Share News

Dera Ram Rahim: జైలు నుంచి బయటకొస్తున్న డేరా బాబా

ABN , Publish Date - Aug 13 , 2024 | 11:08 AM

అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ (డేరా బాబా) తాత్కాలికంగా జైలు నుంచి విడుదల కానున్నాడు. ఆయనకు ఈ మేరకు 21 రోజులపాటు జైలు శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం దక్కినట్టు అధికారిక వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

Dera Ram Rahim: జైలు నుంచి బయటకొస్తున్న డేరా బాబా
Gurmeet Ram Rahim Singh

అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ (డేరా బాబా) తాత్కాలికంగా జైలు నుంచి విడుదల కానున్నాడు. ఆయనకు ఈ మేరకు 21 రోజులపాటు జైలు శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం దక్కిందని, అధికారులు పెరోల్ మంజూరు చేశారని మంగళవారం వెల్లడైంది. కాగా ఈ తాత్కాలిక విడుదల సమయంలో గుర్మీత్ రామ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని బర్నావాలో ఉన్న డేరా ఆశ్రమానికి వెళ్లతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా గుర్మీత్ రామ్‌ను విడుదలను వ్యతిరేకిస్తూ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఆ పరిణామం జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ తాత్కాలిక ఉపశమనం దక్కింది.


కాగా తనకు 21 రోజుల తాత్కాలిక ఉపశమనం కల్పించాలంటూ గుర్మీత్ సింగ్ జూన్ నెలలో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. ఎలాంటి పక్షపాతం, రాగధ్వేషాలు లేని సమర్థ అధికారి ఈ అభ్యర్థనను పరిశీలించాలని ఆగస్టు 9న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పరిశీలన అనంతరం అతడికి పెరోల్ దక్కింది. కాగా హర్యానా ప్రభుత్వ అనుమతి లేకుండా డేరా సచ్చా సౌదా చీఫ్‌కు మరోసారి పెరోల్‌ను మంజూరు చేయరాదని ఫిబ్రవరి 29న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా జనవరి 19 నుంచి 50 రోజులపాటు పెరోల్‌పై గుర్మీత్ సింగ్ బయట ఉన్న విషయం తెలిసిందే.


కాగా ఇద్దరు శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో డేడా గుర్మీత్ సింగ్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో శిక్ష పడగా అప్పటి నుంచి హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. మరోవైపు దాదాపు 16 ఏళ్ల క్రితం జరిగిన ఓ జర్నలిస్ట్ హత్య కేసులో కూడా గుర్మీత్ సింగ్ దోషిగా తేలాడు. అతడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా 2019లో దోషులుగా నిర్ధారణ అయ్యింది.

Updated Date - Aug 13 , 2024 | 11:13 AM