Nandyal : పెట్రోల్ పోసి తగలబెట్టాడు!
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:59 AM
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సజీవ దహనం కాగా.. యువకుడికి కూడా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
17 ఏళ్ల బాలికపై ఉన్మాది ఘాతుకం
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దారుణం
సజీవ దహనమైన యువతి
మంటల్లో గాయపడిన యువకుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఘోరం
నందికొట్కూరు/కర్నూలు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సజీవ దహనం కాగా.. యువకుడికి కూడా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. మృతురాలు తల్లి, బంధువులు, పోలీసులు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన ఇంజమూరి శివరామకృష్ణ, లక్ష్మి దంపతులకు ఇంజమూరి లహరి (17) ఏకైక కుమార్తె. ఆమె పుట్టిన నెలకే తండ్రి శివరామకృష్ణ మరణించడంతో.. అమ్మ లక్ష్మి కూలి పనులు చేస్తూ లహరిని పెంచింది. పదో తరగతి వరకు రామళ్లకోటలో చదవిన లహరి.. అమ్మమ్మ, తాతయ్యల స్వగ్రామమైన నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉంటూ స్థానిక కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి అవ్వతాతలు ఓ గదిలో పడుకుంటే.. బాలిక పక్క గదిలో నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున బాలిక కేకలు విని తాతయ్య పరుగున వచ్చాడు. గదిలోపల మనవరాలు మంటల్లో కాలిపోతుండటం, పక్కనే ఓ యువకుడు కూడా ఉంటడం చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత లోపలి నుంచి బయటికొచ్చిన ఆ యువకుడిని స్థానికులు అడ్డుకున్నారు.
వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర (21) అనే యువకుడే ప్రేమ పేరుతో అర్ధరాత్రి ఇంటికొచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, ప్రేమించలేదనే అక్కసుతోనే తన కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడని లహరి తల్లి లక్ష్మి కన్నీరు మున్నీరైంది. కాగా.. బాలికతోపాటు ఆ మంటల్లో చిక్కుకున్న రాఘవేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పదో తరగతి నుంచే బాలికను రాఘవేంద్ర ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం రాత్రి లహరితో ఫోన్లో మాట్లాడి అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఉంటాడని, ప్లాన్ ప్రకారం తనతో తీసుకెళ్లిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పుపెట్టి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్పీకి హోంమంత్రి అనిత ఫోన్
ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. కాగా, సంఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాఘవేంద్ర, లహరి వెల్దుర్తి మండలంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారన్నారు. విద్యుత్ షాట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? ఇద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారా..? లహరిని రాఘవేంద్ర హత్య చేశాడా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణాల్లో విచారణ చేసి కారణాలు వెల్లడిస్తామని చెప్పారు. రాఘవేంద్ర నుంచి కూడా వివరాలు సేకరిస్తామని తెలిపారు.