Share News

CM Revanth Reddy: సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:51 AM

అనంతరం భవన నిర్మాణం అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నేహాశర్మ, రాళ్లబండి హరిబాబు, బన్వరీలాల్‌ శర్మలకు అనుమతి పత్రాలు సీఎం చేతుల మీదగా అందించారు.

CM Revanth Reddy: సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు

  • దరఖాస్తు చేసిన ఐదు నిమిషాల్లోనే స్థల పరిశీలన

  • పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌

  • బిల్డ్‌ నౌ పోర్టల్‌ను ఆవిష్కరించిన సీఎం

  • ఆ వెంటనే ఆన్‌లైన్‌లో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి అనుమతి

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ అనుమతులను పొందే విషయంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్‌ పెట్టడంతో పాటు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌ తెలిపారు. పోర్టల్‌ను గురువారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. పోర్టల్‌ సమాచార బ్రోచర్‌నూ ఆవిష్కరించారు. అనంతరం భవన నిర్మాణం అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నేహాశర్మ, రాళ్లబండి హరిబాబు, బన్వరీలాల్‌ శర్మలకు అనుమతి పత్రాలు సీఎం చేతుల మీదగా అందించారు. ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ.. ఇదివరకు ఒక భవన నిర్మాణం అనుమతి దరఖాస్తు చేసిన తర్వాత నిర్వహించే క్షేత్రస్థాయి తనిఖీలకు రెండునెలల గడువు పట్టేదని చెప్పారు. ఇప్పుడు నాలుగు లేదా ఐదు నిమిషాల్లోనే స్థలపరిశీలన పూర్తయ్యేలా సీఎం రేవంత్‌ ఆదేశాలతో బిల్డ్‌ నౌ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. దీన్ని భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన వ్యవస్థగా అభివర్ణించారు. ఇందులో మాన్యువల్‌కు ఎంత మాత్రం అవకాశం లేదని, అంతా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. బిల్డ్‌ నౌకు త్రీడీతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌నూ అనుసంధానం చేశారని, దీంతో తక్కువ సమయంలోనే నిర్మాణ ప్రదేశాన్ని పర్యవేక్షించవచ్చని వివరించారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అసలు ఫీల్డుకు వెళ్లకుండా ఆఫీసులో కూర్చొని స్థలాన్ని పరిశీలించేలా కొత్త సాంకేతికతను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బిల్డ్‌నౌ ద్వారా రియల్టర్లు, సామాన్యుల ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా సీఎం రేవంత్‌ మార్గనిర్దేశకత్వంతోనే ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు దానకిషోర్‌ చెప్పారు. బిల్డ్‌నౌ పోర్టల్‌ రూపకర్తలు హైదరాబాదీలేనని అన్నారు. దీని గురించి తెలిసిన తర్వాత, ఈ రకమైన పోర్టల్‌ తయారీకోసం వారిని ఇతరరాష్ట్రాల నుంచి కూడా సంప్రదిస్తున్నట్లు ఆయన తెలిపారు.


దరఖాస్తుల తిరస్కరణ ఉండదు.. మార్గ నిర్దేశమే

బిల్డ్‌ నౌ పోర్టల్‌ తెలంగాణ పట్టణీకరణకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే రాష్ట్రం.. ఒకే ప్లాట్‌ఫాం పేరుతో పట్టణాల అభివృద్ధికి అవసరమైన అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. సాంకేతిక ఆధారంగానే భవన నిర్మాణ అనుమతులు ఉంటాయని, దరఖాస్తులను తిరస్కరించడం కాకుండా మార్గనిర్దేశం చేసి డేటా ఆధారంగా విశ్లేషణ చేసేలా బిల్డ్‌ నౌ పోర్టల్‌ను రూపొందించారు. బిల్డ్‌ నౌ ద్వారా వారాలు పట్టే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తారు. డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌తో పోర్టల్‌ అనుసంధానం చేశారు. దీనిద్వారా దరఖాస్తులో ఉండే లోపాలను, తప్పులను అదే సవరించుకుని అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తుంది. నిబంధనల ప్రకారం డ్రాయింగ్‌, లేఅవుట్‌ అనుమతులు ఇస్తుంది. దరఖాస్తుదారు ఇచ్చే డ్రాయింగ్‌.. నిబంధనల ప్రకారం ఉందా.. లేదా? అనేది పోర్టల్‌ తక్షణమే నిర్ధారిస్తుంది. 24 గంటల పాటు ఏఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుదశలో ఏవైనా సందేహాలు వస్తే నివృత్తి చేస్తుంది. వాట్పాప్‌ ద్వారా సలహాలు ఇస్తుంది. 5 నిమిషాల్లో డ్రాయింగ్‌ పరిశీలన పూర్తి చేస్తుంది. ఈ పోర్టల్‌ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, నీటిపారుదల, రెరా ఇలా సంబంధిత అన్ని శాఖల్లోనూ అనుసంధానం అయి ఉంటుంది. కొత్త విధానంలో పాలసీ పరమైన మార్పులను వెంటనే సవరించుకుంటుంది. టారి్‌ఫలు, ప్రాసెసింగ్‌ ఫీజుల్లో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తే వాటిని వెంటనే అమల్లోకి తీసుకొస్తుంది.

Updated Date - Mar 21 , 2025 | 03:51 AM