India vs Zimbabwe: దంచికొట్టిన భారత బ్యాటర్లు.. జింబాబ్వేకి భారీ లక్ష్యం
ABN , Publish Date - Jul 10 , 2024 | 06:28 PM
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆది నుంచే పరుగుల మోత మోగించేశారు. దీంతో.. భారత జట్టు..
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆది నుంచే పరుగుల మోత మోగించేశారు. దీంతో.. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (66) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్ (49), యశస్వీ జైస్వాల్ (36) మెరుపులు మెరిపించడంతో.. జింబాబ్వేకి భారత జట్టు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గత మ్యాచ్‌లో సెంచరీతో ఊచకోత కోసిన అభిషేక్ (10) మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకి ఓపెనర్లు శుభారంభాన్నే అందించారు. యశస్వీ, శుభ్‌మన్ గిల్ కలిసి ఎడాపెడా షాట్లతో దుమ్ముదులిపేశారు. తొలి వికెట్‌కి వీళ్లిద్దరు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే.. ఇంతలోనే యశస్వీ ఒక షాట్ కొట్టబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ సైతం క్రీజులో ఎక్కువసేపు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. కాసేపు విధ్వంసం సృష్టించాడు. గిల్, రుతు.. ఇద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.
ఆ ఇద్దరి ఆటగాళ్ల దూకుడు చూసి.. భారత్ ఈసారి కూడా 200 పరుగుల మైలురాయిని అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆ ఇద్దరు ఔట్ అవ్వడంతో భారత్ స్కోరు కాస్త నెమ్మదించింది. ఫైనల్‌గా.. భారత్ స్కోరు 182/4గా నమోదైంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా తలా రెండు వికెట్లు తీశారు. మిగతా వాళ్లు మాత్రం భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. మరి.. 183 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ఛేధిస్తుందా? లేదా? అనేది చూడాలి.
Read Latest Sports News and Telugu News