Tanikella Bharani : అక్షరమే నాకు అన్నం పెట్టింది
ABN , Publish Date - Aug 11 , 2024 | 06:00 AM
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.
సండే సెలబ్రిటీ
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి. ఆయనకు ఇప్పుడు గౌరవ డాక్టరేట్ లభించడంతో నలభై ఏళ్ల సినీ జీవితానికి సార్థకత చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణితో ‘నవ్య’ ముచ్చట్లు.
ఏ కళాకారుడికైనా ఇటువంటి పురస్కారాలు టానిక్‌లా పనిచేస్తూ ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. అయితే డాక్టరేట్ కానీ, లోకనాయక సాహిత్య పురస్కారం కానీ నేను ఊహించనవి. సాహిత్య సేవ అనే పదానికి నేను వ్యతిరేకిని. ఎందుకంటే సాహిత్యానికి కానీ, కళకు కానీ నేనేమీ సేవ చేయలేదు. నాకు అన్నం పెట్టింది అక్షరమే! సాహిత్యాన్ని నమ్ముకుని రచయితగా కొనసాగుతున్నా. దాని ప్రభావమే ఈ డాక్టరేట్ అని నమ్ముతున్నా. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.
మీ కెరీర్‌లో ‘ఆట కదరా శివా’ అనిపించిన సందర్భాలున్నాయా?
సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ నాటకాలు ఆడితే చాలనుకున్నా. నా నాటకం చూసి ఓ నిర్మాత రచయితగా అవకాశం ఇవ్వడం ఒక ఆట. సినిమా వాతావరణం నచ్చక నేను వెనక్కి తిరిగి వచ్చేసి మళ్లీ ఉద్యోగం చేసుకోవడం మరో ఆట. నేను తొలిసారిగా రచన చేసిన ‘కంచు కవచం’ చిత్రంలో డైలాగులు బాగున్నాయని ఓ నిర్మాత భావించి మళ్లీ నన్ను పిలిపించడం ఇంకో ఆట. ఆ సినిమా అయ్యాక ఇక్కడ హిపోక్రసీ ఎక్కువ అని భావించి మళ్లీ వెనక్కి వచ్చేశాను.
ఇదో ఇంకో ఆట. ఆ తర్వాత ‘లేడీస్ టైలర్’ సినిమాకు అవకాశం రావడం, నాకు పేరు రావడంతో ఇక మళ్లీ వెనక్కి తిరిగివచ్చే అవకాశం కలగలేదు. ఇదంతా నేను డిజైన్ చేసింది కాదు. అందుకే అంటుంటాను.. ‘ఆట కదరా శివా’ అని. ఊహించని అద్భుతం జరిగిందని అనుకోండి. అదీ ఆటే అనుకుంటాను. మా నాన్నగారు మరణించిన కొన్ని రోజులకు ఈవీవీ సత్యనారాయణగారి షూటింగ్‌కు వెళ్లాను. ఆయన నా దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి ‘ఆట కదరా శివా’ అన్నారు. దానిలో ఎంత అర్థం ఉందో మీరే ఊహించండి. నా దృష్టిలో ‘ఆట కదరా శివా’ అనేది ఒక మాట కాదు.. జీవన మంత్రం.
నలభై ఏళ్ల కెరీర్.. ఎనిమిది వందల చిత్రాలు.. అందులో మూడొందలకు పైగా తండ్రి పాత్రలు.. మీకు రొటీన్‌గా అనిపించలేదా?
దర్శకుడు తేజ తీసిన ‘చిత్రం’తో తండ్రి పాత్రలు మొదలయ్యాయి. వంద సినిమాల వరకూ తండ్రి పాత్రలు పరవాలేదనిపించాయి. ఆ తర్వాత కూడా ఆ తరహా పాత్రలే వస్తుండడంతో తండ్రి పాత్రలకే ఫిక్స్ చేసేస్తారేమోనని భయపడి ఇక నేను చెయ్యనయ్యా.. అని చెప్పడం ప్రారంభించాను. అలా ఈ ఏడాది పదకొండు మంది దర్శకులకు చెప్పేశా. వీళ్లలో తమిళ దర్శకుడు మణిరత్నంగారు కూడా ఉన్నారు. ఈ నెల 15న విడుదలవుతున్న ‘మిస్టర్ బచ్చన్’లో మాత్రం రవితేజకు తండ్రిగా నటించా. అది రెగ్యులర్‌కు భిన్నమైన రోల్.
మీకు సినిమాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమా?
అవును. మంచి పాత్రలు, డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తే మాత్రమే చేద్దామని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది. పుస్తకాలు చదవడం నాకు వ్యసనం. వంట కూడా వచ్చు. సరదాగా అప్పుడప్పుడు వంట కూడా చేస్తుంటాను.
నటన తగ్గించుకొని సినిమాలకు రచన చేసే అవకాశం ఉందా?
నేను రచయితగా 52 చిత్రాలకు రాశాను. రచయితగా ఏమీ సంపాదించుకోలేదు. ‘శివ’లో వేషం వెయ్యగానే ‘ఇక మీరు పెన్ను మూసుకోవచ్చు’ అని రాంగోపాల్ వర్మ చెప్పాడు. ‘యమలీల’లో తోట రాముడు పాత్ర బాగా క్లిక్ అయింది. ఆ సినిమా తర్వాత ఒకే ఏడాదిలో 26 సినిమాల్లో నటించా. అప్పట్లో లేదు కానీ ఇప్పుడు రచయితలకు మంచి పారితోషికాలు ఇస్తున్నారు. పెద్ద సినిమాలకు రచన చేసే అవకాశం వస్తే నటుడిగా నాలుగైదు చిత్రాలు వదిలేసైనా రాస్తా. ఇప్పుడు దర్శకులే రచన కూడా చేస్తున్నారు కనుక అది జరగదని అనుకుంటున్నాను. ‘కథ బ్రహ్మండంగా ఉంది, మాటలు రాయడంవల్ల నాకు, ఆ సినిమాకూ ఉపయోగం’ అనిపిస్తే తప్పకుండా రాస్తా.
‘మిథునం’ తర్వాత మీరు మెగాఫోన్ పట్టకపోవడానికి కారణం?
పడుతున్నా. ఆ వార్త ‘ఆంధ్రజ్యోతి’కే మొదట చెబుతున్నా. నవంబరు నుంచి ‘మిధునం’ తరహాలో మరో మంచి చిత్రం తీయబోతున్నా.
మణిరత్నం దర్శకత్వంలో మీరు నటిస్తున్నారని తెలిసింది..!
అవును. వాస్తవానికి ‘దళపతి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే అది తండ్రి పాత్ర. నా వయసుకు మించిన పాత్ర. విగ్గు పెట్టుకుని నటిస్తానని చెప్పినా మణిరత్నంగారు ఒప్పుకోలేదు. చివరకు ఆ వేషం అమ్రి్‌షపురి వేశారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియన్ సెల్వం’ తెలుగు వెర్షన్‌కు నాతో డైలాగులు రాయించారు మణిరత్నంగారు. ఆ సినిమాలో జయరామ్ పోషించిన పాత్రకు నాతో డబ్బింగ్ చెప్పించారు. అప్పుడే ఆయన్ని అడిగాను.. ‘మీ దర్శకత్వంలో నటించే అవకాశం ఇవ్వండి. అయితే తండ్రి పాత్ర మాత్రం ఇవ్వకండి ప్లీజ్’ అని. ప్రస్తుతం కమల్‌గారితో ఆయన తీస్తున్న చిత్రంలో నాకు చాలా పెద్ద వేషం ఇచ్చారు. నెగెటివ్ టచ్ ఉన్న వేషం. ఇప్పటికి 30 రోజులు వర్క్ చేశాను. ఇంకో ఐదు రోజులు చేయాలి.
‘దిక్సూచి’ వెబ్ పేజీలో సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా ఈ కింది యూఆర్‌ఎల్ https/ejothy.com/SkrdlXQ లో చదవండి.