ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చారు. 22 లోక్‌సభ స్థానాలు దక్కించుకున్నా.. ఏనాడూ ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీని నిలదీయలేదు. హోదాను హుళక్కనిపించి జనం దృష్టిలో అబద్ధాల మేతగా పలచన అయ్యారు.