AP News: కువైత్ నుంచే భర్త నిఘా!
ABN , Publish Date - Aug 18 , 2024 | 04:36 AM
కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.
భార్యపై అనుమానంతో ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు
వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్య
గ్యాస్ సిలిండర్ పేల్చుకుని సజీవ దహనం
రాయచోటి టౌన్, ఆగస్టు 17: కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.
రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు.. లక్కిరెడ్డిపల్లె మండలం బి.యర్రగుడి హరిజనవాడకు చెందిన యర్రగుడి రాజా, రమాదేవి దంపతులకు కుమారుడు ప్రభువు మనోహ (8), కుమార్తె మన్విత (6) ఉన్నారు. వీరు ఐదేళ్లుగా రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్నారు. రాజా టైలరింగ్ చేసేవాడు.
సంపాదన చాలకపోవడంతో భార్యభర్తలు కువైత్ వెళ్లారు. పిల్లలను రాజా తల్లిదండ్రులు చూసుకునేవారు. ఈ క్రమంలో రాజా తల్లి అనారోగ్యంపాలవడంతో వారు స్వగ్రామమైన బి.యర్రగుడి హరిజనవాడకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. పిల్లలను చూసుకోవడానికి వారికి ఇబ్బందిగా ఉండడంతో భార్యాభర్తలు కువైత్ నుంచి ఇండియాకు వచ్చారు. రమాదేవి పిల్లలతో పాటు తిరిగి రాయచోటిలో ఉండగా రాజా సంవత్సరం క్రితం కువైత్ వెళ్లాడు.
అయితే అతడు భార్యపై అనుమానం పెంచుకు న్నాడు. ఈ నేపథ్యంలో కువైత్ వెళ్లడానికి ముందే ఇంట్లో, ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అతడు కువైత్ వెళ్లినప్పటి నుంచి ఆమెకు రోజూ ఫోన్ చేసి వేధించేవాడు. భర్త వేధింపులు ఎక్కువయ్యాయని రమాదేవి తరచూ తమ కుటుంబ సభ్యులకు చెప్పేది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రికూడా రాజా ఫోన్ చేసి రమాదేవితో గట్టిగా మాట్లాడాడు. ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం నడిచిన విషయం సీసీ కెమెరాల్లో ఉందని సమాచారం.
శనివారం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు రమాదేవి తన అన్న గాలివీటి నారాయణకు ఫోన్ చేసి.. తన భర్త ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని, రోజూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని, ఈ వేధింపులు భరించలేకుండా ఉన్నానని, మిమ్మల్ని వదిలి వెళుతున్నాను అంటూ వాయిస్ మేసెజ్ పంపింది.
ఆయన వెంటనే తెలిసిన వారికి ఫోన్ చేసి తమ చెల్లెలి ఇంటికి వెళ్లి చూడమని చెప్పారు. ఆ లోగానే రమాదేవి కిచెన్లోంచి గ్యాస్ సిలిండర్ బెడ్రూంలోకి తీసుకొచ్చి.. గ్యాస్ లీక్ చేసి అగ్గిపుల్ల వెలిగించేసింది. సిలిండర్ పేలడంతో ఇద్దరు పిల్లలు నిద్రలోనే కన్నుమూశారు. రమాదేవి కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. అగ్నిమాపకశాఖ శకటం వచ్చేసరికి తల్లిబిడ్డలు మంటల్లో సజీవ దహనమయ్యారు.