Share News

Vijayawada Floods: ముంచింది జగనే!

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:09 AM

బెజవాడ వరదపై విపక్షనేత వైఎస్‌ జగన్‌వి బురదజల్లుడు రాజకీయమే అని స్పష్టమైంది. బుడమేరు సృష్టించిన విధ్వంసానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని తేలిపోయింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశంతో జల వనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను ఒక్క కలంపోటుతో జగన్‌ రద్దు చేశారు...

Vijayawada Floods: ముంచింది జగనే!
Vijayawada Floods

  • బుడమేరు ఆధునీకరణకు మోకాలడ్డు

  • అధికారంలోకి రాగానే ‘కలంపోటు’

  • ఏకంగా 198 సాగునీటి పనులు రద్దు

  • అందులో బుడమేరు ఆధునీకరణ కూడా!

  • బాబు హయాంలో చేపట్టడమే కారణం

  • ఆ పనులే పూర్తయితే ఈ విపత్తు ఉండేదా?

(అమరావతి – ఆంధ్రజ్యోతి) :

బెజవాడ వరదపై విపక్షనేత వైఎస్‌ జగన్‌వి (YS Jagan Mohan Reddy) బురదజల్లుడు రాజకీయమే అని స్పష్టమైంది. బుడమేరు సృష్టించిన విధ్వంసానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని తేలిపోయింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు (Nara Chandrababu) పేరొస్తుందన్న దురుద్దేశంతో జల వనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను ఒక్క కలంపోటుతో జగన్‌ రద్దు చేశారు. అందులో... బుడమేరు కాల్వల ఆధునీకరణ పనులూ ఉన్నాయి. రద్దు చేసిన పనులు తానైనా కొత్తగా చేపట్టారా అంటే అదీ లేదు! అన్నింటినీ రద్దుపద్దులో కలిపేశారు. ఆ పనులు పూర్తయి ఉంటే బుడమేరు ప్రధాన కాలువ 15,000 క్యూసెక్కుల నుంచి 45,000 క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా విస్తరించేది. కాలువ కట్టలు మరింత బలోపేతమయ్యేవి. అది జరగనందునే నేడు ఈ విపత్తు.


YS-Jagan-Floods.jpg

జల విలయానికి శ్రీకారం..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రంలో జల విలయానికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు సంస్థను రద్దు చేశారు. ఆ వెంటనే చంద్రబాబు హయాంలో బుడమేరుతో సహా రాష్ట్ర జల వనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను అర్ధంతరంగా ఆపేస్తూ 2020 సెప్టెంబరు 8న ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులో ఏముందంటే.. ఉత్తరాంధ్రలో 12, గోదావరి డెల్టాలో 24, పోలవరం ప్రాజెక్టులో 7, కృష్ణా డెల్టా సిస్టమ్‌లో 51, ఒంగోలులో 2, ఎన్‌టీఆర్‌ తెలుగుగంగలో 25, కర్నూలులో 9, కడపలో 14, మైనర్‌ ఇరిగేషన్‌లో 16, అనంతపురంలో 18 చొప్పున మొత్తంగా 198 పనులు ముందస్తుగా రద్దు (ప్రీక్లోజర్‌) చేశారు. అధికారుల నుంచి ఎలాంటి నివేదికలు లేకున్నా జగన్‌ ఏకపక్షంగా పనులన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటికి సంబంధించి జరుగుతున్న కీలకమైన పనులన్నింటినీ వెంటనే నిలిపివేయాలని నాటి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఆదేశించారు. ఈ విధంగా అపేసిన పనులను తన హయాంలో మళ్లీ ప్రారంభించే ఆలోచన కూడా చేయలేదు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ హడావుడి చేయడమే తప్ప దానితో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు.


Budameru.jpg

కీలక దశలో బుడమేరు పనులు రద్దు

ముందూ వెనకా ఆలోచించకుండా జగన్‌ ఆపేసిన పనుల్లో బుడమేరు కాలువ ఆధునీకరణ పనులు కూడా ఉన్నాయి.

● ప్యాకేజీ నం. 15–1–4గా పేర్కొన్న బుడమేరు ప్రధాన కాలువ 24.000 కి.మీ. నుంచి 42.500 కి.మీ. వరకూ (ఎనికేపాడు) ఈపీసీ విధానంలో రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగించారు. ఈ పనులను మధ్యలోనే ఆపేయడంతో కాలువ మరింత ఆధ్వాన్న స్థితికి చేరుకుంది. ప్రస్తుత బుడమేరు విలయంలో దెబ్బతిన్న సింగ్‌నగర్‌, రాజరాజేశ్వరీపేట తదితర ప్రాంతాలు ఈ పనుల పరిధిలోనే ఉన్నాయి.

● ప్యాకేజీ నం.15–1–4 పార్ట్‌ వర్క్‌ కింద బుడమేరు కాలువ పనులను ఎనికేపాడు వరకూ గుడివాడకు చెందిన ఎన్‌ఏఎస్‌ ఆబు కన్‌స్ట్రక్షన్‌ చేపట్టింది. ఈ పనులనూ ఆర్ధంతరంగా ఆపేశారు.

● ప్యాకేజీ 15–1–5 కింద బుడమేరు ప్రధాన కాలువ పనులు 42.500 కిలోమీటర్ల నుంచి 50.600 కిలోమీటర్ల వరకూ ఎనికేపాడు ముందు వరకూ విస్తరణ పనులను హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్‌ చేపడుతోంది. ఈ పనులనూ ముందుకు సాగకుండా జగన్‌ ఆపేశారు.

● ఇదే ప్యాకేజీలోని కొంతభాగాన్ని గుడివాడకు చెందిన ఎన్‌ఏఎస్‌ బాబు కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించారు. ఈ పనులన్నీ పూర్తయితే బుడమేరుకు ఎంత వరద వచ్చినా తట్టుకునేది. విజయవాడ నగరం సగం మునిగిపోయేది కాదు. దాదాపు 6లక్షల మంది నిరాశ్రయులయ్యేవారు కాదు.


Payakapuram.jpg

చేసిన పాపం దాచేసి..

అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సినదంతా చేసేసి ఇప్పుడేమో చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండేందుకే బుడమేరు చానల్‌ ఓపెన్‌ చేశారంటూ జగన్‌ ఆరోపిస్తున్నారు. బుడమేరు ఆధునీకరణ పనులు నిలిపేసి, అంతా చంద్రబాబు తప్పంటూ మాట్లాడుతున్నారు. అయితే బుడమేరుతో సహా 198 పనులను జగన్‌ నిలిపేసిన విషయం ఉత్తర్వుతో సహా బయటపడటంతో బుడమేరుకు జగన్‌ శాపంలా మారారని అందరికీ అర్థమైంది. ఆధారాలతో సహా ఆయన చేసిన నిర్వాకం రుజువైనందున వరద నష్టానికి జగన్‌ బాధ్యత వహిస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జల వనరుల ప్రాజక్టుల పనులను నిలిపివేసి బుడమేరు, అన్నమయ్య, పోలవరం ప్రాజెక్టులకు శాపంగా మారిన జగన్‌ ఇప్పుడు ప్రజలను నమ్మించి మోసగించాలని చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుడమేరు పనులు చేపట్టాలనుకున్నా కరోనా కారణంగానే పనులు ముందుకు సాగలేదంటూ తన రోత పత్రికలో రాయించుకుంటున్నారు. వాస్తవానికి కరోనా ప్రభావం పోయి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లలో బుడమేరు పనులు ఎందుకు చేపట్టలేదో జగన్‌ వివరించాలన్న డిమాండ్‌ వస్తోంది. జగన్‌ జారీ చేసిన జీవో 365ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే యోచనలో రాజకీయపక్షాలు ఉన్నాయి.

Updated Date - Sep 06 , 2024 | 08:09 AM