Share News

Loksabha Polls: ముగిసిన ప్రచారం

ABN , Publish Date - May 31 , 2024 | 06:07 AM

సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఏడో, ఆఖరి దశకు సంబంధించి శనివారం పోలింగ్‌ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ సహా ఈ విడతలో ఏడు రాష్ట్రాల్లోని 57

 Loksabha Polls: ముగిసిన ప్రచారం
Campaign End

లోక్‌సభ ఎన్నికల చివరి దశకు గురువారంతో ముగిసిన గడువు

చండీగఢ్‌, ఏడు రాష్ట్రాల్లోని 57 సీట్లకు 1న పోలింగ్‌..

మార్చి 16న విడుదలైన ఎన్నికల షెడ్యూల్‌

ఇప్పటివరకు ఆరు విడతల్లో 486 స్థానాలకు ఓటింగ్‌.. '

4న ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ మొత్తం పూర్తి


న్యూఢిల్లీ, మే 30: సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఏడో, ఆఖరి దశకు సంబంధించి శనివారం పోలింగ్‌ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ సహా ఈ విడతలో ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఆరు దశల్లో 486 సీట్లకు పోలింగ్‌ జరిగింది. కాగా, లోక్‌సభ, ఏపీ, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు, వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు మార్చి 16న షెడ్యూల్‌ విడుదలైంది. వివిధ దశల్లో నోటిఫికేషన్ల జారీ అనంతరం ఏప్రిల్‌ 19, 26, మే 7, 13, 20, 25న పోలింగ్‌ నిర్వహించారు. చివరిదైన ఏడో విడత జూన్‌ 1న జరగనుంది. అరుణాచల్‌లో వచ్చే నెల 2న, మిగతా దేశమంతటా 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ఆసాంతం పూర్తికానుంది. మరోవైపు స్వాతంత్య్రం అనంతరం 1951-52లో జరిగిన తొలి ఎన్నికలు నాలుగు నెలల పాటు సాగాయి. ఆ తర్వాత అత్యధికంగా ఈసారి 44 రోజుల పాటు నిర్వహించారు. షెడ్యూల్‌ నుంచి ఫలితాల వరకు చూసినా మొత్తం 81 రోజుల పాటు ప్రక్రి య జరిగింది. ఇక శనివారం పంజాబ్‌ (13), హిమాచల్‌ప్రదేశ్‌ (4), యూపీ (13), పశ్చిమబెంగాల్‌ (9), బిహార్‌ (8), ఒడిసా (6), ఝార్ఖండ్‌ (3)తో పాటు చండీగఢ్‌లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారాణాసీ నియోజకవర్గం కూడా ఈ దశలోనే ఉంది. కాగా, బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు అన్నీ కలిపి ప్రధాని మోదీ 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్‌ పొందిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఢిల్లీ, పంజాబ్‌లో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా, గతంలో కాంగ్రెస్‌ అవినీతి, కుటుంబ పాలనను తన ప్రచారంలో ప్రధానంగా ఎండగట్టిన మోదీ ఈసారి దానికి హిందూత్వ కోణం జోడించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తమ ఘనతగా చెప్పుకొంటూనే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ మందిరానికి బాబ్రీ తాళం వేస్తుందని, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తుందని, సంపదను దోచుకుని అధిక సంతానం ఉన్నవారికి ధారాదత్తం చేస్తుందని వ్యాఖ్యానించి దుమారం రేపారు.


మోదీ సర్కారు రైతు, యువత వ్యతిరేకి!

మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు, యువత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్రంగా ప్రచారం చేశాయి. అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించాయి. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించాయి.

Updated Date - May 31 , 2024 | 09:48 AM