Traditional values : దేశభక్తే ఆయన ఆధ్యాత్మికత
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:12 AM
త్యాగం చేయమని బోధించేముందు తాను త్యాగం చేసి ఎందరు చూపించగలరు? దైవభక్తి కంటే దేశ భక్తి గొప్పది అని ఒక సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఎందరు చెప్పగలరు? ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియని ప్రకృతిలా జీవించాలని
త్యాగం చేయమని బోధించేముందు తాను త్యాగం చేసి ఎందరు చూపించగలరు? దైవభక్తి కంటే దేశ భక్తి గొప్పది అని ఒక సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఎందరు చెప్పగలరు? ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియని ప్రకృతిలా జీవించాలని బోధించేవారే తప్ప జీవితంలో ఆచరించేవారెందరు? ఇటువంటి లక్షణాలున్న వ్యక్తి మన మధ్య జీవించారు. వారే ‘హాల్ అఫ్ టైమ్స్’ గ్రంథాలయాన్ని భీమిలిలో ఏర్పాటు చేసిన శివానందమూర్తి. కొందరు ఆయనలో ఆధ్యాత్మిక గురువును చూస్తే మరికొందరు గొప్ప దేశభక్తుణ్ణి చూసారు.
1928 డిసెంబర్ 21న రాజమండ్రిలో సర్వమంగళాదేవి, వీర బసవరాజు దంపతులకు జన్మించిన ఏకైక సంతానం శివానందమూర్తి. ఉర్లాం సంస్థానానికి ఏకైక వారసులు, జమిందారీ పద్ధతిలో పెరిగినవారు. డిగ్రీ పూర్తి కాగానే తాను ఒంటరిగా లోకంలోకి వెళ్లి జీవించాలనుకుంటున్నానని ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. జమీన్‌కి నువ్వే వారసుడివి, నువ్వెళ్ళిపోతే ఎలా అని తండ్రి అభ్యంతరం చెప్పినా, ఆస్తిలో నీకు హక్కు ఉండదని హెచ్చరించినా శివానందమూర్తి నిర్ణయంలో మార్పు రాలేదు. పోలీస్ డిపార్టుమెంటులో క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించారు, వరంగల్ చేరారు. ఆ తరువాత పెద్దలకు నచ్చిన అమ్మాయినే పెండ్లి చేసుకొని చిన్న గదిలో కాపురం పెట్టారు. కార్మికులంతా ఉండే ఆ కాలనీ వీధి కొళాయి దగ్గర బకెట్లో నీళ్లు పట్టుకొని ఇంటికి మోసుకెళ్లే శివానందమూర్తిని చూసి ఈయనేనా ఉర్లాం జమీందార్ వారసులు అని చుట్టుపక్కలవారు ఆశ్చర్యపోయేవారు. కాలికి చెప్పులు లేకుండా దేశం మొత్తం పాదయాత్ర చేసినవారు శివానంద మూర్తి.
తనకున్న దానిలోనే పొరుగువారికి సహాయం చేయడం, వారి కష్టాల్లో పాలుపంచుకోవడం శివానందమూర్తికి అలవాటు హోమియో వైద్యంతో ఉచిత సేవలు అందించి అందరికీ స్వస్థత చేకూర్చేవారు. తెలిసిన జ్యోతిషవిద్యతో ముహుర్తాలు పెట్టేవారు. వారి సతీమణి గంగాదేవి ఎవరైనా ప్రసవం అయితే వారికి సపర్యలు చేసేవారు. అలా వరంగల్లులో వారున్న ప్రాంతంలోనే కాక దూరప్రాంతాలకు కూడా వారి సేవలు విస్తరించాయి. చివరకు సమీపంలోని గ్రామాలవారు తమ ఆవులు కనిపించకపోతే ఆయనను సంప్రదించేవారు, వారు చెప్పినట్టు చేస్తే అవి దొరికేవి. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క సమాజసేవలో నిమగ్నమయ్యారు ఆయన. లుంగీ కట్టుకొని తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణం చేయడం దగ్గర్నుంచి బృందాలను హిమాలయాలకు, ఇతర చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్లి వాటి విశిష్టత వివరించడం వరకూ ఆయన కార్యాచరణ ఎందరికో దిశానిర్దేశం చేసింది.
శివానందమూర్తిలో బహుముఖ వ్యక్తిత్వాలను దర్శించినవారున్నారు. దైవభక్తులు ఆయనను సద్గురు అని సంబోధించారు. ఆయన మాత్రం దైవభక్తులకు ఎటువంటి పుణ్యం సంప్రాప్తమవుతుందో, దేశభక్తులకూ అటువంటి పుణ్యమే దొరుకుతుందని చెప్పేవారు. దేశభక్తి లేని దైవభక్తి వ్యర్థమనీ, భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుందనేవారు. తమను ఆశ్రయించిన కుటుంబాలలో పిల్లలకు ‘మీరు చదువుకోండి. విదేశాలకు వెళ్లారా వెళ్ళండి. సంపాదించండి, సుఖంగా ఉండండి. ఒక్కటే కండిషన్. ఏది చేసినా ధర్మం తప్పకండి. శక్తి ఉండగానే మీవంతు సేవలు దేశానికి అందించేందుకు సిద్ధంకండి’ అని చెప్పేవారు. అంతే తప్ప మూఢభక్తిని ఎన్నడూ ప్రోత్సహించలేదు.
శివానందమూర్తి పుస్తక ప్రియులు. ఎక్కడకు వెళ్లినా పుస్తకాలు కొనకుండా, అక్కడి గ్రంథాలయాలను సందర్శించకుండా వచ్చేవారు కాదు. అలా ఎవరి దగ్గరా లేని అరుదైన గ్రంథాలను సేకరించారు. నిరంతరం చదవటమే. వారు చదివిన పుస్తకాలే పెద్ద గ్రంథాలయంగా ఏర్పాటైంది. భీమిలి ఆనందవనంలో ఎందరో పరిశోధకులకు ఆ గ్రంథాలయం ఉపయోగపడుతున్నది. వారు ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ లెక్చరర్. వారిరువురిదీ వయోభేదం లేని స్నేహం. శివానందమూర్తి చదివింది బిఎస్‌సి మాత్రమే. కానీ సంగీతం, సాహిత్యం, ఖగోళం, వైద్యం, జ్యోతిషం, ఆంగ్లసాహిత్యం... ఇలా ఏ సబ్జెక్టు గురించి అయినా సమగ్రంగా మాట్లాడే వారు. శివానందమూర్తి అంతేవాసి (జర్మనీలో చదువుకున్న తమిళుడు) ప్రొఫెసర్ రాఘవేంద్రన్. ఆయనతో ఇంగ్లిష్ సాహిత్యం గురించి మాట్లాడుతుంటే ఒక మనిషికి ఇన్ని అంశాలలో పట్టు ఎలా సాధ్యం? అని ఆశ్చర్యచకితులయ్యేవారు. ఈ ప్రశ్నే వారితో ‘శివానంద యోగం’ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాయించింది.. శివానందమూర్తి ప్రసంగాలు గ్రంథాలుగా వెలువడుతున్నాయి. అందులో భారతీయత పేరుతో నాలుగు భాగాలు వచ్చాయి. మన దేశం గురించి చాల ప్రశ్నలకు సమాధానాలు ఆ ప్రసంగాలలో లభిస్తాయి. 2015 జూన్ 11న దేహత్యాగం చేసినా శివానందమూర్తి ఆరంభించిన సేవలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొనసాగుతూనే ఉన్నాయి.
నట్టి శ్రీనివాసరావు