Share News

Delhi: వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:53 AM

వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాటిని గుడ్డిగా వ్యతిరేకించవద్దని సుప్రీం కోర్టు(Supreme Court) అభిప్రాయపడింది. వీవీప్యాట్ల(VVPAT) పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Delhi: వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు

ఢిల్లీ: వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాటిని గుడ్డిగా వ్యతిరేకించవద్దని సుప్రీం కోర్టు(Supreme Court) అభిప్రాయపడింది. వీవీప్యాట్ల(VVPAT) పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది. ఈవీఎం ద్వారా పోలయిన ఓట్లను వీవీ ప్యాట్‌లతో సరిపోల్చాలన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. చిన్న మార్పులతో న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలు ఒకే అభిప్రాయతంతో రెండు తీర్పులు వెలువరించారు. పేపర్ బ్యాలట్ రూపంలో ఎన్నికలను నిర్వహించాలన్న పిటిషన్‌ను కూడా సుప్రీం తోసిపుచ్చింది.


Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

"ఈవీఎం(EVM)లతో వీవీప్యాట్ స్లిప్‌లు పోల్చిచూడాల్సిన అవసరం లేదు. స్లిప్‌లను తీసుకుని ఓటరు బాక్స్‌లో వేయాల్సిన అవసరం లేదు. ఈవీఎం సాంకేతిక అంశాలను క్షుణ్నంగా పరిశీలించి.. వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నాం. సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత యూనిట్‌ను సీల్ చేయాలి. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరచాలి. అభ్యర్థులకు అనుమానం వస్తే... ఫలితాల ప్రకటన తర్వాత ఇంజినీర్ల బృందం ఈవీఎం మెమరీని తనిఖీ చేస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక 7 రోజులలోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయాలి. అందుకు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలి. ఒకవేళ EVM ట్యాంపరింగ్ జరిగినట్లు తేలితే... అభ్యర్థుల ఖర్చులు తిరిగి ఇవ్వాలి. ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది అనవసర అనుమానాలకు దారి తీస్తుంది" అని జస్టిస్ దీపాంకర్ దత్తా తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 12:02 PM