Final Polling : నేటితో తెర
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:31 AM
దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణరంగానికి ఇక తెర పడనుంది. ఏడు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లోని చివరి దశకు పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో
సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే.. వారాణసీ సహా 57 కీలక స్థానాల్లో పోలింగ్
కమలనాథుల భవితవ్యానికి అగ్నిపరీక్ష.. యూపీలో ఇండీ కూటమి నుంచి గట్టి పోటీ
నూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణరంగానికి ఇక తెర పడనుంది. ఏడు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లోని చివరి దశకు పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో కేవలం 57 స్థానాలకే పోలింగ్ జరగనున్నప్పటికీ.. అధికార బీజేపీకి ఇది అత్యంత కీలకం కానుంది. ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలు, బిహార్‌లో 8, పశ్చిమబెంగాల్‌లో 9, ఒడిసాలో 6, ఝార్ఖండ్‌లో 3 స్థానాలతోపాటు పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్‌లోని మొత్తం 4 స్థానాలకు చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ నుంచి ప్రధాని మోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ సిటింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో రంగంలో ఉన్న ప్రముఖులు. యూపీలో బీజేపీకి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వారాణసి నుంచి రెండుసార్లు ఎన్నికైన నరేంద్రమోదీకి తిరుగులేనప్పటికీ.. పట్టువదలని విక్ర మార్కుడిలా పోరాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్ ఈసారి కాశీలో మార్పు కనిపిస్తోందని చెప్పుకొంటున్నారు. మోదీ స్థానికుడు కాదని, ‘బచేగా కాశీ.. హఠేగా ప్రవాసీ (ప్రవాసిని పక్కకు తప్పించి కాశీని కాపాడాలి)’ అంటూ ప్రచారం చేస్తున్నారు. పంజాబ్‌లోని 13 సీట్లలో గత లోక్‌సభ ఎన్నికల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి కూడా మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ఉఽధృతంగా ప్రచారం చేసింది. రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అయితే ఇక్కడ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రె్‌సను గట్టిగా ఢీకొంటోంది. కేజ్రీవాల్ బెయిల్‌పై వచ్చి పంజాబ్‌లో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ఎంత మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఒడిసాలో పోలింగ్ జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లో కనీసం రెండు చోట్ల బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక బిహార్‌లో రాజధాని పట్నాతోపాటు నలందా, పాటలీపుత్ర, అర్హా, ససారామ్, బక్సార్ వంటి కీలక స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్‌కే సింగ్ తలపడుతున్నారు. ఇక హిమాచల్‌లో గత రెండు ఎన్నికల్లో మొత్తం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ సాఽధిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది.