Hyderabad: 8 ఏళ్లుగా నగరంలోనే నైజీరియన్ స్మగ్లర్
ABN , Publish Date - Jul 17 , 2024 | 11:52 AM
నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
- ఇప్పటి వరకూ పోలీసులకు చిక్కని ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా
- నగరంలో పదుల సంఖ్యలో భారీ నెట్‌వర్క్
- కిలోల కొద్ది కొకైన్ విక్రయించి.. రూ. కోట్లు కొల్లగొట్టారు
- అమన్ ప్రీత్‌సింగ్ సీడీఆర్‌పై పోలీసుల ఆరా..
- సినీ ఇండస్ట్రీలో లింకులపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ సిటీ: నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇదికూడా చదవండి: Suspension: ఎస్‌ఐ, ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్..
సన్‌సిటీలో తిష్ఠ..
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో పరారీలో ఉన్న ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా అలియాస్ కలేషి 8 ఏళ్ల క్రితం (2017) నగరానికి వచ్చి బండ్లగూడ పరిధిలోని సన్‌సిటీలో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆయన హైదర్షాకోట్‌లోని విశాఖనగర్ వ్యూ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నట్లు తేలింది. అంతకు ముందే నగరానికి వచ్చిన నైజీరియేన్ ఘరానా స్మగ్లర్స్ డైవిన్ ఎబూకా సుజీ అలియాస్ ఎబూకా అలియాస్ లిబూకా అలియాస్ ఇమ్మాన్యుయల్ అలియాస్ లెవల్ నగరంలో పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు తేలింది. అతని ద్వారానే ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా నగరానికి వచ్చి స్మగ్లింగ్ కార్యకలాపాలను చక్కబెట్టేవాడు. బెంగళూరులో పరిచయమైన నైజీరియన్ మహిళా స్మగ్లర్లు ఒనూహ బ్లెస్సింగ్ అలియాస్ జోయానాగోమ్స్ అలియాస్ జోను అతని వద్ద చేరి గోవా, ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేసేది. హైదరాబాద్ నగరంలో పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాన స్మగ్లర్ డైవిన్ ఎబూకా సుజీ తిరిగి నైజీరియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పూర్తి స్మగ్లింగ్ బాధ్యతలు ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా అలియాస్ కలేషి తీసుకున్నాడు.
నైజీరియా నుంచి ప్రధాన నిందితుడు కొకైన్ డ్రగ్‌ను సముద్రమార్గం గుండా ఢిల్లీకి చేరేలా సరుకు పంపేవాడు. సరుకు ఢిల్లీకి చేరిన తర్వాత బ్లెస్సింగ్ వెళ్లి తీసుకునేది. అక్కడి నుంచి ప్రధాన నిందితుని ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉన్న ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా అలియాస్ కలేషికి అందజేయడంతో పాటు ఇతర నగరాల్లోనూ సరఫరా చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని టోలిచౌకి, సన్‌సిటీ, బండ్లగూడలో నైజీరియన్లు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం 2014లో నగరానికి వచ్చిన అజీజ్ నోహీమ్ అడెషోలాకు ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా అలియాస్ కలేషికి పరిచయం అయ్యాడు. అయితే, ఫేక్ డీడీ సమర్పించిన సమయంలో జైలుకెళ్లిన అజీజ్‌కు ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా సహాయం చేశాడు. అలా అతనితో స్నేహం కుదిరిన తర్వాత అతని సలహాతో స్మగ్లర్‌గా మారినట్లు తేలింది.
కేజీల కొద్ది కొకైన్ విక్రయం..
2017లో నగరానికి వచ్చిన ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా అలియాస్ కలేషి ఇప్పటి వరకు కేజీల కొద్ది కొకైన్ విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క బ్లెస్సింగ్ మాత్రమే ఢిల్లీ నుంచి సరుకు డెలివరీ తీసుకున్న తర్వాత 25 నుంచి 30 సార్లు హైదరాబాద్‌కు వచ్చి సరుకు అందజేసి వెళ్లినట్లు తేలింది. ఈ ఎనిమిదేళ్లలో ఫ్రాంక్లిన్ కిలోల కొద్ది కొకైన్‌ను విక్రయించి రూ. కోట్లలో డబ్బులు సంపాదించినట్లు తేలింది. తన నెట్‌వర్క్‌లో భాగంగా ఇటీవల పెడ్లర్‌గా అవతారం ఎత్తిన అల్లం సత్యవెంకట గౌతమ్ కేవలం 7 నెలల్లోనే 2.6కేజీల కొకైన్ కస్టమర్స్‌కు సప్లై చేసి కమీషన్ రూపం లో రూ.13.24లక్షలు సంపాదించాడు. మరో నిందితుడు వరుణ్‌కుమార్ సత్యగౌతమ్ ద్వారా ఒక గ్రాము కొకైన్ రూ.8 వేల చొప్పున కొనుగోలు చేసి, నగరంలోని కస్టమర్స్‌కు రూ. 12వేలకు విక్రయించేవాడు. ఇలా 7 నెలల్లోనే వరుణ్‌కుమార్ రూ.6లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీన్ని బట్టి ప్రధాన స్మగ్లర్స్ 8 ఏళ్లలో ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున 8 ఏళ్లుగా నగరంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నా.. ఇప్పటి వరకు నైజీరియన్ ఘరానా స్మగ్లర్స్ డైవిన్ ఎబూకా సుజీ, ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచ్చెన్నా పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. దాంతో ఎలాగైనా వారిని పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో వారిపై రూ. 2లక్షల రివార్డును టీజీ న్యాబ్ అధికారులు ప్రకటించారు.
అమన్ ప్రీత్‌సింగ్ కాంటాక్టులపై..
డ్రగ్స్ స్మగ్లర్స్‌తో పాటు... పోలీసులు 13 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ సింగ్ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కాంటాక్టులపై దృష్టి సారించారు. సీడీఆర్ తీసి ఎవరెవరితో కాంటాక్టులు ఉన్నాయి. డ్రగ్స్‌కు సంబంధించిన ఇండస్ట్రీలో ఎవరెవరితో లింకులు ఉన్నాయి..? ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడు.? ఎవరి ద్వారా తీసుకుంటున్నాడు..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని లోటస్ పాండులో ఉంటూ.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే అతనికి డ్రగ్స్ అలవాటు అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కాల్‌లిస్టు, వాట్సాప్ చాట్, ఇతర ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ను పోలీసులు చెక్ చేస్తున్నట్లు తేలింది. అమన్‌తో పాటు.. డ్రగ్స్ వినియోగదారులు ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాతి, బంజారాహిల్స్‌కు చెందిన అనికీత్, గచ్చిబౌలికి చెందిన యశ్వంత్, జూబ్లీహిల్స్‌కు చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీ చరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్ కుమార్, పంజాగుట్టకు చెందిన నిఖిల్ దావన్, గచ్చిబౌలికి చెందిన మదురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరి కాంటాక్టులు, కాల్‌లిస్టులు, డ్రగ్స్ లింకులపై ఆరా తీస్తున్నారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News