Share News

Nerella Sharada: సినిమా పాటల్లో అసభ్యకర స్టెప్పులపై మహిళా కమిషన్‌ సీరియస్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:03 AM

కొన్ని సినిమాల పాటల్లో మహిళలను కించపరిచేలా అసభ్యకర డాన్స్‌ స్టెప్పులు ఉంటున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారద తీవ్ర హెచ్చరికలు చేశారు.

Nerella Sharada: సినిమా పాటల్లో అసభ్యకర స్టెప్పులపై మహిళా కమిషన్‌ సీరియస్‌

  • సినీ పరిశ్రమ స్వీయనియంత్రణ పాటించాలి

  • లేకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరిక

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కొన్ని సినిమాల పాటల్లో మహిళలను కించపరిచేలా అసభ్యకర డాన్స్‌ స్టెప్పులు ఉంటున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారద తీవ్ర హెచ్చరికలు చేశారు. సినిమా దర్శక, నిర్మాతలు కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మహిళలను తక్కువ చేసి చూపించే అసభ ్యకరమైన డాన్స్‌ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని, లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కొన్ని సినిమాల పాటల విషయంలో తమకు పలు ఫిర్యాదులు అందాయన్నారు. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.


సమాజానికి సానుకూల సందేశాలు అందించడంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడటం సినిమా రంగం నైతిక బాధ్యత అని గుర్తు చేశారు. యువత, పిల్లలపై సినిమాలు చూపే ప్రభావాన్ని అర్థం చేసుకుని సినీ పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని, ఈ విషయమై నిశిత పరిశీలన తర్వాత అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని శారద స్పష్టం చేశారు.

Updated Date - Mar 21 , 2025 | 04:03 AM