House Demolished: ఉత్తరాఖండ్ టన్నెల్ ‘హీరో’కి అన్యాయం.. ఇల్లు కూల్చివేత
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:52 PM
నిజ జీవితంలో సాహసోపేతమైన పనులు చేసిన వారిని, ముఖ్యంగా ఇతరుల ప్రాణాలను కాపాడిన వ్యక్తులను ‘రియల్ హీరో’లుగా (Real Hero) పరిగణిస్తారు. అంతేకాదు.. వాళ్లు అందించిన సేవలను గుర్తించి, తగిన బహుమతులతో సత్కరిస్తారు. కానీ.. ఒక రియల్ హీరో విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అవమానంతో పాటు అన్యాయం ఎదురైంది. అతని ఇంటిని కూల్చి వేశారు.
నిజ జీవితంలో సాహసోపేతమైన పనులు చేసిన వారిని, ముఖ్యంగా ఇతరుల ప్రాణాలను కాపాడిన వ్యక్తులను ‘రియల్ హీరో’లుగా (Real Hero) పరిగణిస్తారు. అంతేకాదు.. వాళ్లు అందించిన సేవలను గుర్తించి, తగిన బహుమతులతో సత్కరిస్తారు. కానీ.. ఒక రియల్ హీరో విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అవమానంతో పాటు అన్యాయం ఎదురైంది. అతని ఇంటిని కూల్చి వేశారు. అంతేకాదు.. పోలీస్ స్టేషన్‌లో బంధించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (Delhi Development Authority - DDA) అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసేందుకు ఒక స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఏదైనా ఇల్లు అక్రమంగా నిర్మించారని నోటీసులు అందితే చాలు.. వెంటనే ఆ ఇళ్లను ధ్వంసం చేసేస్తున్నారు. ఇందులో భాగంగా.. గతేడాది ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో (Uttarakhand Tunnel Rescue Operation) అత్యంత కీలక పాత్ర పోషించిన వకీల్ హసన్‌కు (Vakeel Hassan) చెందిన ఇంటిని కూల్చివేశారు. ఈశాన్య ఢిల్లీలోని ఖజురీ ఖాస్ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే తాము కూల్చివేతలు చేపట్టామని డీడీఏ అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. హసన్, ఇతర నివాసితులు మాత్రం తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారని వాదిస్తున్నారు.
ఈ సందర్భంగా హసన్ మాట్లాడుతూ.. ‘‘నా పేరు వకీల్ హసన్. ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా టన్నెల్‌లో (Silkyara Tunnel) చిక్కుకున్న 41 కార్మికులను రక్షించినందుకు గాను.. మాకు లభించిన ప్రతిఫలం మా ఇంటిని కూల్చివేయడం. ఇప్పుడు నాకు సహాయం కావాలి. నాతో పాటు నా పిల్లల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ప్రతిఘటించినందుకు మాలో కొందరిని కొట్టారు కూడా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో.. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరొక మైనర్ మున్నా ఖురేషీ ఈ వ్యవహారంలో తన ఆందోళనని పంచుకున్నాడు. ‘‘మాకు ఇల్లు ఇచ్చి, సుఖంగా జీవించే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, అందుకు భిన్నంగా మా టీం సభ్యుల్లో ఒకరి ఇంటిని అన్యాయంగా లాక్కున్నారు’’ అని చెప్పుకొచ్చాడు.
అయితే.. డీడీఏ అధికారులు మాత్రం ఈ వాదనల్ని తోసిపుచ్చుతున్నారు. తాము ఈ ఇళ్లను కూల్చివేయడానికి ముందే నివాసితులకు ముందస్తు సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. వాళ్లు ఎక్కడైతే ఇళ్లను నిర్మించుకున్నారు.. ఆ భూమి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కేటాయించడం జరిగిందని వివరణ ఇచ్చారు. మరి, నివాసితుల్ని జైల్లో ఎందుకు ఉంచారన్న విషయంపై మాత్రం వాళ్లు స్పందించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి