Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్
ABN , Publish Date - Jul 08 , 2024 | 03:57 PM
కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్‌కి వెళ్లడానికి ముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి..
కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం మణిపూర్‌కి వెళ్లడానికి ముందు అస్సాంలోని (Assam Floods) కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి.. బాధితులకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా.. పార్లమెంటులో మీ ప్రతినిధినంటూ తన నిబద్ధతను నొక్కి చెప్పారు. వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి సమగ్ర సహాయాన్ని త్వరగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
‘‘నేను అస్సాం ప్రజలకు అండగా ఉన్నాను. పార్లమెంటులో నేను వారి సైనికుడిని. వరదలతో దెబ్బతిన్న ఆ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం, మద్దతు అందించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అస్సాంలో వరదల తీవ్ర ప్రభావాన్ని ఎత్తిచూపుతూ.. సహాయం, పునరావాసం, పరిహారంతో కూడిన తక్షణ అవసరాన్ని గాంధీ నొక్కి చెప్పారు. దీర్ఘకాలిక వరద నియంత్రణ చర్యలను పరిష్కరించేందుకు గాను.. పాన్-ఈశాన్య నీటి నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదే సమయంలో.. అస్సాం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి క్షేత్ర పరిస్థితిని వివరించారు. ఈ వరదల కారణంగా 24 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయ్యారని, 53,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని, 60 మందికి పైగా మరణించారని వెల్లడించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘వరదలు లేని అస్సాంను తయారు చేస్తామని వాగ్దానం ఇచ్చిన బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ నిర్వహణలోపాన్ని ఈ సంఖ్యలు ప్రతిబింబిస్తాయి’’ అని విరుచుకుపడ్డారు. అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు.
కాంగ్రెస్ vs బీజేపీ
మరోవైపు.. రాహుల్ గాంధీ అస్సాం, మణిపూర్ పర్యటనలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య నెట్టింట్లో మాటల యుద్ధం జరిగింది. మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి నాన్-బయోలాజికల్ ప్రధాని ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదని, కానీ రష్యాకు వెళ్లారని జైరాం రమేశ్ సెటైర్లు వేశారు. ఇందుకు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా బదులిస్తూ.. రాహుల్ ‘సిక్ ట్రాజెడీ టూరిజం’లో మునిగారని.. మణిపూర్‌లో జరిగిన హింసాకాండ కాంగ్రెస్ వారసత్వమని ఆరోపణలు గుప్పించారు.
Read Latest National News and Telugu News