Health Tips: చలికాలంలో తక్కువ నీళ్లు తాగుతున్నారా.. ఈ 5 లక్షణాలుంటే జాగ్రత్త..
ABN , Publish Date - Dec 24 , 2024 | 07:19 PM
చలికాలంలో దాహం వేయటం లేదా? అందుకని నీళ్లు తాగటం నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే, మీకు మీరే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని అర్థం. చలికాలంలో తక్కువ నీళ్లు తాగితే జరిగే నష్టాలంటో తెలుసా.. ఈ లక్షణాలుంటే వెంటనే..
కాలం మారిపోయే కొద్ది ఆహారపు అలవాట్లు మారటం సహజం. ఇతర కాలాల కంటే ఎండాకాలంలో అతిగా దాహం వేస్తుంది. చల్లటి పానీయాలు తాగాలని మనసు కోరుకుంటుంది. అదే వర్షాకాలం లేదా చలికాలంలో అయితే వేడి వేడిగా ఏదైనా తినాలనే ఉబలాటం కలగటం సహజం. మరీ ముఖ్యంగా చలికాలంలో మామూలు సమయాల్లో కన్నా ఎక్కువగా టీ, కాఫీలు తాగేస్తుంటారు చాలామంది. కానీ, దాహం వేయటం లేదనే కారణంతో నీళ్లు తాగడం పట్ల అశ్రద్ధ చూపిస్తారు. ఇలా చేయటం అస్సలు కరెక్ట్ కాదు. చలికాలంలో సాధారణంగానే ఎవ్వరికైనా నీళ్లు తాగాలనిపించదు. అలా అని శరీరానికి నీరు అవసరం లేదని కాదు అర్థం. అన్ని కాలాల్లోలాగే చలికాలంలోనూ శరీరానికి తగిన మోతాదులో నీరు అందటం చాలా ముఖ్యం. దాహం వేయట్లేదు కదా అని చెప్పి చలికాలంలో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే నీరు తీసుకోవటం తగ్గిస్తే.. ఇలాంటి 5 లక్షణాలున్నాయేమో పరిశీలించుకోండి..
Health Tips: చలికాలంలో మీరు తక్కువ తాగుతుంటే శరీరం డీ హైడ్రేషన్‌కు లోనవుతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టవచ్చు. కింద ఉన్న 5 లక్షణాలు మీలోనూ ఉన్నాయేమో చెక్ చేసుకోండి.
1. తలనొప్పి: మీకు తల భారంగా లేదా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుందా. అయితే, మీరు తక్కువ నీరు తాగుతున్నరని చెప్పేందుకు ఇదో ముఖ్య సంకేతం. శరీరానికి కావాల్సినంత నీరు అందకపోతే అది తరచూ తలనొప్పి వచ్చేందుకు కారణమవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే మెదడులోని కణాల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ప్రకారం, శరీరంలో నీరు తగ్గితే ఆలోచనా సామర్థ్యం పైనా ప్రభావం చూపుతుంది.
2. పొడిచర్మం: చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల చర్మం పొడిబారడం మరో లక్షణం. అయితే, చలికాలంలో చర్మం పొడిబారడం అత్యంత సహజం. ఇదే లక్షణం తరచూ కనిపిస్తున్నా, చర్మం పైభాగం గట్టిపడి పగుళ్లు వస్తున్నా అలక్ష్యం చేయవద్దు. శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్లే ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య తగ్గేందుకు తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
3. మూత్రం చాలా పసుపు రంగులో ఉండటం: మూత్రం పసుపు రంగులో ఉండి తక్కువగా సార్లు వస్తున్నా, మూత్రవిసర్జన తర్వాత మండుతున్న అనుభూతి కలుగుతున్నా శరీరంలో నీరు తగ్గిందనేందుకు సూచన. తక్కువ నీరు తాగడం వల్ల వెంటనే మూత్రం మీద ప్రభావం పడుతుంది. దీని వల్ల శరీరం డీ హైడ్రేషన్‍కు గురయ్యి మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మూత్రం రంగు ముదురు పసుపు రంగులో ఉంటే నీరు తక్కువగా తాగుతున్నామని తెలుసుకోవాలి.
4. నోరు పొడిబారడం: మీ పెదవులు ఎక్కువగా పగులుతున్నాయా. తరచుగా పొడిబారడం లేదా మీ గొంతు ఎండిపోతున్నట్లుగా అనిపిస్తోందా. అంటే మీ శరీరంలో నీటి కొరత తలెత్తినట్టే. చలికాలంలో దప్పిక వేయలేదనే కారణంతో నీరు తక్కువగా తీసుకోవడం వల్ల లాలాజల గ్రంథుల్లో నీరు తగ్గిపోతుంది. దీంతో లాలాజలం సరైన మోతాదులో ఉత్పత్తి అయ్యేందుకు వీలులేక నోరు ఎండిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే దాహం వేయకపోయినా ఎక్కువ నీరు తాగటం ప్రారంభించండి.
5. గుండెలో భారం: శరీరంలో ఎక్కువ కాలం నీరు లేకపోతే అది రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె చాలా కష్టపడాలి. దీని కారణంగా గుండె ఒత్తిడికి లోనవుతుంది. బరువుగా కూడా అనిపిస్తుంది. నడిచేటప్పుడూ కొన్నిసార్లు హృదయ స్పందన వేగంగా మారుతుంది.
పైనున్న లక్షణాలు మీలోనూ ఉన్నాయని అనిపిస్తే వెంటనే తగినంత నీరు తీసుకోవడం మొదలుపెట్టండి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది.