Ratan Tata: మొబైల్ కూడా వాడని రతన్ టాటా సోదరుడు.. ఈయన మీకు తెలుసా
ABN , Publish Date - Oct 10 , 2024 | 04:16 PM
అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి మరణించారు.
ఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి మరణించారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న రతన్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. న్యూయార్క్‌లోని ఇథాకాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదువుకున్న రతన్ టాటా 1962లో భారత్‌కు తిరిగి వచ్చి కుటుంబాన్ని పోషించడానికి ఓ దుకాణంలో పనిచేశారు.
డిసెంబర్ 28, 1937న నావల్ టాటా, సూని టాటా దంపతులకు పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. రతన్‌కు జిమ్మీ నావల్ టాటా, నోయెల్ టాటా అనే సోదరులున్నారు. రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ ముంబయి డౌన్‌టౌన్‌లో నివసించే అమ్మమ్మ నవాజ్‌బాయి దగ్గర పెరిగారు.
నిరాడంబర జీవితం..
రతన్ సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు డబ్బుపై కానీ, విలాసాలపై కానీ పెద్దగా ఆసక్తి లేదు. టాటా గ్రూప్ లో జిమ్మీకి కూడా వాటా ఉంది. అయితే కుటుంబ వ్యాపారంపై జిమ్మీకి అస్సలు ఆసక్తి లేదు. సోదరుడు రతన్ టాటాలాగే అరుదైన వ్యక్తిత్వం కలిగిన జిమ్మీ..ముంబైలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నిరాండబర జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన మొబైల్ ఫోన్ కూడా వినియోగించరు. పుస్తకాలు, వార్త పత్రికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇల్లు వదిలి బయటకు వెళ్లే సందర్భాలు కూడా తక్కువే. గతేడాది జనవరిలో జిమ్మీ పుట్టినరోజున రతన్ టాటా తన తమ్ముడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జిమ్మీ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఎంతో ఇష్టమైన తన సోదరుడు రతన్ మరణవార్త తెలుసుకున్న జిమ్మీ వీల్ చైర్‌లో వెళ్లి నివాళి అర్పించారు.