Future City: ఫ్యూచర్ సిటీలో తైవాన్ పారిశ్రామిక పార్కు
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:48 AM
తైవాన్ రాజధాని తైపీలో జరుగుతున్న తైవాన్-భారత ఆర్థిక సదస్సులో తెలంగాణ నుంచి ఎలక్ర్టానిక్స్ విభాగం డైరెక్టర్ సూర్యకాంత్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2వేల కోట్ల పెట్టుబడులకు సంస్థలు ఓకే
‘తైవాన్’ సదస్సులో రాష్ట్రంతో ఒప్పందం
10వేల మందికి ఉపాధి : మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తైవాన్‌కు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం (ఎలీజియన్స్ గ్రూప్) ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.2వేల కోట్లతో ప్రపంచస్థాయి సాంకేతిక, పారిశ్రామిక పార్క్ (ఐటీఐపీ) ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తైవాన్ రాజధాని తైపీలో జరుగుతున్న తైవాన్-భారత ఆర్థిక సదస్సులో తెలంగాణ నుంచి ఎలక్ర్టానిక్స్ విభాగం డైరెక్టర్ సూర్యకాంత్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలీజియన్స్ గ్రూప్‌నకు చెందిన 11 ప్రముఖ సంస్థలు ఐటీఐపీలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు 250 ఎకరాలను కేటాయిస్తే.. వెంటనే పనులు ప్రారంభిస్తామని తైవాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిపుణులను అందుబాటులో ఉంచుతామన్న మంత్రి శ్రీధర్ బాబు సందేశాన్ని రాష్ట్ర ఎలక్ర్టానిక్స్ విభాగం డైరెక్టర్ సూర్యకాంత్ శర్మ తైవాన్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ప్రతిభావంతులైన మానవ వనరుల లభ్యతతో అత్యంత అనుకూల పారిశ్రామిక వాతావారణం ఉందని తైవాన్ ప్రతినిధుల గ్రూప్ చైర్మన్ సైమోన్‌లీ పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపడంపై మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందాలతో 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.