Share News

TS News: భద్రాద్రి గుదిబండ

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:04 AM

కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌తో రానున్న 25 ఏళ్ల కాలంలో రూ.9 వేల కోట్ల దాకా భారం ప్రజలపై పడుతుందని తెలంగాణ విద్యుత్‌ రంగ నిపుణుడు కంచర్ల రఘు ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ కేంద్రాలతో పోలిస్తే ప్లాంటు స్వీయ కరెంటు వినియోగం, హీట్‌రేట్‌, నిర్వహణ ఖర్చులు కలుపుకొని భద్రాద్రిలో ఏటా రూ.350 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని చెప్పారు.

TS News: భద్రాద్రి గుదిబండ

  • పవర్‌ ప్లాంట్‌ను కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టారు

  • రానున్న పాతికేళ్లలో ప్రజలపై 9 వేల కోట్ల భారం

  • యాదాద్రితో ఏటా రూ.1,600 కోట్ల రవాణా ఖర్చు

  • ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తుతో మొత్తం 3,385 కోట్ల నష్టం

  • జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు కె.రఘు నివేదన

  • కేసీఆర్‌ నిర్ణయాలతో రూ.81 వేల కోట్ల అప్పులు

  • క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలి: కోదండరాం

ABN ఛానల్ ఫాలో అవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌తో రానున్న 25 ఏళ్ల కాలంలో రూ.9 వేల కోట్ల దాకా భారం ప్రజలపై పడుతుందని తెలంగాణ విద్యుత్‌ రంగ నిపుణుడు కంచర్ల రఘు ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ కేంద్రాలతో పోలిస్తే ప్లాంటు స్వీయ కరెంటు వినియోగం, హీట్‌రేట్‌, నిర్వహణ ఖర్చులు కలుపుకొని భద్రాద్రిలో ఏటా రూ.350 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికే ఆయన విద్యుత్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌కు ఈ అంశంపై ఫిర్యాదు చేయగా, వాటిపై స్పష్టత కోసం కమిషన్‌ ఆయనకు కబురు పంపించింది. దాంతో మంగళవారం ఆయన బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డితో భేటీ అయ్యారు.


విద్యుత్‌ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అందువల్ల జరిగిన నష్టాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం కె.రఘు తమ సమావేశంలో చర్చించిన అంశాలను విలేకరులకు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ను కాపాడే పేరుతో మరో ప్రభుత్వరంగ సంస్థను బలి చేయడం సరికాదని రఘు అన్నారు. పోటీ బిడ్డింగ్‌తో తక్కువ ధరకు ప్లాంట్ల నిర్మాణం జరిగే అవకాశాలుండగా, బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. యాదాద్రిని మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన బీహెచ్‌ఈఎల్‌ తొమ్మిదేళ్లయినా పూర్తి చేయలేక పోయిందన్నారు. భద్రాద్రిని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పినా ఏడేళ్లు పట్టిందని చెప్పారు. 2013–14లో బీహెచ్‌ఈఎల్‌ పోటీ బిడ్డింగ్‌లో పాల్గొని టెండర్లు దక్కించుకునే సమర్థత 88% కలిగి ఉండగా... 2015–16 నాటికి శూన్యస్థాయికి చేరిందని 2017లో స్వయంగా కాగ్‌ పేర్కొందని గుర్తు చేశారు. ఎల్‌1 కన్నా 88 శాతం అధికంగా ఛార్జీలు కోట్‌ చేయడమే బీహెచ్‌ఈఎల్‌ పోటీ బిడ్డింగ్‌లలో నెగ్గలేని పరిస్థితికి కారణమని కాగ్‌ పేర్కొందని ప్రస్తావించారు.


ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంతో రూ.3,385 కోట్ల నష్టం

తెలంగాణ సర్కారు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం వల్ల అన్నిరకాలుగా రూ.3,385 కోట్ల నష్టం జరిగిందని కె.రఘు అన్నారు. అదే సమయంలో పోటీ బిడ్డింగ్‌కు వెళ్లడం వల్ల కేరళ రాష్ట్రానికి యూనిట్‌ కరెంట్‌ రూ.3.60కే వచ్చిందని గుర్తు చేశారు. 1000 మెగావాట్ల కరెంట్‌ను తీసుకోవడానికి ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ మేరకు ఆ రాష్ట్రం కరెంట్‌ ఇవ్వక పోవడంతో ఆ స్థానంలో బహిరంగ విపణిలో కొన్న విద్యుత్‌ వల్ల రూ.2 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడిందన్నారు. కరెంట్‌ కొనుగోళ్లు చేసినా ఛత్తీస్‌గఢ్‌కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా వడ్డీలు/పెనాల్టీల రూపంలో లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ కింద రూ.750 కోట్లు చెల్లింపులు చేస్తున్నారని చెప్పారు. 1000 మెగావాట్ల కోసం పవర్‌గ్రిడ్‌ కారిడార్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ కరెంట్‌ను ఆ మేరకు కారిడార్‌ నుంచి తరలించక పోవడం వల్ల రూ.635 కోట్ల చార్జీలు కలుపుకొని ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌తో రూ.3385 కోట్ల భారం తెలంగాణపై పడిందని వెల్లడించారు. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద రూ.261 కోట్ల పరిహారం చెల్లించాలని పవర్‌గ్రిడ్‌ నోటీసు ఇచ్చిందని ప్రస్తావించారు. ఈ కేసు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో ఉందని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి నుంచి అనుమతే లేదని, ఒప్పందంలో పలు మార్పులు చేయాలని, 2017 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పులో నియంత్రణ మండలి చెప్పిందని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదని, ఏడేళ్లు అవుతున్నా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి(పీపీఏ)కు ఈఆర్‌సీ అనుమతే తీసుకోలేదని స్పష్టం చేశారు.


భద్రాద్రితో రూ.9 వేల కోట్ల భారం

దేశవ్యాప్తంగా సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో విద్యుత్‌ ప్లాంట్లు నిర్మిస్తున్న తరుణంలో ఎప్పుడో 2010లో 2010లో ఇండియా బుల్‌ సంస్థ కోసం సబ్‌క్రిటిక ల్‌ టెక్నాలజీతో తయారుచేసిన జనరేటర్లు, టర్బయిన్లు వినియోగంలో లేకుండా ఉన్నాయని, వాటిని వినియోగించి, రెండేళ్లలో ప్లాంట్‌ను పూర్తి చేస్తామని చెప్పి కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి పూనుకున్నారని కె.రఘు తెలిపారు. దీనివల్ల సూపర్‌ క్రిటికల్‌తో పోల్చుకుంటే ఏడాదికి రూ.350 కోట్ల అదనపు భారం పడుతోందని, ప్లాంటు జీవితకాలంలో 25 ఏళ్లకు నష్టం రూ.9 వేల కోట్లకు చేరుతుందని వివరించారు. 15 ఏళ్లు దాటిన తర్వాత ప్లాంటులో ఉత్పన్నమయ్యే సమస్యలు భద్రాద్రి ప్లాంటులో ఇప్పటికే వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్‌ నిర్మాణానికి ఎంచుకున్న ప్రదేశం కూడా సరైనది కాదన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయి, పూర్తి స్థాయిలో నీటిని నింపితే వరద వచ్చినపుడు భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ మునుగుతుందని స్వయంగా గత ప్రభుత్వమే పోలవరం అథారిటీ దృష్టికి తీసుకొచ్చిందని కె.రఘు గుర్తు చేశారు. సీతమ్మ సాగర్‌ బ్యారేజీ పూర్తయినా ఈ ప్లాంట్‌ కోసం వేసిన లైన్లు మునుగుతాయని చెప్పారు. గతంలో గోదావరి వరదలతో పలు సందర్భాల్లో నిర్మాణ పనులు నిలిచి పోయాయని కె.రఘు ప్రస్తావించారు.


యాదాద్రితో ఏటా 1600 కోట్ల రవాణాభారం

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో బొగ్గు/నీటి నిల్వలు ఉన్నచోటే ప్లాంట్‌లు కట్టాలని పోరాటాలు జరిగాయని కె.రఘు గుర్తు చేశారు. బొగ్గు గనులు, నీళ్లు అందుబాటులో ఉన్న గోదావరి తీరంలో ప్లాంట్‌లు కట్టాలని స్వయంగా కేంద్ర విద్యుత్‌ అథారిటీ(సీఈఏ) పలు దఫాలుగా గుర్తు చేసినా గనులకు 280 కిలోమీటర్ల సగటు దూరంలో యాదాద్రి ప్లాంట్‌ కడుతున్నారని చెప్పారు యాదాద్రికి ఏటా బొగ్గు రవాణా చేయడానికి అయ్యే భారం ఏటా 1600 కోట్లుగా ఉంటుందని తెలిపారు. కాగా, జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌తో బుధవారం విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి భేటీ కానున్నారు.


నిందలేసి తప్పించుకుంటారా: కోదండ

ఇతరులపై నిందలు వేసి, జరిగిన తప్పుల్లో తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ ఉన్నారని టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డిని కలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. పదేళ్ల కాలంలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో విద్యుత్‌ సంస్థలు రూ.81 వేల కోట్ల అప్పులపాలు అయ్యాయన్నారు. కేసీఆర్‌ నిర్ణయాల ఫలితంగా విద్యుత్‌ రంగం కుప్పకూలిందని, దీనిపై క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌కు అన్ని ఖర్చులు కలుపుకొని యూనిట్‌కు రూ.7 దాకా అయ్యిందన్నారు. పోటీ బిడ్డింగ్‌ను అనుసరించి ఉంటే యూనిట్‌ అప్పట్లో రూ.4.15కే లభించేదని చెప్పారు. విద్యుత్‌ ఒప్పందాల విషయంలో కేసీఆర్‌ చట్ట, న్యాయసమ్మతంగా వ్యవహరించారో లేదో చూసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టం కింద పైసా భారం లేకుండా 4 వేల మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించడానికి ఎన్‌టీపీసీ సిద్ధపడగా దానికి కేసీఆర్‌ సమ్మతించలేదన్నారు. తొలిదశ 1600 మెగావాట్లకే అంగీకారం తెలిపి, విద్యుత్‌సంస్థలపై భారం పడే నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 08:04 AM