Share News

గాజా: నేరస్థులు, సహాపరాధులు

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:57 AM

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్‌ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ‘లెబనాన్‌ తదుపరి గాజా కాకూడదని’ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి చాలా దూరదృష్టితో హెచ్చరించారు.

గాజా: నేరస్థులు, సహాపరాధులు

  • గతానుగతం

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్‌ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ‘లెబనాన్‌ తదుపరి గాజా కాకూడదని’ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి చాలా దూరదృష్టితో హెచ్చరించారు. స్లోవేనియా, ఆస్ట్రేలియా రెండూ అమెరికాకు సన్నిహిత దేశాలే అయినప్పటికీ అవి తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాయి. ఆ ధైర్యం మన ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రిలో పూర్తిగా కొరవడింది!

హమాస్‌ 7 అక్టోబర్‌ 2023న ఇజ్రాయిల్‌ పౌరులపై ఒక క్రూరమైన దాడికి పాల్పడింది. ఆ ఘాతుకానికి 1100 మందికి పైగా మరణించారు. వారిలో నాలుగింట మూడు వంతుల మంది పౌరులు. ఇజ్రాయిలీ రాజ్యవ్యవస్థ వెన్వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించింది. హమాస్‌ నియంత్రణలో ఉన్న పాలస్తీనా ప్రాంతం గాజాపై శతఘ్ని గుండ్ల వర్షాన్ని కురిపించింది. వందలాది క్షిపణులను ప్రయోగించింది. పట్టణాలు, పల్లెలు ఎన్నో నేలమట్టమై పోయాయి. ఈ ప్రతీకారాగ్నులు కొద్ది రోజులలో కాకపోయినా కొన్ని వారాలకు నిలిచిపోగలవని ఎవరైనా భావిస్తారు, ఆశిస్తారు. అయితే ఇజ్రాయిలీలు తమ అమానుష దాడులను కొనసాగించారు. అవి ఇప్పటికీ నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి.

ఏడాది కాలంగా ఎడతెగకుండా జరుగుతున్న ఆ బీభత్సకాండలో 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ సేనలు నిర్దాక్షిణ్యంగా హతమార్చాయి. ఈ హతులలో 90 శాతం మంది పౌరులే. ఇజ్రాయిల్‌ కక్షకు పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, పడుతున్న యాతనలు అనంతమైనవి, మాటల్లో అభివర్ణించలేనివి. మానవత ఒక మృగతృష్ణగా మిగిలిపోయిన విషాద సందర్భమిది. గాజా జనాభాలో పది లక్షల మందికి పైగా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిర్వాసితులయ్యారు. గాజాలో విధ్వంసం అనంతరం ఇజ్రాయిల్‌ ఇప్పుడు తన దృష్టిని లెబనాన్‌ పైకి సారించింది. గాజాలో మాదిరిగానే లెబనాన్‌లో కూడా ఉగ్రవాదులు, అమాయక పౌరుల మధ్య తేడాను పాటించకుండా ఇజ్రాయిల్‌ సేనలు మారణ హోమం చేస్తున్నాయి. నిర్దిష్ట వ్యక్తులను తుదముట్టించే ప్రయత్నంలో వందలాది లెబనీస్‌ పౌరులను ఇజ్రాయిల్‌ బలిగొన్నది. ఇంకా ఎన్నో వేల మంది నిరాశ్రయులైపోయారు.


ఇజ్రాయిల్‌ ప్రభుత్వమూ, హమాస్‌ రెండూ యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) అభిశంసించింది. ఇది పూర్తిగా న్యాయసమ్మతమైన తీర్పు. ఈ యుద్ధం చారిత్రక ఘటనల పరంపరలో భాగంగా సంభవిస్తోందని వాదించేందుకు ఎంతగా ప్రయత్నించినా గత ఏడాది అక్టోబర్‌ 7న హమాస్‌ కిరాతక దాడులు సమర్థించలేనివి. ఇజ్రాయిల్‌ నేరాలు అంతకంటే తీవ్రమైనవి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకునే నెపంతో ఇజ్రాయిల్‌ విచక్షణారహితంగా అమానుష దాడులకు పాల్పడుతోంది. గాజాలోని పాఠశాలలు, ఆసుపత్రులను పూర్తిగా నేలమట్టం చేసింది. వేలాది పాలస్తీనియన్లను హతమార్చడంతో పాటు గాజా వాసులకు ఆహారం, మంచినీరు, విద్యుత్‌ సరఫరాలపై కఠిన ఆంక్షలు విధించింది. ఫలితంగా అసంఖ్యాకులు ఆకలిమంటల బారిన పడ్డారు.

గాజాలో ఘర్షణలపై వార్తా నివేదన ప్రధానంగా స్పర్థిస్తున్న పక్షాల (ఇజ్రాయిలీలు, హమాస్‌) పరంగా ఉంటోంది. అయితే ఆ ఘర్షణలకు కారకులవడంతో పాటు అవి నిరంతరాయంగా కొనసాగేలా చేస్తున్న ఇతర బృందాల, దేశాలపై ఈ కాలమ్‌లో నేను దృష్టి పెడుతున్నాను. సమస్త యుద్ధ నేరాలలో కానప్పటికీ చాలా వాటిలో నేరస్థులకు సహాపరాధులు ఉన్నారు. ఒక వైపు హమాస్‌కు, మరో వైపు ఇజ్రాయిల్‌కు తోడ్పడుతున్నది ఎవరు? హమాస్‌కు ప్రధానంగా తోడ్పడుతున్నది మత ప్రమేయ రాజ్యమైన ఇరాన్‌, లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా. పాశ్చాత్య దేశాల మీడియా ప్రతిరోజూ ఇరాన్‌, హెజ్‌బొల్లాను తప్పుపడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో యుద్ధాగ్నులు అంతకంతకూ ప్రజ్వరిల్లడానికి బాధ్యత ఇరాన్, హెజ్‌బొల్లాదేనని తెగేసి చెపుతుంటాయి. మరి ఇజ్రాయిల్‌కు తోడ్పడుతున్న దేశాలను గుర్తించి, ఆక్షేపించేందుకు పాశ్చాత్య మీడియా సంకోచిస్తోంది. అవి చెప్పని వాస్తవాలను మనం చెప్పి తీరాలి.


ఇజ్రాయిల్‌ నేరపూరిత చర్యలను సమర్థిస్తున్నదీ, ప్రోత్సహిస్తున్నదీ అమెరికాయే. ఈ అగ్రరాజ్యం ఇజ్రాయిల్‌కు ఎడతెగకుండా ఆయుధ సరఫరా చేస్తోంది. గాజాను (ఇప్పుడు లెబనాన్‌ను) అతలాకుతలం చేసేందుకు అవసరమైన సైనిక సామగ్రిని ఇజ్రాయిల్‌కు అమెరికానే సమకూరుస్తోంది. ఇజ్రాయిల్‌కు ఆయుధాలనే కాదు దౌత్యపరమైన అండదండలు సైతం అమెరికా ఇస్తోంది. కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనా పౌరుల కష్టనష్టాలను నివారించాలని ఐక్యరాజ్యసమితిలో వివిధ దేశాలు ప్రతిపాదించిన తీర్మానాలను అమెరికా వ్యతిరేకిస్తోంది. భద్రతా మండలిలో ఇజ్రాయిల్‌ వ్యతిరేక నిర్ణయాలను వీటో చేస్తోంది.

ఇజ్రాయిల్‌ ఘాతుకాలలో తన భాగస్వామ్యాన్ని గుర్తించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా మాజీ ప్రథమ మహిళ, మాజీ సెనేటర్‌, మాజీ విదేశాంగ మంత్రి, గతంలో అధ్యక్ష పదవీ ఎన్నిక అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌తో చేసిన ఒక ఇంటర్వ్యూను విన్న తరువాత ఆ వాస్తవం నాకు విశదమయింది. కొలంబియా విశ్వవిద్యాలయం (ఇప్పుడు ఆమె అక్కడ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు)లో బోధనానుభవాల గురించి ఆమెను ప్రశ్నించారు. ఆమె అక్కడ విజిటింగ్‌ ఫ్రొఫెసర్‌గా చేరిన కొద్ది కాలానికే గాజాలో ఇజ్రాయిల్‌ మారణకాండకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు (ఒక్క కొలంబియాలోనే కాదు, అమెరికా అంతటా పలు విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయిల్‌ వ్యతిరేక నిరసనలు పోటెత్తాయి).

హిల్లరీ క్లింటన్‌ ఆ నిరసనలను తూష్ణీభావంతో కొట్టి వేశారు. ‘వెలుపల’ నుంచి అందుతున్న మద్దతుతో అవి ప్రారంభమయ్యాయని ఆమె గట్టిగా అభిప్రాయపడ్డారు. విద్యార్థి నిరసనకారులలో పలువురు యూదు వ్యతిరేకులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. తన ఆరోపణకు ఆమె ఎటువంటి రుజువులు చూపలేదు. ‘బయటి’ నుంచి వచ్చి ఆందోళనలను రెచ్చగొట్టినవారు బహుశా ఉండవచ్చునేమో కానీ నిరసనకారులలో అత్యధికులు సంబంధిత విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులే ననడంలో సందేహం లేదు. తమ అంతరాత్మ ప్రేరణతోనే వారు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఆ నిరసనకారులలో యూదు విద్యార్థులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం.


గాజాలో యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందు నుంచే అంతర్జాతీయ న్యాయ నియమాలను ఇజ్రాయిల్‌ యథేచ్ఛగా ఉల్లంఘించేందుకు అవసరమైన మద్దతును అమెరికా అధ్యక్షులు, అమెరికా ప్రభుత్వాలు సంపూర్ణంగా సమకూరుస్తున్నాయి. పాలస్తీనా ప్రాంతాలలో యూదుల జనావాసాల విస్తరణకు అమెరికా మద్దతునిచ్చింది. ఇజ్రాయిల్‌ దుందుడుకు చర్యలను అమెరికా మృదువుగా ఆక్షేపించినప్పటికీ ఆ యూదు దేశాన్ని నిలువరించేందుకు ఎటువంటి నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు.

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంలో ఇజ్రాయిల్‌కు ప్రధానంగా తోడ్పడుతున్నది అమెరికాయే, సందేహం లేదు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ సైతం ఇజ్రాయిల్‌ సహాపరాధులేనని చెప్పాలి. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే మన భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం కూడా ఈ యుద్ధం విషయంలో నిర్దోషి కానే కాదు.. ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణిస్తున్న పాలస్తీనియన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇటువంటి విషమ సందర్భంలోనైనా మనం ఆత్మ పరిశీలనతో అమెరికన్లకు భిన్నంగా వ్యవహరించడం మన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉండదూ?

మన ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు కనీసం రెండు విధాలుగా తోడ్పడుతోంది: (1) గాజాలో కాల్పుల విరమణ పాటించి, అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయిల్‌ నిబద్ధమవాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానాలకు భారత్‌ మద్దతునివ్వలేదు; ఇజ్రాయిల్‌ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకై భారతీయ వలస కార్మికులను ఆ యూదు దేశానికి పంపడం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ వలసలను బాగా ప్రోత్సహించాయి.

ఇజ్రాయిల్‌కు ప్రస్తుత భారత ప్రభుత్వమిస్తున్న మద్దతుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతమైనది. నరేంద్ర మోదీ, బెంజమిన్‌ నెతన్యాహుల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహసంబంధాలు; రెండోది సైద్ధాంతిక సంబంధమైనది. మతాన్ని రాజ్యపాలనతో ఇజ్రాయిల్‌ మేళవించిన తీరుతెన్నులు హిందూత్వవాదులకు బాగా నచ్చింది. పైగా ముస్లింలను ‘ఇతరులు’గా పరిగణించడంలో ఇజ్రాయిల్‌, భారత పాలకవర్గాలలో ఒక ఏకీభావమున్నది.


ఇజ్రాయిల్‌ పక్షం వహించి ఆ దేశం పాల్పడుతున్న హింసాకాండను మన్నించడం ద్వారా భారత్‌ అంతర్జాతీయంగా తన స్థాయిని తానే తగ్గించుకున్నది. గత నెల ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చ జరిగినప్పుడు ‘శాంతి’ గురించి భారత్‌ నిరర్ధక, చిత్తశుద్ధిలేని మాటలు మాట్లాడింది. అదే చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్‌ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ఆ తరువాత ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ కాల్పుల విరమణ పాటించాలన్న ఐక్యరాజ్యసమితి పిలుపును పునరుద్ఘాటించారు.

‘లెబనాన్‌ తదుపరి గాజా కాకూడదని’ ఆయన చాలా దూరదృష్టితో హెచ్చరించారు. స్లోవేనియా, ఆస్ట్రేలియా రెండూ అమెరికాకు సన్నిహిత దేశాలు. అయినప్పటికీ అవి తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాయి. ఆ ధైర్యం మన ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రిలో పూర్తిగా కొరవడింది! మధ్య ప్రాచ్యంలో ఏకైక ప్రజాస్వామిక దేశంగా ఇజ్రాయిల్‌ వాసికెక్కింది. ప్రపంచంలో అత్యంత సంపద్వంత, శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశం అమెరికా. ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్‌ ఆత్మస్తుతి చేసుకోవడం పరిపాటి. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు పెచ్చరిల్లిపోవడంలో ఈ దేశాలు అందిస్తున్న అండదండల నేపథ్యంలో ఆ ఘనతలు ప్రయోజనశూన్యమైనవి కావూ? ఆ స్వీయ ప్రశంసలు బోలు మాటలుగా మాత్రమే చరిత్రలో ప్రతిధ్వనిస్తాయి

-(వ్యాసకర్త చరిత్రకారుడు) రామచంద్ర గుహ

Updated Date - Oct 05 , 2024 | 04:58 AM