India vs Australia : ఆఖర్లో..ఆ రనౌట్‌తో!
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:25 AM
అంతా బాగుందనుకున్న వేళ.. బ్యాటర్ల అనూహ్య తడబాటు భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది. ఓవైపు యశస్వీ జైస్వాల్ (82) సెంచరీ ఖాయమనిపించేలా క్రీజులో కుదురుకున్నాడు.
అంతా తారుమారు
భారత్ తొలి ఇన్నింగ్స్ 164/5
జైస్వాల్ అర్ధసెంచరీ
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 474
స్టీవ్ స్మిత్ శతకం
మెల్‌బోర్న్: అంతా బాగుందనుకున్న వేళ.. బ్యాటర్ల అనూహ్య తడబాటు భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది. ఓవైపు యశస్వీ జైస్వాల్ (82) సెంచరీ ఖాయమనిపించేలా క్రీజులో కుదురుకున్నాడు. మరోవైపు తన బలహీనతను అధిగమిస్తూ దీటుగా నిలబడిన విరాట్ కోహ్లీ (36). వీరిద్దరి ఆటతో బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు టీమిండియా ఓ దశలో 153/2తో పటిష్టంగా కనిపించింది. కానీ జైస్వాల్ రనౌట్ అంతా మార్చివేసింది. ఒక్కసారిగా ఆసీస్ పోటీలోకి రావడంతో 6 పరుగుల తేడాతో భారత్ మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టీమిండియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 164/5 స్కోరు చేసింది. ఇప్పటికే సగం జట్టు పెవిలియన్‌కు చేరగా, భారత్ ఫాలోఆన్ గండం దాటాలంటే మరో 111 పరుగులు చేయాల్సి ఉంది. ఇక భారమంతా క్రీజులో ఉన్న పంత్ (6 బ్యాటింగ్), జడేజా (4)పైనే ఉంది. ఆ తర్వాత నితీశ్, సుందర్ కూడా బ్యాటర్లే కావడం సానుకూలాంశం. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) వరుసగా రెండో శతకం సాధించగా, కమిన్స్ (49) సహకరించాడు. బుమ్రాకు నాలుగు, జడేజాకు మూడు, ఆకాశ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్మిత్ శతకం: 311/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు స్మిత్, కెప్టెన్ కమిన్స్ భారీ స్కోరుకు దోహదపడ్డారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఇద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరును పెంచారు. ఈ జోరుతో స్మిత్ కెరీర్‌లో 34వ శతకం పూర్తి చేశాడు. అనంతరం తను మరింత దూకుడుతో ఆడడంతో స్కోరు 400 దాటింది. అయితే ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించాక జడ్డూ ఓవర్‌లో కమిన్స్ వెనుదిరిగాడు. తొలి సెషన్‌లో ఆసీస్ 143 పరుగులు సాధించడం విశేషం. ఆ తర్వాత బ్రేక్ ముగిసిన తొలి రెండు ఓవర్లలోనే ఆసీస్ స్టార్క్ (15), స్మిత్ వికెట్లను కోల్పోయింది. కాసేపటికే చివరి వికెట్ లియోన్ (13)ను బుమ్రా అవుట్ చేయడంతో దాదాపు మూడున్నర గంటల ఆసీస్ పోరాటం ముగిసింది.
ఓపెనర్‌గా వచ్చినా.. : జైస్వాల్‌కు జతగా రోహిత్ (3) ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కానీ అతడు ఈ టెస్టులోనూ నిరాశపర్చాడు. రెండో ఓవర్‌లోనే అతడిని కమిన్స్ వెనక్కి పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ (24) తిరిగి జైస్వాల్‌కు జత కలిశాడు. ఇద్దరూ ఆచితూచి ఆడారు. మూడు ఫోర్లతో చక్కగా కుదురుకున్న రాహుల్ టీబ్రేక్‌కు ముందు ఓవర్‌లో కమిన్స్‌కు చిక్కాడు. ఈ సెషన్‌లో 15 ఓవర్లు ఆడిన భారత్ 51/2తో నిలిచింది.
జైస్వాల్-విరాట్ అండగా.. : ఆఖరి సెషన్‌లో అధిక భాగం భారత్ ఆధిపత్యం చూపింది. జైస్వాల్-విరాట్ జోడీ ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్‌కు ఆశలు కల్పించారు. అలాగే ఆఫ్‌సైడ్ బంతులను వదిలేస్తూ విరాట్ ఈసారి సరైనరీతిలో ఆడాడు. అటు జైస్వాల్ సహజశైలిలో ఆడేస్తూ బౌండరీలు రాబట్టాడు. ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్ బౌలర్లను మార్చినా, ఫీల్డింగ్‌ను మోహరించినా ఫలితం లేకపోయింది.
ఆఖరి 20 నిమిషాల్లో..
జైస్వాల్-విరాట్ మధ్య మూడో వికెట్‌కు అప్పటికే వంద పరుగులు జత చేరాయి. ఇక ఆట ముగిసేందుకు 20 నిమిషాలే ఉంది. స్కోరు 153/2. వీరి ఆటనుచూస్తే మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగిస్తారనిపించింది. కానీ ఇద్దరిమధ్య సమన్వయలోపంతో భారీమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 41వ ఓవర్ చివరిబంతికి జైస్వాల్ సింగిల్‌ను ఆశించాడు. ఈ క్రమంలో మిడాన్ వైపు బంతిని ఆడి వేగంగా నాన్‌స్ట్రయిక్ ఎండ్‌వైపు వచ్చాడు. అటు విరాట్ ఇదేమీ గమనించకుండా బంతిని చూస్తూ అక్కడే ఉండిపోయాడు. దీంతో ఇద్దరూ ఒకే వైపునకు చేరడంతో కీపర్ క్యారీ స్ట్రయిక్ ఎండ్ వికెట్లను గిరాటేయడంతో యశస్వీ రనౌటయ్యాడు. దీంతో మూ డో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఏకాగ్రత కోల్పోయిన విరాట్ ఓవర్ వ్యవధిలో మళ్లీ ఆఫ్‌సైడ్ ఆవలి బంతిని ఆడి క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే నైట్ వాచ్‌మన్ ఆకాశ్ డకౌట్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో రోజును ముగించింది.
కోహ్లీని గేలి చేసిన ఆసీస్ ఫ్యాన్స్
ఈ సిరీస్‌లో కోహ్లీకి కలిసి రావడంలేదు. ఆసీస్ అరంగేట్రం ఆటగాడు కాన్‌స్టా్‌సను ఢీకొని విమర్శలపాలైన కోహ్లీని రెండోరోజు ఆటలో ఆసీస్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. దీంతో అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న కోహ్లీ (36 పరుగులు) వెనక్కివచ్చి మరీ తనను గేలిచేసిన వారున్న స్టాండ్‌వైపు ఆగ్రహంగా చూశాడు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది విరాట్‌ను లోపలికి పంపించారు.
గ్రౌండ్‌లోకి ఆగంతకుడు
రెండోరోజు ఆటలో ఓ ఆగంతకుడు మైదానంలోకి రావడం కలకలం రేపింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అతడు ముందుగా రోహిత్ వైపు వెళ్లగా అతడు వెంటనే పక్కకు తప్పుకొన్నాడు. దీంతో విరాట్‌ను సమీపించి భుజంపై చేయి వేసి ప్రేక్షకుల వైపు అభివాదం చేస్తూ కనిపించాడు. ఈ సమయంలో విరాట్ ప్రశాంతంగానే ఉండి అతడిని సెక్యూరిటీకి అప్పగించాడు.
నమ్మకం లేనప్పుడు ఇద్దరు స్పిన్నర్లు ఎందుకు?
రెండో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడాన్ని మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 52వ ఓవర్ వరకు అతడి చేతికి కెప్టెన్ రోహిత్ బంతి ఇవ్వనేలేదు. అప్పటికే జట్టు స్కోరు 171/2గా ఉంది. ఓవరాల్‌గా అతడు వేసింది 15 ఓవర్లే. శుక్రవారం లంచ్ విరామ సమయంలో శాస్ర్తి మాట్లాడుతూ ‘భారత్‌కు ప్రణాళిక లేకుండా పోయింది. అనుకున్నరీతిలో స్పిన్నర్లను ఉపయోగించుకోవడం లేదు. సుందర్‌ను అంత ఆలస్యంగా దించేట్టయితే ఇక ఇద్దరు స్పిన్నర్లతో ఆడడమెందుకు? స్పిన్నర్లపై నమ్మకం లేనప్పుడు ఇద్దర్ని తీసుకోవడం అవసరమా?’ అని ఘాటుగా ప్రశ్నించాడు.
స్కోరుబోర్డు
ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్ : కాన్‌స్టా్‌స్(ఎల్బీ) జడేజా 60; ఖవాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లీ (బి) సుందర్ 72; స్మిత్ (బి) ఆకాశ్ 140; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; క్యారీ (సి) పంత్ (బి) ఆకాశ్ 31; కమిన్స్ (సి) నితీశ్ (బి) జడేజా 49; స్టార్క్ (బి) జడేజా 15; లియోన్ (ఎల్బీ) బుమ్రా 13; బోలాండ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు: 27; మొత్తం: 122.4 ఓవర్లలో 474 ఆలౌట్; వికెట్ల పతనం: 1-89, 2-154, 3-237, 4-240, 5-246, 6-299, 7-411, 8-455, 9-455, 10-474.బౌలింగ్: బుమ్రా 28.4-9-99-4; సిరాజ్ 23-3-122-0; ఆకాశ్ 26-8-94-2; జడేజా 23-4-78-3; నితీశ్ 7-0-21-0; సుందర్ 15-2-49-1.
భారత్ తొలి ఇన్నింగ్స్ : జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలాండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; విరాట్ (సి) క్యారీ (బి) బోలాండ్ 36; ఆకాశ్ (సి) లియోన్ (బి) బోలాండ్ 0; పంత్ (బ్యాటింగ్) 6; జడేజా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 46 ఓవర్లలో 164/5. వికెట్ల పతనం: 1-8, 2-51, 3-153, 4-154, 5-159; బౌలింగ్: స్టార్క్ 13-0-48-0; కమిన్స్ 13-2-57-2; బోలాండ్ 12-3-24-2; లియోన్ 5-1-18-0; మార్ష్ 3-0-15-0.