Mexico Airport: ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. టేకాఫ్ ఆలస్యమైందని..
ABN , Publish Date - Jan 27 , 2024 | 03:26 PM
ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టుల్లో గానీ, విమానాలు గాల్లో ఉన్నప్పుడు గానీ.. వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్రయాణికులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ.. గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా మెక్సికోలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టుల్లో గానీ, విమానాలు గాల్లో ఉన్నప్పుడు గానీ.. వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్రయాణికులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ.. గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా మెక్సికోలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్నప్పుడు.. ఒక ప్రయాణికుడు ఒక్కసారిగా అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. అంతేకాదు.. ఆ విమానం రెక్కపై నడుచుకుంటూ, బయటకు వెళ్లిపోయాడు. గురువారం మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతని చర్యకు తోటి ప్రయాణికులు మద్దతు తెలపడం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏరోమెక్సికోకు చెందిన ఏఎమ్672 అనే విమానం గురువారం ఉదయం 8.30 గంటలకు గ్వాటెమాలాకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ విమానం అనుకున్న సమయానికి బయలుదేరలేదు. దాదాపు నాలుగు గంటల పాటు అది ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయింది. దీంతో.. లోపల కూర్చుకున్న ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సరిగ్గా గాలి, నీళ్లు అందకపోవడంతో ప్యాసింజర్లు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి, విమానం రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపు తర్వాత అతడు తిరిగి విమానంలోకి వచ్చాడు. అయితే.. దీనిని వికృత చర్యగా భావించి విమాన సిబ్బంది అతడ్ని పోలీసులకు అప్పగించారు. అప్పుడే తోటి ప్రయాణికులు అతనికి మద్దతుగా రంగంలోకి దిగారు.
ఆ విమానం నాలుగు గంటలపాటు ఆలస్యం కావడంతో తమకు గాలి, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నామని.. లోపల ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితులు నెలకొన్నాయని ఆ ప్రయాణికులు చెప్పారు. అలాంటి సమయంలో అతడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి, తమ ప్రాణాలను కాపాడాడని.. అతడు చేసింది మంచి పనేనని చెప్పారు. మొత్తం 77 మంది ప్రయాణికులు అతనికి మద్దతుగా ఈ స్టేట్‌మెంట్ ఇస్తూ సంతకం చేశారు. అయితే.. ఏరోమెక్సికో ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. అలాగే.. ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఆ ప్రయాణికుడి వివరాలను కూడా వెల్లడించలేదు. ఏదేమైనా.. అతడు చేసిన పనికి గాను అతడ్ని తోటి ప్రయాణికులు హీరోగా పరిగణిస్తున్నారు.