Bandi Sanjay: టీటీడీకి, వక్ఫ్ భూములకు తేడా తెలియని అజ్ఞాని
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:44 AM
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. టీటీడీకి, వక్ఫ్ భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ అని విమర్శించారు.
అల్లా పేరుతో భూములు కబ్జా చేశారు
ఒవైసీపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. టీటీడీకి, వక్ఫ్ భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ అని విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు ఈరోజు పూర్తిగా బయటపడిందన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ వైకుంఠాధీశుడు కొలువైన పరమ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం. సిగ్గులేకుండా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింకు పెడతవా’ అని ఒవైసీని ప్రశ్నించారు.
వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందన్నారు. టీటీడీ తనకు వచ్చిన విరాళాలతో పేదలకు, హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తోందే తప్ప ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేయలేదన్నారు. ఒవైసీ దృష్టిలో భగవంతుడంటే వ్యాపారమేనని, అల్లా పేరు చెప్పుకొని భూములను దోచుకున్నాడని ఆరోపించారు. ఒవైసీ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్న పాతబస్తీ ముస్లిం సోదరులు ఇకనైనా వాస్తవాలు ఆలోచించాలని కోరారు.